‘రైల్వే’ ఉద్యోగాల పేరుతో వసూళ్లు
ABN , Publish Date - May 30 , 2026 | 12:55 AM
విశాఖపట్నంలోని వడ్లపూడి రైల్వే వ్యాగన్ వర్క్‌షాపులో ఉద్యోగాల పేరుతో దళారులు దండిగా దండుకుంటున్నారు.
‘కొంకణ్ రైల్వే కార్పొరేషన్’ ప్రకటనను సొమ్ము చేసుకుంటున్న దళారులు
ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు కలెక్షన్
పర్మినెంట్ అయిపోతాయని మాయమాటలు
మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దంటున్న రైల్వే అధికారులు
ఆ ఉద్యోగాలకు జోన్‌తో సంబంధం లేదని స్పష్టీకరణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలోని వడ్లపూడి రైల్వే వ్యాగన్ వర్క్‌షాపులో ఉద్యోగాల పేరుతో దళారులు దండిగా దండుకుంటున్నారు. వాటి కాలపరిమితి ఏడాది అని ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నా నిరుద్యోగులు ఏదో ఒకటి అని అడిగినంత సమర్పించుకుంటున్నారు. యువత ఆత్రాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.
ముంబై కేంద్రంగా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ ‘కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్’ ఈ నెల మొదటి వారంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీచేసింది. గాజువాక సమీపాన ఆటోనగర్‌లోని వడ్లపూడి రైల్వే వ్యాగన్ వర్క్‌షాపులో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తం 132 పోస్టుల భర్తీ చేస్తామని తెలిపింది. అందులో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్/మెకానికల్ పోస్టులు 11, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్ 15, టెక్నీషియన్ (వెల్డర్) 16, టెక్నీషియన్ (ఫిట్టర్) 22, టెక్నీషియన్ (ఈఓటీ ఆపరేటర్) 16, వెహికల్ డ్రైవర్ 4, లిస్టర్/ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ 14, హైడ్రా ఆపరేటర్ 2, ఆఫీస్ బాయ్/హెల్పర్/కలాసీ పోస్టులు 32 కలిపి మొత్తం 132 మంది కావాలని ప్రకటించింది. అందులో అన్ రిజర్వ్‌డ్ పోస్టులు 70 ఉండగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10, ఓబీసీలకు 30, ఎస్సీలకు 15, ఎస్టీలకు 7 కేటాయించారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్/మెకానికల్ పోస్టుకు ఫుల్‌టైమ్ డిగ్రీ/మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమో, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు అవే అర్హతలు, టెక్నీషియన్ పోస్టులకు ఐటీఐ డిప్లమో, మిగిలిన పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత అర్హత ఉండాలని నిబంధన పెట్టారు. అన్ని పోస్టులకు కనీసం ఏడాది అనుభవం ఉండాలని స్పష్టంచేశారు. ఈ ఉద్యోగాల్లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠంగా నెలకు రూ.41 వేలు, మిగిలిన పోస్టులకు రూ.27 వేల నుంచి రూ.30 వేలు జీతం ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ఈ పోస్టులన్నీ కేవలం ఏడాది కాలపరిమితి మాత్రమే ఉంటాయని నోటిపికేషన్‌లో స్పష్టంచేసింది. అవసరాన్ని బట్టి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పనిచేయించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 8వ తేదీ నుంచి వడ్లపూడిలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సమాచారం ఇచ్చారు.
జోన్‌ను చూపించి దోపిడీ
విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఇక్కడ చాలామంది అవసరమవుతారని, ముందు ఇందులో చేరిపోతే ఆ తరువాత ఏదో ఒక దాంట్లోకి మారిపోవచ్చునని నిరుద్యోగ యువతకు దళారులు మాయమాటలు చెబుతున్నారు. ఈ పోస్టులన్నీ తాము ఇప్పిస్తామని ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పి అందినంత దండుకుంటున్నారు. విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో అర్హతలున్న చాలా మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొందరు దళారులు రంగంలో దిగి తాము అంతా సెట్ చేస్తామని నమ్మిన వారి నుంచి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు నిజంగా వారు ఇప్పించగలరా?, లేదా?...అనేది పక్కనపెడితే అవి తాత్కాలిక పోస్టులని, అక్కడ పనులు పూర్తయిపోతే పంపించేస్తారని, వారిని రైల్వే జోన్ పరిధిలోకి తీసుకునే అవకాశం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ దేశవ్యాప్తంగా పనులు చేపడుతుందని, వారికి అవసరమైన వారిని స్థానికంగా రిక్రూట్ చేసుకుంటుందని, అందులో భాగంగానే ఇక్కడ నియామకాలు జరుగుతున్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. దళారుల వలలో చిక్కుకోవద్దని, ఈ పోస్టులకు కొత్త రైల్వే జోన్‌కు సంబంధం లేదని రైల్వే అధికారి స్పష్టంచేశారు.