Share News

కళాశాలల ఫీజులుం!

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:02 AM

ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ఫీజులు చెల్లించాలంటూ కొన్ని కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయి.

కళాశాలల ఫీజులుం!

గత విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాని వారికి తాఖీదులు

బకాయిలు చెల్లిస్తేనే సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతిస్తామంటున్న పలు కళాశాలల యాజమాన్యాలు

బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయానికి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు

విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):

ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ఫీజులు చెల్లించాలంటూ కొన్ని కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేసి బయటకు వెళ్లే విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసిన ప్రభుత్వం...మిగిలిన విద్యార్థులకు పెండింగ్‌లో పెట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాని విద్యార్థులకు ఇప్పుడు యాజమాన్యాలు తాఖీదులు ఇస్తున్నాయి.

సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరుకావాలంటే తప్పనిసరిగా ఫీజు బకాయిలు క్లియర్‌ చేయాలని ఆదేశాలు అందినట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఒకవేళ ఫీజులు చెల్లించకపోతే పరీక్షలకు హాజరుకానివ్వబోమంటూ కొన్ని కాలేజీలు స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వేలాది రూపాయలు ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఇంజనీరింగ్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, నర్సింగ్‌ వంటి కోర్సులు చదువుతున్న సుమారు 50 వేల మంది విద్యార్థులు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

సగమైన చెల్లించేందుకు..

కొన్ని కాలేజీల యాజమాన్యాలు పరీక్షలకు ముందు సగం, తరువాత సగం చెల్లించాలని చెబుతున్నాయి. యాజమాన్యాల ఒత్తిడితో అప్పోసొప్పో చేసి ఫీజు చెల్లించేందుకు కొందరు విద్యార్థులు సిద్ధపడుతున్నారు. మరికొందరు ఎంవీపీ కాలనీలోని బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చి తమ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని అధికారులు పేర్కొంటున్నారు.

యాజమాన్యాల వాదన ఇలా..

గడిచిన ఏడాదికాలంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. కాలేజీల నిర్వహణ, ఫ్యాకల్టీ జీతాలు, ఇతర ఖర్చులకు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తోందంటున్నాయి. మరోవైపు కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని, లేకపోతే ప్రవేశాలకు అనుమతులు పొందడం కష్టమవుతోందని యాజమాన్యాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను ఫీజులు అడుగుతున్నామని, ప్రభుత్వం విడుదల చేసినట్టయితే వెనక్కి ఇచ్చేస్తామంటూ స్పష్టమైన హామీ ఇస్తున్నట్టు ఒక కాలేజీ ప్రతినిధి తెలిపారు.

Updated Date - Oct 03 , 2026 | 01:02 AM