గిరిజన ప్రాంతాలకు కలెక్టర్లే ప్రభుత్వ ఏజెంట్లు
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:11 PM
రాజ్యాంగం ఐదో షెడ్యూల్‌లో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇన్నాళ్లుగా ప్రభుత్వ ఏజెంట్లుగా ఉన్న ఐటీడీఏ పీవోల స్థానంలో కలెక్టర్లను ప్రభుత్వ ఏజెంట్లుగా పరిగణిస్తూ మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.
ఐటీడీఏ పీవోలు ప్రభుత్వ ఏజెంట్లుగా ఉన్న నిబంధన సవరణకు క్యాబినెట్ ఆమోదం
పాడేరు, జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం ఐదో షెడ్యూల్‌లో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇన్నాళ్లుగా ప్రభుత్వ ఏజెంట్లుగా ఉన్న ఐటీడీఏ పీవోల స్థానంలో కలెక్టర్లను ప్రభుత్వ ఏజెంట్లుగా పరిగణిస్తూ మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పాలన ద్వారా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 1974లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థఽ(ఐటీడీఏ)లను ఏర్పాటు చేశారు. అలాగే వాటినినడిపించేందుకు ప్రాజెక్టు అధికారులను నియమించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో నిబంధనలు 1964లోని రూల్- 1(1)లో భాగంగా గిరిజన ప్రాంతానికి సంబంధించి ఐటీడీఏ పీవోలే ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించాలనే నిబంధనలను అమలు చేశారు. దీంతో గిరిజనులకు సంబంధించిన ప్రతి అంశంపై ఐటీడీఏ పీవోలే సుప్రీంగా వ్యవహరించారు. అయితే 2022లో గిరిజన ప్రాంతాల్లోనూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఐటీడీఏల పరిధిలోకి కలెక్టర్లు వచ్చారు. ఈ క్రమంలో పరిపాలనకు సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఆలోచనతో ఇన్నాళ్లుగా ప్రభుత్వ ఏజెంట్లుగా ఉన్న ఐటీడీఏ పీవోలను తప్పించి, కలెక్టర్లే ఇక నుంచి గిరిజన ప్రాంతాలకు ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించే బాధ్యతలను అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ నిబంధనలు 1964లోని రూల్-1(1)కు తగిన సవరణలు చేయాలనే అంశానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.