Share News

మందకొడిగా కాఫీ పల్పింగ్‌

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:48 PM

స్థానిక ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో కాఫీ పల్పింగ్‌ మందకొడిగా సాగుతున్నది.

మందకొడిగా కాఫీ పల్పింగ్‌
కో పల్పింగ్‌ యూనిట్‌కి రైతులు తీసుకొచ్చిన కాఫీ పండ్లు

పండ్ల సేకరణలో వెనుకబడిన మ్యాక్స్‌

కొరవడిన ఐటీడీఏ పర్యవేక్షణ

చింతపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో కాఫీ పల్పింగ్‌ మందకొడిగా సాగుతున్నది. ఐటీడీఏ నిర్వహణలో ఉన్న ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్‌(మ్యాక్స్‌) పండ్ల సేకరణలో వెనుకబడింది. నేటికి ఏజెన్సీ పదకొండు మండలాల నుంచి కేవలం 85 మెట్రిక్‌ టన్నుల కాఫీ పండ్లను మాత్రమే సేకరించింది. మ్యాక్స్‌ నిర్వహణ, గిట్టుబాటు ధర కల్పించడంపై ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్లకు అంతర్జాతీయ ధరలు అందించాలనే లక్ష్యంతో నాడు టీడీపీ ప్రభుత్వం 2018లో మ్యాక్స్‌ని ఏర్పాటు చేసింది. మ్యాక్స్‌ నిర్వహణకు ప్రభుత్వం ట్రైకార్‌ నుంచి మూలధనాన్ని అందజేసింది. మ్యాక్స్‌కి అనుబంధంగా సుమారు రూ.ఐదు కోట్ల నిధులతో చింతపల్లిలో అత్యాధునిక కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ని నిర్మించింది. ఆరేళ్లగా మ్యాక్స్‌ గిరిజన రైతుల నుంచి కాఫీ పండ్లను సేకరించి, చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో పార్చిమెంట్‌ ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నది. మ్యాక్స్‌ మార్కెటింగ్‌లో వచ్చిన లాభాలు ఆధారంగా గిరిజన రైతులకు తొలి ధర, బోనస్‌ రూపంలో గరిష్ఠ ధరను అందిస్తున్నది. మ్యాక్స్‌ పరిధిలో ఏజెన్సీ పదకొండు మండలాల్లో సుమారు ఏడు వేల మంది కాఫీ రైతులు ఉన్నారు. తొలి రోజుల్లో ఐదు వేల మంది రైతులు కాఫీ పండ్లను మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునేవారు. తొలి నాలుగు సంత్సరాలు ప్రతి ఏడాది మ్యాక్స్‌ 1800-2500 మెట్రిక్‌ టన్నుల కాఫీ పండ్లను సేకరించి ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో పార్చిమెంట్‌ ఉత్పత్తి చేస్తూ మార్కెటింగ్‌ చేశారు. గత మూడేళ్లగా ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మ్యాక్స్‌ పండ్ల సేకరణ తగ్గుముఖం పట్టింది. 2024-25లో మ్యాక్స్‌ 622 మెట్రిక్‌ టన్నుల కాఫీ పండ్లను సేకరించింది. 2025-26లో కేవలం 312 మెట్రిక్‌ టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది 22వ తేదీ నాటికి కేవలం 85 మెట్రిక్‌ టన్నుల కాఫీ పండ్లను మాత్రమే సేకరించింది.

నెల రోజుల ముందే దిగుబడులు ప్రారంభం

గిరిజన ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కాఫీ దిగుబడులు నెల రోజుల ముందుగానే ప్రారంభమైంది. కాఫీ పంటపై ఎల్‌నినో, తుఫాను ప్రభావం పడడం వల్ల సాధారణంగా నవంబరు రెండో పక్షంలో పండాల్సిన పంట ఈ ఏడాది అక్టోబరులోనే ప్రారంభమైంది. దిగుబడులు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. కాఫీ దిగుబడులు నెల రోజుల ముందే ప్రారంభమైనప్పటికి మ్యాక్స్‌ పండ్ల సేకరణ ఆలస్యంగా ప్రారంభించింది. అక్టోబరు 26న అధికారికంగా పండ్ల సేకరణ ప్రారంభించనప్పటికి నవంబరు మొదటి వారం నుంచి పండ్ల సేకరణ మొదలుపెట్టారు.

కొరవడిన ఐటీడీఏ పర్యవేక్షణ

మ్యాక్స్‌ నిర్వాహణ, బలోపేతంపై ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్‌, ఎకో పల్పింగ్‌ ప్రారంభంలో కాఫీ పండ్ల సేకరణ, మార్కెటింగ్‌పై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారించింది. కాఫీ పండ్ల సేకరణకు ముందు ఐటీడీఏ పీవో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులు సలహాలు, సూచనలు తీసుకొని అపెక్స్‌ కమిటీ సిఫారసుతో ధరలను నిర్ణయించేవారు. కాఫీ పండ్ల సేకరణలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, ఉద్యోగులను ఐటీడీఏ భాగస్తులను చేసేది. మ్యాక్స్‌ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పండ్ల సేకరణ, ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి తరలింపు, సకాలంలో నగదు చెల్లింపుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చింది. గత రెండేళ్లగా ఐటీడీఏ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు. రైతుల అభిప్రాయలు తీసుకోకుండానే ఐటీడీఏ అధికారులు ధరలను నిర్ణయిస్తున్నారు. కాఫీ పండ్ల సేకరణకు అవసరమైన సిబ్బంది, వాహనాలను సైతం ఏర్పాటు చేయలేదు. గత ఏడాది అధికారుల అనాలోచిత నిర్ణయంతో తొలిసారిగా ఏ గ్రేడ్‌, బీ గ్రేడ్లుగా విభజించి కాఫీ పండ్లను కొనుగోలు ప్రారంభించారు. దీంతో ఆదివాసీ రైతులు మ్యాక్స్‌ ద్వారా కాఫీ పండ్లను మార్కెటింగ్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మార్కెటింగ్‌ ఆఖరిలో గ్రేడ్లు ఎత్తివేసినప్పటికి ఆశించిన మేరకు కాఫీ పండ్లను సేకరించలేకపోయారు. ఈ ఏడాది సైతం కాఫీ పండ్ల సేకరణపై ఐటీడీఏ అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండాపోయింది. కేవలం మ్యాక్స్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు, కాఫీ ప్రాజెక్టు ఉద్యోగులు మాత్రమే కాఫీ పండ్ల సేకరణ చేపడుతున్నారు. రైతులతో సమావేశాలు, సేకరణ, తరలింపు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించలేదు. ఈ కారణంగా ఆదివాసీ రైతులు ప్రైవేటు వర్తకులను ఆశ్రయించి అధిక ధరను నష్టపోవాల్సి వస్తున్నది.

Updated Date - Nov 22 , 2026 | 11:48 PM