పెద్దాస్పత్రిలో కోల్డ్‌వార్
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:14 AM
కేజీహెచ్‌లో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
ఉన్నతాధికారుల మధ్య విభేదాలు
కొన్నాళ్లుగా అడ్మినిస్ర్టేటర్‌కు, సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవో, ఏఆర్‌ఎంవోల మధ్య పొసగని వైనం
తాజాగా అడ్మినిస్ర్టేటర్‌పై సూపరింటెండెంట్‌కు ఆర్‌ఎంవోల ఫిర్యాదు
ఉన్నతాధికారుల మధ్య నలిగిపోతున్న కింది స్థాయి ఉద్యోగులు
సేవలపైనా ప్రభావం
విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గత కొన్నాళ్లుగా ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్ (డిప్యూటీ కలెక్టర్)కి, సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవో, ఏఆర్‌ఎంవోల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆస్పత్రి పాలనా వ్యవహారాలన్నీ అడ్మినిస్ర్టేటర్ తన కంట్రోల్‌లో పెట్టుకున్నారని, తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆర్‌ఎంవోలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబునాయుడు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు గతంలో సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ యు.శ్రీహరి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జాబ్ చార్ట్‌కు సంబంధించి కీలకమైన ఆదేశాలను అధికారులు జారీచేశారు. ఈ తరహా వివాదాలకు చెక్ చెప్పాలని, పాలనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే, తాజాగా మరోసారి వారి మధ్య వివాదం చెలరేగింది.
కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ-ఆఫీస్‌లో ఫైళ్లను పర్యవేక్షించే అధికారాన్ని ఆస్పత్రిలో కొందరు అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. తొలుత సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరికి ఈ-ఆఫీస్ లాగిన్ ఇచ్చారు. ఆ తరువాత ఉన్నతాధికారులు ఆయన్ను బ్లాక్ చేశారు. దీనిపై ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి, డీఎంఈ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో కీలక స్థానంలో ఉన్న తనకు ఈ ఆఫీస్ లాగిన్ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి రాసిన లేఖపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్పందించారు. ఈ-ఆఫీస్ ప్రక్రియ 100 శాతం విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే యాక్సెస్/మ్యాపింగ్‌ను సంబంధిత సిబ్బందికే ఇచ్చామని పేర్కొన్నారు. ఈ-ఆఫీస్ అమలుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రతించాలని, అందుకు విరుద్ధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు.
రోగుల సేవలపై ప్రభావం..
ఈ వ్యవహారం జరిగి రెండు రోజులు కాకముందే ఆస్పత్రిలో పాలనకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మాన్యువల్ అమలు కావడం లేదని సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవో, ఏఆర్‌ఎంవోలు సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి ఆర్‌ఎంవోలు ఫిర్యాదు చేశారు. సివిల్ సర్జన్ అడ్మినిస్ర్టేటర్ (సీఎస్‌ఆర్‌ఎంవో), ఇతర ఆర్‌ఎంవోల విధుల్లో ఆస్పత్రి ఉన్నతాధికారుల జోక్యం రోగుల సేవలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్మినిస్ర్టేటర్ (డిప్యూటీ కలెక్టర్) జోక్యం వల్ల ఇబ్బందులు నెలకొంటున్నట్టు పేర్కొన్నారు. తమకు సంబంధించిన స్పష్టమైన విదులు, బాధ్యతలు ఉన్నాయని, అయినా తమ జాబ్ చార్ట్ అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ జాబ్ చార్ట్, బాధ్యతల ప్రకారం విధులు నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రతిని ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు కలెక్టర్, డీఎంఈ, ఇతర ఉన్నతాధికారులకు ఆర్‌ఎంవోలు పంపించారు.
ఉద్యోగులపై ఒత్తిడి
ఉన్నతాధికారుల మధ్య విభేదాలతో సిబ్బంది నలిగిపోతున్నారు. ఇది ఒకరకంగా ఆస్పత్రి పాలనా వ్యవహారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఒక అధికారి వద్దకు వెళితే మరో అధికారికి నచ్చడం లేదు. అక్కడకు ఎందుకు వెళ్లావని, ఆయనతో ఏం మాట్లాడవంటూ ప్రశ్నిస్తున్నారని ఎవరి ఛాంబర్‌లోకి వెళ్లినా ఇబ్బందులు తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టిసారించి అధికారుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారుల మధ్య పంచాయితీల వల్ల వార్డుల తనిఖీ, ఇతర అంశాలను పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదిర్శిస్తున్నారని, దీనివల్ల రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు.