Share News

50వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ దిగుబడి లక్ష్యం

ABN , Publish Date - May 14 , 2026 | 11:27 PM

వికసిత్‌ భారత్‌లో భాగంగా 2047 నాటికి కాఫీ దిగుబడి 50 వేల మెట్రిక్‌ టన్నులకు చేరడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు జాతీయ కాఫీ బోర్డు చైర్మన్‌ ఎంజే దినేష్‌ ప్రకటించారు.

50వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ దిగుబడి లక్ష్యం
ఆర్వీ నగర్‌ రీజనల్‌ కాఫీ రీసెర్చ్‌ స్టేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ లోగోను ఆవిష్కరిస్తున్న జాతీయ కాఫీ బోర్డు చైర్మన్‌ ఎంజే దినేష్‌, సీఈవో కూర్మారావు, కాఫీ బోర్డు సభ్యుడు శెట్టి రాజు, కలెక్టర్‌ టి.నిషాంతి, తదితరులు

2047 నాటికి రూ.మూడు వేల కోట్లు ఆదాయం పొందాలి

జాతీయ కాఫీబోర్డు చైర్మన్‌ ఎంజే దినేష్‌

త్వరలో ఆర్‌సీఆర్‌ఎస్‌-ఆర్వీనగర్‌

గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌

అరకులోయ టూరిజం గోష్ఠిలో లోగో ఆవిష్కరణ

అరకులోయ, మే 14 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌లో భాగంగా 2047 నాటికి కాఫీ దిగుబడి 50 వేల మెట్రిక్‌ టన్నులకు చేరడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు జాతీయ కాఫీ బోర్డు చైర్మన్‌ ఎంజే దినేష్‌ ప్రకటించారు. తద్వారా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆర్‌వీ.నగర్‌లో కాఫీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీజనల్‌ కాఫీ రీసెర్చ్‌ స్టేషన్‌ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం అరకులోయ టూరిజం గోష్ఠి ఆడిటోరియంలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ లోగోను జాతీయ కాఫీ బోర్డు చైర్మన్‌ ఎంజే దినేష్‌, సీఈవో ఎం.కూర్మారావు, జిల్లా కలెక్టర్‌ నిషాంతి, కాఫీ బోర్డు ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. అనంతరం కాఫీ బోర్డు చైర్మన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో 2.5 లక్షల మంది కాఫీ రైతులున్నారని, 1,12,000 హెక్టార్లలో ఉన్న కాఫీ తోటల నుంచి 15 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ మాత్రమే దిగుబడి వస్తుందన్నారు. కాఫీ తోటలకు తగ్గట్టుగా దిగుబడి సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా 2047 నాటికి 50 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ దిగుబడి చేసి కనీసం మూడు కోట్ల లక్షల టర్నోవర్‌ సాధించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రొడక్షన్‌, ప్రోసెసింగ్‌, ప్రైస్‌ (త్రి పీ)లను పాటిస్తామన్నారు. ఇందులో కాఫీ, అనుబంధ శాఖల అధికారులు, రైతులు, ఎన్జీవోలు, ఎఫ్‌పీవోలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కాఫీ బోర్డు కార్యదర్శి, సీఈవో ఎం.కూర్మారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చారన్నారు. కాఫీతోటల విస్తీర్ణం, దిగుబడులు గణనీయంగా పెంచాలని, కాఫీ రైతుల ఆర్థిక సుస్థిరత సాధించాలని లక్ష్యంగా ఉన్నారన్నారు. ఎక్కువ దిగుబడినిచ్చే సురక్ష, శతాబ్ది అనే మేలు రకాల కాఫీ మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 1976లో సర్వేయర్‌గా పనిచేసిన రాఘవేంద్రరావు పేరునే ఆర్‌వీ.నగర్‌ కాఫీ రీసెర్చ్‌ స్టేషన్‌కు పెట్టడం గొప్ప విషయమన్నారు. కాఫీ బోర్టు రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సెంతిల్‌ కుమార్‌ మాట్లాడుతూ పెద్ద ఎత్తున కాఫీ తోటలున్నప్పటికీ దిగుబడులు రావడం లేదని, ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోలిస్తే అల్లూరి జిల్లాలో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నామన్నారు. ఎకరాకు 75 కిలోలు వస్తున్న ఇదే తోటల్లో కనీసం 150 నుంచి 200 కిలోల సాధించేందుకు కాఫీ బోర్డు కృషి చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు కాఫీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, తమకు లక్ష్యాలను నిర్ధేశించారన్నారు. గిరిజన రైతులు ఆర్థిక స్థిరత్వానికి కాఫీ బోర్డు సహకారంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. డాక్టర్‌ తుషార్‌ కంటి బెహ్రా మాట్లాడుతూ కాఫీ తోటల్లో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చు... ఎటువంటి అంతర్‌ పంటలు వేయాలో డెమో ద్వారా అధికారులకు వివరించారు. జీసీసీ సీఎండీ ఎస్‌ఎస్‌ శోబిత మాట్లాడుతూ మార్కెటింగ్‌ పరంగా కాఫీ రైతులకు తమ సంస్థ సహయపడుతుందన్నారు. భవిష్యత్తులో కాఫీ రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుందో వివరించారు. ఈ కార్యక్రమంలో కాఫీబోర్డు సభ్యుడు శెట్టి రాజు మాట్లాడుతూ ప్రతీ కాఫీ రైతుకు బెబీపల్పర్స్‌, మిరియాల సేకరణకు అల్యూమినియం నిచ్చెనలు, అవసరమైన టూల్స్‌ రాయితీపై అందరి రైతులకు పంపిణీ చేయాలని కోరారు.

నవంబర్‌-డిసెంబర్‌ల్లో గోల్డెన్‌జూబ్లీ సంబరాలు

ఆర్‌వీ.నగర్‌లో కాఫీ రీసెర్చ్‌ స్టేషన్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు నవంబరు గానీ, డిసెంబరులో గాని నిర్వహించాలని రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎఫ్‌పీవోలు కోరాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను ఆహ్వానించాలని, మూడు రోజుల నుంచి వారం రోజులపాటు నిర్వహించాలని సూచించాయి. కాఫీతోటల అభివృద్ధికి విశేషంగా కృషిన అధికారులు, తొలుత కాఫీ తోటలు వేసిన రైతు కుటుంబాలను సత్కరించాలని కోరాయి.

కాఫీ బోర్డు ప్రత్యేక సమావేశం

అరకులోయ గోష్టి ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం జాతీయ కాఫీబోర్డు చైర్మన్‌ ఎంజే దినేష్‌ అధ్యక్షతన ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనకు ఎటువంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. కాఫీ బోర్డు ఏవిధమైన సహాయ సహకారాలు అందిస్తుంది.. జిల్లాల్లో అధికారులు కాఫీతోటల నిర్వహణ,దిగుబడులు పెంపుపై ఏవిధమైన చర్యలు చేపట్టాలో చర్చించారు. ఈ సమావేశంలో కాఫీ బోర్డు సీఈవో, కార్యదర్శి కూర్మారావు, రీసెర్చ్‌సెంటర్‌ డైరెక్టర్‌ మాట్లాడారు. ఈ సమాశంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ భార్గవి, జీసీసీ ఎండీ ఎస్‌ఎస్‌.శోబిత, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆధిత్యవర్మ, ఆర్‌వైఎస్‌ఎస్‌ ఈడీ బాబురావునాయుడు, ఏపీవో ఐటీడీఏ వెంకటేశ్వరరావు, కాఫీ బోర్డు ఉన్నతాధికారులు, జీసీసీ, వ్యవసాయ శాఖ, హార్టీకల్చర్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:27 PM