కాఫీ ధరలు తగ్గుముఖం
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:09 PM
జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గుముఖం పట్టాయి. కాఫీ ఉత్పత్తిలో దిగ్గజాలైన వియత్నం, బ్రెజిల్ దేశాల్లో దిగుబడులు గణనీయంగా పెరిగాయి.
వియత్నం, బ్రెజిల్‌లో పెరిగిన దిగుబడులు
జాతీయ మార్కెట్‌లో
కిలో పార్చిమెంట్ రూ.520, చెర్రీ రూ.260
కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తున్న వర్తకులు, జీసీసీ
నెలాఖరు నాటికి ధరలు పెరిగే అవకాశం
ఉందంటున్న కాఫీ బోర్డు అధికారులు
చింతపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గుముఖం పట్టాయి. కాఫీ ఉత్పత్తిలో దిగ్గజాలైన వియత్నం, బ్రెజిల్ దేశాల్లో దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఇవి దేశీయ మార్కెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. కాఫీ ట్రేడింగ్ అసోసియేషన్ (ఐసీటీఏ) జాతీయ మార్కెట్‌లో పార్చిమెంట్ కిలో రూ.520, చెర్రీ (గుల్ల) ధర రూ.260 ధర లభిస్తున్నది. దీంతో ప్రైవేటు వర్తకులు కాఫీ కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తున్నారు. గరిష్ఠ ధరలను ప్రకటించిన గిరిజన సహకార సంస్థ సైతం ప్రైవేటు వర్తకుల బాటలోనే పయనిస్తున్నది. ప్రస్తుతం ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు కిలో కాఫీ చెర్రీ రూ.220-230 ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో 2.45 లక్షల ఎకరాల్లో 2.58 లక్షల మంది రైతులు కాఫీ సాగు చేస్తున్నారు. తొలి రోజుల్లో ప్రైవేటు వర్తకులు నిర్ణయించిన ధరకు ఆదివాసీ రైతులు పంటను విక్రయించుకునేవారు. కాలక్రమంగా కేంద్ర కాఫీ బోర్డు గిరిజన రైతులకు జాతీయ, అంతర్జాతీయ ధరలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండడం, జీసీసీ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుండడంతో ఆదివాసీ రైతులు కాఫీ ఉత్పత్తులను అధిక ధరకు విక్రయించుకుంటున్నారు. ప్రధానంగా దేశీయ కాఫీ మార్కెట్ బ్రెజిల్, వియత్నం దేశాల దిగుబడులపై ఆధారపడి వుంటుంది. విదేశాల్లో కాఫీ ఉత్పత్తులు తగ్గితే దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పాటు అధిక ధర లభిస్తుంది. బ్రెజిల్, వియత్నం దేశాల్లో ఉత్పత్తులు పెరిగితే దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది.
గత ఏడాది రికార్డు స్థాయిలో కాఫీ ధరలు
గత ఏడాది (2024-25)లో కాఫీకి రికార్డు స్థాయి ధరలు లభించాయి. బ్రెజిల్, వియత్నం దేశాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో ఆశించిన దిగుబడులు రాలేదు. దీంతో దేశీయ మార్కెట్‌లో కాఫీ గింజలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కర్ణాటక మార్కెట్‌లో పార్చిమెంట్ కిలో రూ.526 నుంచి రూ.543, చెర్రీ(గుల్ల) రూ.290 నుంచి రూ.310 ధర లభించింది. దీంతో ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు పోటీ పడి కాఫీ గింజలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రోజు రోజుకి పెరుగుతున్న ధరలు ఆధారంగా జీసీసీ ప్రారంభ ధరలను పెంచుతూ కొనుగోలు చేపట్టింది. కిలో పార్చిమెంట్ గరిష్ఠంగా రూ.400, చెర్రీ రూ.250ధరలకు కొనుగోలు చేసింది.
మార్కెట్ ప్రారంభంలో గరిష్ఠ ధరలు
ఈ ఏడాది (2025-26) ప్రారంభంలో కాఫీకి జాతీయ మార్కెట్‌లో గరిష్ఠ ధరలు లభించాయి. 2025 డిసెంబరు నెలాఖరు వరకు జాతీయ మార్కెట్‌లో కిలో పార్చిమెంట్ కిలో రూ.510-520, చెర్రీ కిలో రూ.280-300 ధరలు లభించాయి. మార్కెట్ ప్రారంభంలో ధరలు ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తంచేశారు. గత ఏడాది మాదిరిగా కాఫీ ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులు కాఫీ గింజలను వెంటనే మార్కెటింగ్ చేసుకోకుండా భద్రపర్చుకున్నారు.
జాతీయ మార్కెట్‌లో తగ్గిన ధరలు
విదేశాల్లో కాఫీ దిగుబడులు పెరగడంతో ఈ ఏడాది జనవరి రెండో పక్షం నుంచి దేశీయ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కర్ణాటక జాతీయ మార్కెట్‌లో కిలో కాఫీ పార్చిమెంట్ రూ.520, చెర్రీ కిలో రూ.260 ధర లభిస్తున్నది. ప్రారంభ ధర కంటే ఒకేసారి రూ.40 ధర తగ్గడం వల్ల ప్రాంతీయ మార్కెట్‌లో వర్తకులు కాఫీ కొనుగోలు స్పీడు తగ్గించారు. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా అపెక్స్ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ ఈ ఏడాది గరిష్ఠ ధరలను ప్రకటించింది. పార్చిమెంట్ కిలో రూ.450, చెర్రీ రూ.270ధరలుగా నిర్ణయించింది. జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గుముఖం పట్టడంతో జీసీసీ ఉద్యోగులు సైతం ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. తేమశాతం 12.5 శాతానికిపైగా ఉంటేనే కాఫీ చెర్రీని కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పటి కేవలం 40 శాతం మాత్రమే కాఫీ గింజలను కొనుగోలు చేసింది.
నెలాఖరుకి పెరగనున్న ధరలు
ఎస్. రమేశ్, సీనియర్ లైజనింగ్ అధికారి,
కేంద్ర కాఫీ బోర్డు, మినుములూరు.
నెలాఖరు నాటికి జాతీయ మార్కెట్‌లో కాఫీ గింజలకు ధరలు పెరుగుతాయి. బ్రెజిల్, వియత్నం దేశాల నుంచి అధికంగా దిగుబడులు రావడం, ఈ ఏడాది కొత్త పంట మార్కెట్‌కి రావడంతో కాఫీ ధరలు తగ్గాయి. కాఫీ రైతులు ధరలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు కొంత కాలం నిరీక్షిస్తే కాఫీ గింజలకు మంచి ధర లభిస్తుంది.