Share News

కాఫీ పండ్లు కిలో రూ.70

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:55 PM

చింతపల్లి గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం(మ్యాక్స్‌) కాఫీ పండ్లు కిలోకి రూ.70 గరిష్ఠ ధరగా నిర్ణయించినట్టు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

కాఫీ పండ్లు కిలో రూ.70
ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

సోమవారం నుంచి మ్యాక్స్‌ కొనుగోలు

గత ఏడాది విక్రయాల్లో రైతులకు

అదనంగా కిలోకి రూ.ఐదు బోనస్‌ పంపిణీ

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ

చింతపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం(మ్యాక్స్‌) కాఫీ పండ్లు కిలోకి రూ.70 గరిష్ఠ ధరగా నిర్ణయించినట్టు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కాఫీ పండ్ల కొనుగోలుపై మ్యాక్స్‌ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సోమవారం నుంచి మ్యాక్స్‌ కాఫీ పండ్లు కొనుగోలు చేస్తుందన్నారు. గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్లకు ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. గిరిజన రైతులకు అంతర్జాతీయ ధరలు అందించేందుకు మ్యాక్స్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. 2025-26 వార్షిక సంవత్సరంలో ఏజెన్సీ 11 మండలాల్లో 312 మెట్రిక్‌ టన్నుల పండ్లను సేకరించామన్నారు. ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో ప్రాసెసింగ్‌ చేసి 61 మెట్రిక్‌ టన్నుల పార్చిమెంట్‌ని ఉత్పత్తి చేశామన్నారు. తొలివిడతగా 12 మెట్రిక్‌ టన్నులు పార్చిమెంట్‌ కిలో రూ.547, రెండో విడతగా 13.890 మెట్రిక్‌ టన్నుల పార్చిమెంట్‌ కిలో రూ.530, ఆఖరి విడతగా కిలో రూ.482 ధరకు విక్రయించామన్నారు. మార్కెట్‌ ప్రారంభంలో కాఫీకి గరిష్ఠ ధర లభించిందన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోఅంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు పడిపోయాయన్నారు. దీంతో ఆఖరి విడతలో కిలో రూ.482ధరకు విక్రయించాల్సి వచ్చిందన్నారు. మ్యాక్స్‌ మార్కెటింగ్‌ చేసిన కాఫీకి సరాసరి రూ.500 మద్దతు ధర లభించిందన్నారు. గిరిజనులకు కాఫీ పండ్లు సేకరించి తొలివిడతగా కిలోకి రూ.70 ధర చెల్లించామన్నారు. మార్కెటింగ్‌ అనంతరం బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లతో చర్చించి కిలోకి రూ.ఐదు చొప్పున రూ.15.16లక్షలు బోనస్‌ రూపంలో అదనంగా రైతులకు అందజేశామన్నారు. బోనస్‌ నగదు రైతుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేశామన్నారు. ఈ ఏడాది కాఫీ పండ్ల సేకరణ ముందుగా ప్రారంభిస్తున్నామన్నారు. తొలివిడతగా గత ఏడాది మాదిరిగా కిలో పండ్లకు రూ.70 ధర ఇస్తున్నామని, విక్రయాలు అనంతరం వచ్చిన లాభాల ఆధారంగా బోనస్‌ చెల్లిస్తామన్నారు. గిరిజన రైతులు కాఫీ పండ్లను మ్యాక్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకుని అంతర్జాతీయ ధరలు పొందాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అయింతి కుమారి, మ్యాక్స్‌ చైర్మన్‌ జనకాని సింహాచలం, వైస్‌ చైర్మన్‌ మర్రి వెంకటరావు, కోశాధికారి గోవింద్‌, అకౌంటెంట్‌ యశ్వంత్‌ పడాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:55 PM