Share News

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:02 AM

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అందుకు సంబంధించిన ఫైల్‌ను జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ జిల్లాకలెక్టర్‌ కార్యాలయానికి తీసుకువెళ్లి కలెక్టర్‌తో సంతకాలు చేయించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. జీవీఎంసీ కమిషనర్‌ వెంట అదనపు కమిషనర్‌ సత్యవేణి ఉన్నారు.


పెట్రోల్‌పై వదంతులు

కొరత వస్తుందని ప్రచారం

ఆందోళన చెందవద్దని బంకు యజమానుల సూచన

సరిపడా నిల్వలు ఉన్నాయంటున్న ఆయిల్‌ కంపెనీలు

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌కు ఇబ్బందులు ఏర్పడినందున, త్వరలో పెట్రోల్‌, డీజిల్‌కు కొరత వస్తుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. వాటి ధరలు కూడా పెరుగుతాయని కొందరు పేర్కొంటున్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రచారం అధికం కావడంతో అక్కడి వాహన యజమానులు పెట్రోల్‌, డీజిల్‌ బంకులకు పరుగుతీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఎటువంటి కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్‌ బంకుల యజమానులు కూడా తమ వద్ద నిల్వలు ఉన్నాయని స్పష్టంగా చెబుతున్నారు.

ఇప్పుడు అంతా నగదు లావాదేవీలే

ఇంతకు ముందు పెట్రోల్‌ బంకులకు ఆయిల్‌ కంపెనీలు క్రెడిట్‌పై పెట్రోల్‌, డీజిల్‌ అందించేవి. వారు కూడా పెద్ద పెద్ద ఖాతాదారులకు అరువులు ఇచ్చేవారు. రెండు వైపులా అవగాహనతో వ్యాపారం జరిగేది. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు క్రెడిట్‌ (అరువు)పై పెట్రోల్‌, డీజిల్‌ ఇవ్వలేమని ఆయిల్‌ కంపెనీలు స్పష్టంచేశాయి. పెట్రోల్‌ బంకుల యజమానులు ఇప్పటివరకు బకాయిపడిన మొత్తాలు చెల్లించాలని కోరుతున్నాయి. ఇకపై ట్యాంకర్లు పంపాలంటే వాటికి సంబంధించిన మొత్తాలు డీడీలు తీసి పంపాలని, అప్పుడే డెలివరీ ఇస్తామని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన నగదు సమకూర్చుకోలేక, బకాయిలు చెల్లించలేక ఒకటి అర బంకులు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. అంతే తప్ప ఆయిల్‌ కొరత వల్ల కాదని పలువురు బంకు యజమానులు చెబుతున్నారు.


మే 1 నుంచి తొలివిడత జనగణన

జిల్లాలో 5,400 మంది ఎన్యుమరేటర్ల నియామకం

వచ్చే నెల తొలివారంలో శిక్షణ

ప్రతి కుటుంబం నుంచి 34 ప్రశ్నలకు సమాధానాలు సేకరణ

ప్రత్యేక యాప్‌లో నమోదు

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

సుదీర్ఘకాలం తరువాత చేపట్టనున్న జనగణన తొలి విడత ప్రక్రియ జిల్లాలో మే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందుకు సంబంధించి 84 మంది ఫీల్డు ట్రైనర్లకు నలుగురు మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణ పూర్తిచేశారు. జీవీఎంసీలో 76 మంది, నాలుగు గ్రామీణ మండలాల్లో ఎనిమిది ఫీల్డు ట్రైనర్లు తమ పరిధిలో ఎన్యుమటరేటర్లకు వచ్చే నెల తొలివారంలో శిక్షణ ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించేందుకు జీవీఎంసీ పరిధిలో ఐదు వేల మంది, గ్రామీణ ప్రాంతంలో 400 మందిని ఎన్యుమరేటర్ల (ఉపాధ్యాయులు, సచివాలయాల ఉద్యోగులు)ను నియమించారు.

జనగణన తొలిదశ ప్రక్రియ కోసం ప్రతి ఎన్యుమరేటర్‌కు 180 నుంచి 200 ఇళ్లు కేటాయించనున్నారు. వివరాల సేకరణ కోసం ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనిని ప్రతి ఎన్యుమరేటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, అందులోనే వివరాలు నమోదుచేయాలి. అంటే జనగణన ప్రక్రియ మొత్తం డిజిటల్‌ విధానంలో జరుగుతుంది. ఎన్యుమరేటర్‌ తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు, సెల్‌ఫోన్‌ నంబర్లు, గ్యాస్‌ కనెక్షన్‌, కొళాయి, వాహనాలు, విద్యుత్‌ సదుపాయం, టాయలెట్‌ తదితర 34 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లోనే నమోదు చేస్తారు.

ఎన్యుమరేటర్లతో పనిలేకుండా పౌరులు సొంతంగా సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకునే ప్రక్రియ అందుబాటులోకి రానున్నది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు వచ్చే నెల చివరివారం నుంచి మే నెల మొదటి వారం వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఇవ్వనున్నారు. అయితే సొంతంగా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సమయంలో ఇంటి లొకేషన్‌ వివరాలు స్పష్టంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.

Updated Date - Mar 27 , 2026 | 01:02 AM