ఉక్కుకు కోక్ కొరత
ABN , Publish Date - May 29 , 2026 | 12:35 AM
స్టీల్‌ప్లాంటు పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అనే చందంగా మారింది.
కర్మాగారంలో తయారుచేసుకుంటే టన్నుకు రూ.25 వేల కంటే తక్కువ వ్యయం
కోక్ ఓవెన్ బ్యాటరీల పరిస్థితి బాగుండకపోవడంతో పూర్తిస్థాయిలో జరగని ఉత్పత్తి
మార్కెట్‌లో టన్ను రూ.39 వేలకు కొనాల్సిన పరిస్థితి
రోజుకు రూ.కోట్లలో అదనపు భారం
ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఆపితే పరిస్థితులు మెరుగుపడే అవకాశం
కానీ అందుకు అంగీకరించని మంత్రిత్వ శాఖ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్‌ప్లాంటు పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అనే చందంగా మారింది. స్టీల్ తయారీలో కీలకమైన కోక్ ధర ప్రపంచ మార్కెట్‌లో రోజురోజుకూ పెరిగిపోతోంది. కోకింగ్ కోల్ తెచ్చుకుని ఇక్కడే కోక్ తయారు చేసుకుంటే టన్నుకు రూ.25 వేల కంటే తక్కువే అవుతుంది. కానీ అందుకు అత్యంత కీలకమైన కోక్ ఓవెన్ బ్యాటరీలు ప్లాంటులో శిథిలావస్థకు చేరడంతో అవసరమైన మేర కోక్ తయారు చేసుకోలేని పరిస్థితి. దీనివల్ల ప్లాంటు రెండు రకాలుగా నష్టపోతోంది. కోకింగ్ కోల్ తీసుకువచ్చి కోక్ తయారుచేసుకుంటే ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా ఓవెన్ల ద్వారా వచ్చే వృథా వాయువులతో రోలింగ్ మిల్స్ అన్నీ 100 శాతం నడుస్తాయి. దానివల్ల ఫినిషిడ్ స్టీల్ తయారవుతుంది. మార్కెట్‌లో అమ్ముకుంటే మంచి రేటు వస్తుంది.
రోజూ 3 నుంచి 4 వేల టన్నుల కోక్ కొనుగోళ్లు
ప్లాంటులో 100 శాతం స్టీల్ ఉత్పత్తి కోసం రోజుకు 8 వేల టన్నుల కోక్ అవసరం. అందుకోసం కోక్ ఓవెన్ల నుంచి 350కు పైబడి పుషింగ్స్ తీయాలి. కానీ ఆ స్థాయిలో పుషింగ్స్ రాకపోవడంతో రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల కోక్ కొంటున్నారు. కోక్ ఇప్పుడు మార్కెట్‌లో టన్ను రూ.39 వేలు ఉంది. అంటే టన్నుపై అధమంగా రూ.10 వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. అలాగే పెల్లెట్లు కూడా కొనాల్సి వస్తోంది. ఈ రెండింటినీ కొంటూ స్టీల్ తయారుచేస్తే రోజుకు రూ.30 కోట్లు నష్టం వస్తుందని ఇటీవల ఓ సమావేశంలో ప్లాంటు అధికారులు వెల్లడించారు.
బ్లాస్ట్ ఫర్నేస్ ఆపేందుకు అంగీకరించని మంత్రిత్వ శాఖ
నష్టాలు తగ్గించుకోవాలంటే మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో (బీఎఫ్) ఒకదానిని ఆపాలనేది ప్లాంటు అధికారుల ఆలోచన. దానివల్ల ఆ బ్లాస్ట్ ఫర్నేస్‌కు అవసరమైన గ్యాస్‌ను కూడా రోలింగ్ మిల్స్‌కు ఉపయోగించుకొని ఫినిష్డ్ స్టీల్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ముడి పదార్థాలకు వెచ్చించే వ్యయం కూడా తగ్గుతుంది. ఈ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని అనుకున్నారు. ఇదే విషయం ఉక్కు మంత్రిత్వ శాఖకు తెలియజేస్తే...ససేమిరా అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రూ.14 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినప్పుడు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడుపుతామని హామీ ఇచ్చారని, ఆ మాట నుంచి వెనక్కి వెళ్లడానికి వీల్లేదని చెప్పినట్టు తెలిసింది. దీంతో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడపడానికే నిర్ణయించారు. అదే సమయంలో రోలింగ్ మిల్స్ 100 శాతం నడవడానికి అవసరమైన వృథా వాయువులు కోక్ ఓవెన్ల నుంచి ఉత్పత్తి చేయాలని ఆ విభాగంపై ఒత్తిడి పెడుతున్నారు. రోజుకు ఎలా లేదన్నా 300 పుషింగ్‌లు అయినా తీయాలని చెబుతున్నారు. పాడైన వాటితో ఆ స్థాయిలో పుషింగ్‌లు తీయలేమని అధికారులు వాపోతున్నారు.
15 లక్షల టన్నుల నిల్వలు
స్టీల్‌ప్లాంటు 100 శాతం స్టీల్ ఉత్పత్తి చేయలేకపోతోంది. తయారైన ఉక్కును 40 శాతం మాత్రమే స్టీల్‌గా మారుస్తోంది. ప్రస్తుతం ప్లాంటులో 15 లక్షల టన్నుల సెమీ ఫినిషిడ్ స్టీల్ బ్లూమ్ రూపంలో నిల్వ ఉంది. వీటిని రోలింగ్ మిల్స్‌కు పంపితేనే మార్కెట్‌లో విక్రయించుకోవడానికి అవసరమైన ఫినిషిడ్ స్టీల్ వస్తుంది. ఆ రోల్స్‌కు అవసరమైన గ్యాస్ ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. ఇదీ సమస్య. మెడ్‌టెక్ జోన్ నుంచి ఇండేన్ సంస్థ ఇచ్చే పీఎన్‌జీ కూడా అవసరాలు తీర్చలేకపోతోంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలా?...అని ఉక్కు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.