Share News

కాఫీ కొనుగోలు లక్ష్యాన్ని చేరాలి

ABN , Publish Date - Jan 12 , 2026 | 10:45 PM

ఈ ఏడాది నిర్దేశించిన కాఫీ కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను జీసీసీ కాఫీ ప్రొక్యూర్‌మెంట్‌ అధికారిణి, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశించారు.

కాఫీ కొనుగోలు లక్ష్యాన్ని చేరాలి
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ, పక్కన ఐటీడీఏ పీవో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు

జీసీసీ కాఫీ ప్రొక్యూర్‌మెంట్‌ అధికారిణి, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశం

జీసీసీ, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం

పాడేరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నిర్దేశించిన కాఫీ కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను జీసీసీ కాఫీ ప్రొక్యూర్‌మెంట్‌ అధికారిణి, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశించారు. కాఫీ గింజలు, పండ్ల కొనుగోలుపై ఐటీడీఏ కార్యాలయంలో జీసీసీ, కాఫీ విభాగం, ఇతర అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది అందరి సమన్వయంతో కాఫీ కొనుగోలులో లక్ష్యం చేరేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కాఫీ దిగుబడులు బాగున్నాయని, రైతులు ఉత్సాహంగా ఉన్నారని, ఈ క్రమంలో కొనుగోలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన కాఫీ రైతులకు గత ఏడాది నుంచి కొనుగోలు ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని, అలాగే రైతుల నుంచి కాఫీ కొనుగోలు చేసిన వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. ఈ ఏడాది జీసీసీ ద్వారా 1,175 టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటికి కేవలం 97 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. కాఫీ పండ్లు కొనుగోలు లక్ష్యం 1,600 టన్నులు కాగా, నేటికి 275 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు మరింత ముమ్మరం చేయాలని, లక్ష్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో చేరుకోవాలని, అందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, జీసీసీ జీఎం ఉమాదేవి, ఐటీడీఏ కాఫీ ఏడీ ఎల్‌ బొంజుబాబు, పాడేరు, చింతపల్లి జీసీసీ డీఎంలు కృష్ణప్రసాద్‌, సింహాచలం, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కన్సల్టెంట్‌లు, జీసీసీ సేల్స్‌మన్లు, ప్రొక్యూర్‌మెంట్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 10:45 PM