Share News

ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:02 AM

ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారి అవార్డుకు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఎంపికయ్యారు.

ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారి అవార్డుకు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. గడిచిన ఏడాది జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను సమర్థంగా నిర్వహించడంతో కలెక్టర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే, కలెక్టరేట్‌లోని ఎన్నికల సెల్‌లో పనిచేసిన డిప్యూటీ తహశీల్దార్‌ బీవీఎల్‌ నరసింహమూర్తి, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన వై.కల్యాణి కూడా అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.


త్వరలో ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0

సెల్లార్‌లలో ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోండి

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలోని వాణిజ్య సముదాయాల్లో సెల్లార్ల ఆక్రమణలను వాటి యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో సెల్లార్‌లలో ఆక్రమణలపై దృష్టిసారించామన్నారు. దీనికోసం పోలీస్‌ శాఖతో కలిసి సంయుక్తంగా ‘ఆపరేషన్‌ లంగ్స్‌ 3.0’కి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. సెల్లార్లలో కేవలం ప్రజా వాహనాల పార్కింగ్‌ కోసమే జీవీఎంసీ అనుమతులు జారీచేసిందని, కొందరు దీనికి విరుద్ధంగా ఇతర అవసరాలకు వాడుతున్నారన్నారు. దీనివల్ల ఆయా భవనాల్లోని దుకాణాలు, మాల్స్‌కు వచ్చేవారంతా తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపేస్తుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తక్షణం సెల్లార్ల ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కమిషనర్‌ స్పష్టంచేశారు.


స్టీల్‌ప్లాంటులో వీఆర్‌ఎస్‌కు గడువు పెంపు

ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖ స్టీల్‌ప్లాంటులో పనిచేస్తున్న ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని యాజమాన్యం ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తులను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించింది. మూడో దశ వీఆర్‌ఎస్‌ కోసం గత ఏడాది డిసెంబరు 24న ఉక్కు యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. అయితే కొద్దిమంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో గడువు పెంచినట్టు సమాచారం.

ప్లాంటు తొలి దఫా వీఆర్‌ఎస్‌లో గత ఏడాది మార్చి ఒకటో తేదీన 692 మంది అధికారులు, 631 మంది నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు, సెప్టెంబరు 30వ తేదీన రెండో దఫా వీఆర్‌ఎస్‌లో 377 మంది అధికారులు, 464 మంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు మొత్తం 1,008 మంది అధికారులు, 1,587 మంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. గత ఏడాది జనవరి ఒకటో తేదీకి ప్లాంటులో ఉద్యోగుల సంఖ్య 12,338 కాగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 9,311 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమందికి అనుమతిస్తారనే అంశంపై స్టీల్‌ప్లాంటులో జోరుగా చర్చ జరుగుతోంది.

గడువు పెంపు వెనుక అంతర్యమేమిటో ?

స్టీల్‌ప్లాంటులో వీఆర్‌ఎస్‌ కోసం యాజమాన్యం ఇప్పటివరకూ మూడుసార్లు నోటిఫికేషన్‌ ఇచ్చింది. తొలి రెండు నోటిఫికేషన్‌లలో పేర్కొన్న విధంగానే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, నెల ముందు నోటీసు ఇచ్చి వీఆర్‌ఎస్‌ అమలుచేసింది. ఈసారి గడువు తేదీని పొడిగించడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఈ క్రమంలోనే గడువు పెంచిందని కొంతమంది చెబుతున్నారు.


ఏయూలో తెరుచుకోని మెస్‌లు

భోజనం కోసం విద్యార్థుల ఇబ్బంది

విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. సంక్రాంతి సెలవులు ముగించుకుని వసతి గృహాలకు చేరిన విద్యార్థులు ఇక్కడి అధికారుల తీరుతో ఇబ్బంది పడుతున్నారు. వర్సిటీ అధికారులు డిసెంబరు 24 నుంచి జనవరి 18 వరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సెలవులు ప్రకటించారు. ఈ నెల 19 నుంచి తిరిగి హాస్టళ్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే, మంగళవారం వరకూ అనేక హాస్టళ్లలోని మెస్‌లను ప్రారంభించలేదు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు సోమవారం హాస్టళ్లకు చేరుకున్నారు. అయితే, హాస్టళ్లు తెరిచిన అధికారులు మెస్‌లు ప్రారంభించేలా చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై మంగళవారం ఉదయం ఏయూ ప్రధాన గేటు వద్ద కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెస్‌ చార్జీలను చెల్లించని విద్యార్థులకు భోజనం పెట్టేది లేదని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. అయితే, దీనిపై తాము ఎటువంటి ప్రకటన చేయలేదని అధికారులు చెబుతున్నారు. మెస్‌ బిల్లులు పెండింగ్‌ ఉన్న విద్యార్థులు వెంటనే వాటిని చెల్లించాలని కోరామని, ఈ మేరకు జాబితాలను హాస్టళ్ల వద్ద డిస్‌ప్లే చేశామన్నారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో అన్ని మెస్‌లను పూర్తిగా ఓపెన్‌ చేయలేదని రెక్టార్‌ కింగ్‌ తెలిపారు. బుధవారం నుంచి కామన్‌ మెస్‌లు ఓపెన్‌ చేస్తామని, పూర్తిస్థాయిలో విద్యార్థులు వచ్చిన తరువాత అన్ని మెస్‌లు ప్రారంభిస్తామని తెలిపారు.


12న ఉక్కు కార్మికుల సమ్మె

సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్‌

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

వచ్చే నెల 12న సమ్మె చేపట్టనున్నామని ఉక్కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్లాంటులో పనిచేస్తున్న నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని యాజమాన్యం త్వరితగతిన పరిష్కరించాలని, లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ నెల 13న స్టీల్‌ప్లాంటు సీఐటీయూ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో సమ్మె నిర్ణయం తీసుకున్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నవాటితో పాటు ఇటీవల యాజమాన్యం సృష్టించిన సమస్యలను పరిష్కరించాలని కార్మిక వర్గం డిమాండ్‌ చేస్తోంది. మరోసారి సమావేశమై యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని, బహిరంగ సభలు నిర్వహించి సమ్మె ఆవశ్యకతపై కార్మికవర్గాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవి...

- ఉత్పత్తి ఆధారిత వేతనాలపై యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

- పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు చెల్లించాలి

- నిలుపుదల చేసిన హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరించాలి

- టౌన్‌షిప్‌ క్వార్టర్స్‌లో నివాసితులకు విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

- ఈఎల్‌ పునరుద్ధరించాలి

- అధికారులకు ఇచ్చినట్టుగానే కార్మికులకు 15 సీఎల్స్‌ ఇవ్వాలి

- ఉక్కు ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి

- సెయిల్‌ మాదిరిగా గ్రాట్యుటీ రూ.25 లక్షలకు పెంచాలి

- పని ప్రదేశంలో భద్రత కల్పించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

- 24 గంటలు క్యాంటీన్లు అందుబాటులో ఉంచాలి

- స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలి

- ఈవోఐ టెండర్లను రద్దు చేయాలి

- తొలగించిన కాంట్రాక్టు కార్మికులకును బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి

- ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులకు న్యాయం చేయాలి

Updated Date - Jan 21 , 2026 | 01:02 AM