Share News

ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ వేగవంతం

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:43 PM

ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ (సర్‌)ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలు పూరించిన ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ వేగవంతంగా జరగాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ వేగవంతం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

రాజకీయ పార్టీల ప్రతినిధులు సర్‌ కు సహకరించాలని సూచన

పాడేరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ (సర్‌)ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలు పూరించిన ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ వేగవంతంగా జరగాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్‌ లోకేశ్వరరావులతో కలిసి సర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే శతశాతం ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలను అందించామని, వాటిని తిరిగి స్వీకరించే ప్రక్రియ శుక్రవారంతో ముగుస్తుందన్నారు. ఇప్పటికే స్వీకరించిన ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ 70 శాతం వరకు జరిగిందని, మిగిలిన ఫారాలను సిబ్బంది ఓటర్ల నుంచి సేకరిస్తున్నారన్నారు. శుక్రవారం నాటికి మొత్తం ఎన్యూమరేషన్‌ ఫారాలను సేకరించి, యుద్ధప్రాతిపదికన వాటిని డిజిటలైజేషన్‌ చేసే పనులు చేపట్టారు. అలాగే ఏదైనా కారణంతో ఎన్యూమరేషన్‌ ఫారాలు అందకపోతే, రీజనరేట్‌ చేసి ఓటర్లకు అందించాలన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్యూమరేషన్‌ సిబ్బందికి సంపూర్ణంగా సహకరించి జిల్లాలో సర్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చే సేందుకు కృషి చేయాలన్నారు. అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించాలని, స్థానికంగా లేని, రెండు చోట్ల ఓట్లున్న, మృతి చెందిన వారి పేర్లను పక్కాగా పరిశీలించి మాత్రమే జాబితాల నుంచి తొలగించాలన్నారు. ఒకమారు తొలగించిన పేర్లు తిరిగి జాబితాల్లో నమోదు చేసే అవకాశం లేదని గుర్తించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ చేపట్టేందుకు సచివాలయాల్లో సదుపాయాలను కల్పించి, నిరంతరం ఆయా పనులు చేయిస్తున్నామన్నారు. అలాగే ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎం.భుజంగరావు, ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

73.31 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌)ప్రక్రియలో భాగంగా గురువారం నాటికి జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ 73.31 శాతం పూర్తయింది. జిల్లాలోని పదకొండు మండలాల్లో 4 లక్షల 99 వేల 752 మందికి గాను గురువారం నాటికి 4 లక్షల 99 వేల 752 మందికి ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి, 3 లక్షల 66 వేల 386 మంది ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు. దీంతో జిల్లాలో 73.31 శాతం సర్‌ ప్రక్రియ పూర్తయింది.

Updated Date - Jul 09 , 2026 | 11:43 PM