Share News

కళాశాల... సమస్యలు చాలా!

ABN , Publish Date - May 28 , 2026 | 11:11 PM

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సమస్యలు తిష్ఠ వేశాయి. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బాలురకు వసతి గృహం లేకపోవడంతో అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవలసిన పరిస్థితి నెలకొంది.

కళాశాల... సమస్యలు చాలా!
ప్రహరీ గోడ లేకపోవడంతో పరదాలు కట్టి ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో కనీస వసతులు కరువు

మరుగుదొడ్లు లేక విద్యార్థినీ, విద్యార్థుల పాట్లు

గత్యంతరం లేక ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి

బాలుర వసతి గృహ నిర్మాణం పిల్లర్లకే పరిమితం

అద్దె గదుల్లో ఉంటూ విద్యార్థుల అవస్థలు

అనంతగిరి, మే 28 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సమస్యలు తిష్ఠ వేశాయి. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బాలురకు వసతి గృహం లేకపోవడంతో అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవలసిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినీ, విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా కళాశాల సమస్యలు పరిష్కారం కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల కేంద్రంలో 2002లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటైంది. కొంత కాలం వివిధ ప్రభుత్వ భవనాల్లో కళాశాలను నిర్వహించారు. ఆ తరువాత సొంత భవనం నిర్మించి అందులో కళాశాలను నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులు ఉండగా, సుమారు 350 మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రహరీ గోడ లేకపోవడంతో రక్షణ లేకుండా ఉంది. కళాశాల ప్రాంగణంలో పశువులు యథేచ్ఛగా సంచరించడం, రాత్రి వేళ మందుబాబులు ఇక్కడే మద్యం సేవిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రహరీ గోడ లేకపోవడంతో ప్రతి ఏడాది కర్రలతో దడికట్టి పరదాలతో నెట్టుకొస్తున్నారు. కాగా నాడు- నేడు రెండో విడతలో రూ.17 లక్షలతో బాలికలు, బాలురకు సంబంధించి పది మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. దాదాపు 80 శాతం పనులు పూర్తికాగా, ఆ తరువాత పనులు నిలిచిపోయాయి. దీంతో మరుగుదొడ్లు అందుబాటులోకి రాలేదు. దీని వలన విద్యార్థినీ, విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బాలుర వసతి గృహ నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. 2021-22లో బాలుర వసతి గృహం నిర్మాణానికి ట్రైబల్‌ వెల్ఫేర్‌ నిధులు రూ.2 కోట్లను కేటాయించారు. పిల్లర్ల వరకు పనులు జరిగి, ఆ తరువాత అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బిల్లులు అందకపోవడం వల్లే కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేసినట్టు తెలిసింది. ఇప్పటికైనా ప్రజాప్రతి నిధులు, అధికారులు స్పందించి జూనియర్‌ కళాశాలలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - May 28 , 2026 | 11:11 PM