Share News

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:32 AM

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

18 నుంచి అమలులోకి...ఉత్తర్వులు జారీ

17వ తేదీతో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈనెల 17తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ పాలనా వ్యవహారాలను చక్కదిద్దడంతోపాటు కమిషనర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ ఉత్తర్వులు ఆరు నెలలపాటు అమలులో ఉంటాయని, ఆలోపు ఎన్నికలు జరిగితే రద్దవుతాయని పేర్కొంది. జీవీఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 11 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల కార్గవర్గాల పదవీకాలం కూడా ఈనెల 17తోనే ముగుస్తుండడంతో వాటికి కూడా ప్రత్యేక అధికారులను నియమించింది.


అమరావతికి కలెక్టర్‌

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):

అమరావతిలో బుధవారం నుంచి రెండు రోజులపాటు జరగనున్న సదస్సులో పాల్గొనేందుకు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ మంగళవారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఇంకా పరిశ్రమలకు భూముల కేటాయింపునకు సంబంధించిన వివరాలు తీసుకువెళ్లారు.


స్టీల్‌ప్లాంటు ఆపరేషన్స్‌ డైరక్టర్‌గా సుభాసిస్‌ సేన్‌గుప్తా

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా సుభాసిస్‌ సేన్‌ గుప్తా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం దుర్గాపూర్‌లోని సెయిల్‌లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (ప్రాజెక్ట్స్‌)గా పనిచేస్తున్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్రస్తుత ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ పురుషోత్తం త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అర్హులైన వారిని ఎంపిక చేయడానికి కేంద్ర కమిటీ దరఖాస్తులు ఆహ్వానించి, మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం 12 మంది హాజరు కాగా వారిలో సుభాసిస్‌ సేన్‌గుప్తా ఎంపికయ్యారు. వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరిస్తారు.


మధురవాడలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌

5 ఎకరాలు 33 ఏళ్లకు లీజు

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):

మధురవాడలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేపీసీ ప్రాజెక్ట్స్‌ సంస్థ ‘క్రౌన్‌ ప్లాజా’ పేరుతో హోటల్‌ నిర్మిస్తామని దరఖాస్తు చేయగా, పర్యాటక శాఖ పాలసీ ప్రకారం భూమి కేటాయించారు. దీనిపై ఆ సంస్థ రూ.280 కోట్లు వరకూ పెట్టుబడి పెడుతుంది. ఈ భూమిని తొలుత 33 ఏళ్లకు లీజుకు ఇస్తారు. ఆ తరువాత మరో 33 ఏళ్లు పొడిగించుకోవచ్చు. పాలసీ ప్రకారం ఎస్‌జీఎస్‌టీ, విద్యుత్‌ చార్జీల డ్యూటీ వంటివి మినహాయింపు ఇచ్చారు.

Updated Date - Mar 11 , 2026 | 12:32 AM