కాఫీ పండ్ల మార్కెటింగ్‌లో విఫలం
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:39 PM
గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్లకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం(మ్యాక్స్) విఫలమైంది.
లక్ష్య సాధనలో మ్యాక్స్ వెనుకంజ
కేవలం 19 శాతం సేకరణ
తొలిసారి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడంతో విక్రయించేందుకు ఆసక్తి చూపని ఆదివాసీ రైతులు
దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా ధరల పతనం
ఈ ఏడాది బోనస్ వస్తుందా? అని రైతుల్లో సందేహం
చింతపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్లకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం(మ్యాక్స్) విఫలమైంది. ఈ ఏడాది 1,600 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల సేకరణ లక్ష్యం కాగా కేవలం 312 మెట్రిక్ టన్నులు(19శాతం) మాత్రమే సేకరించింది. కాఫీ పండ్ల సేకరణ ఆలస్యంగా ప్రారంభించడం, తొలిసారిగా గ్రేడింగ్ విధానం అమలులోకి తీసుకు రావడంతో ఆదివాసీ రైతులు మ్యాక్స్‌కి పండ్లను విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు. గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్లకు అంతర్జాతీయ ధరలు అందించాలనే సదుద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాక్స్ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల లక్ష్యం నీరుగారిపోతున్నది.
ఏజెన్సీ పదకొండు మండలాల గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్లకు గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణలో అంతర్జాతీయ ధరలు అందించేందుకు ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం 2018 డిసెంబరులో ఏర్పాటు చేసింది. మ్యాక్స్ నిర్వహణ, పరిపాలన కోసం రూ.1.57 కోట్లు, రివాల్వింగ్ ఫండ్‌గా రూ.3.18 కోట్లు ట్రైకార్ నిధులను కేటాయించింది. అప్పట్లోనే చింతపల్లిలో ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణానికి రూ.5 కోట్లు గిరిజన సంక్షేమశాఖ నిధులు కేటాయించింది. ఈ ఎకో పల్పింగ్ యూనిట్ 2020 జనవరిలో అందుబాటులోకి వచ్చింది. 2018 డిసెంబరు 10 నుంచి ఐటీడీఏ సహకారంతో గిరిజన రైతులు నుంచి మ్యాక్స్ కాఫీ పండ్లను సేకరిస్తున్నది. గిరిజనులు పండించిన కాఫీ పండ్లను పల్పింగ్ చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన ధర మొత్తం రెండు, మూడు విడతల్లో రైతులకు అందజేస్తుంది. తొలి రోజుల్లో 1600 నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను మ్యాక్స్ సేకరించి మార్కెటింగ్ చేసింది. గత ఐదేళ్లగా ఈ సేకరణ లక్ష్యం తగ్గుతూ వచ్చింది. 2024-25 (గత ఏడాది) సీజన్‌లో మ్యాక్స్ 621 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను సేకరించింది. పండ్లను పార్చిమెంట్‌గా ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో పార్చిమెంట్ రూ.450-490 ధరలకు విక్రయించింది. గిరిజన రైతులకు కాఫీ పండ్ల సేకరణ సమయంలో తొలి విడతగా రూ.44, పార్చిమెంట్ విక్రయించగా వచ్చిన ఆదాయం నుంచి రూ.16 బోనస్ చెల్లించింది. గత ఏడాది కిలో పండ్లకు గరిష్ఠంగా రైతుకి రూ.60 ధర లభించింది.
ఈ ఏడాది మందకొడిగా సేకరణ
ఈ ఏడాది మ్యాక్స్ కాఫీ పండ్ల సేకరణ ప్రారంభం నుంచి మందకొడిగా సాగింది. ప్రధానంగా మ్యాక్స్ గిరిజన రైతులకు అందిస్తున్న గరిష్ఠ ధరలపై అవగాహన కల్పించడంలో గిరిజన సంక్షేమశాఖ విఫలమైందని చెప్పవచ్చు. గతంలో కాఫీ పండ్లను మ్యాక్స్ మినహా ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కొనుగోలు చేసేవారుకాదు. దీంతో రైతులందరూ కాఫీ పండ్లను మ్యాక్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకునేవారు. ప్రస్తుతం ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు సైతం కాఫీ పండ్లను కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో కాఫీ పండ్లను ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కిలో రూ.70-75 ధరకు కొనుగోలు చేశాయి. మ్యాక్స్ తొలి విడతగా ఏ-గ్రేడ్ కాఫీ పండ్లు రూ.70, బీ-గ్రేడ్ రూ.60 ధరలకు కొనుగోలు చేస్తున్నది. కాఫీ పండ్లను గ్రేడ్లుగా విభజించి కొనుగోలు చేయడం వల్ల రైతులు మ్యాక్స్‌కి విక్రయించేందుకు ముందుకు రాలేదు. కాఫీ పండ్లను ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలకు విక్రయించేందుకు ఆసక్తి చూపారు. మ్యాక్స్ తొలి విడతగా ఏ-గ్రేడ్‌కి రూ.70, బీ-గ్రేడ్ రూ.60 ధరలుగా కొనుగోలు చేస్తున్నామని, అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన ఆదాయంలో రైతులకు బోనస్ అందజేస్తామని ప్రచారం చేయడంలో కాస్త వెనుకబడింది. గతంలో ఐటీడీఏ లైజన్ వర్కర్లు, ఉద్యాన, వ్యవసాయ అధికారులు సైతం కాఫీ మార్కెటింగ్‌లో భాగస్థులను చేశారు. ప్రస్తుతం కేవలం లైజన్ వర్కర్లు, ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు పరిధి ఉద్యోగులు మాత్రమే కాఫీ పండ్ల మార్కెటింగ్‌లో ఉండడంతో లక్ష్యాలను సాధించలేకపోయారు. అలాగే ఈ ఏడాది కాఫీ పండ్ల సీజన్ ప్రారంభమైన 25 రోజుల తరువాత మ్యాక్స్ సేకరణ ప్రారంభించడం వల్ల లక్ష్యం చేరుకోలేకపోయింది. దీనికి తోడు ఈ ఏడాది కాఫీ బెర్రీ బోరర్ కీటకం మ్యాక్స్‌ని దెబ్బతీసింది. కాఫీ బెర్రీ బోరర్ కీటకం కారణంగా అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల నుంచి కాఫీ పండ్లను మ్యాక్స్ సేకరించలేదు.
బోనస్ వచ్చేనా..?
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనకం కావడం వల్ల మ్యాక్స్ ద్వారా కాఫీ పండ్లను మార్కెటింగ్ చేసుకున్న రైతులు ఈ ఏడాది బోనస్ వస్తుందా?, రాదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కాఫీ గింజలకు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆఖరిలో భారీగా ధరలు పడిపోయాయి. మ్యాక్స్ సేకరించిన 312 మెట్రిక్ టన్నుల నుంచి ఏ-గ్రేడ్ 57.33, బీ-గ్రేడ్ 2.88 మెట్రిక్ టన్నుల కాఫీ పార్చిమెంట్ ఉత్పత్తి చేశారు. తొలి విడతలో 12 టన్నుల పార్చిమెంట్ కిలో రూ.547, మరో 13.89 టన్నులు రూ.530 ధరలకు విక్రయించారు. అనంతరం ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రస్తుతం 31.44 మెట్రిక్‌టన్నుల కాఫీ పార్చిమెంట్ గింజలు మ్యాక్స్ గోదాములో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో పార్చిమెంట్‌కు రూ.455-460 ధర లభిస్తుంది. తక్కువ ధరకు విక్రయించలేక ఈ పార్చిమెంట్ నిల్వలను గోదాముల్లో భద్రం చేసి మంచి ధర కోసం నిరీక్షిస్తున్నారు. అయితే కాఫీ ఉత్పత్తిలో దిగ్గజాలైన వియత్నం, బ్రెజిల్ నుంచి భారీగా కాఫీ దిగుబడులు వస్తున్నాయని, ఈ మేరకు అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు పెరిగే అవకాశంలేదని నిపుణులు చెబుతున్నారు.