Share News

కాఫీ రైతుల గగ్గోలు

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:13 PM

కాఫీ గింజల కొనుగోళ్లను గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నిలిపివేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లను నిలిపివేయాలని జీసీసీ ఉన్నతాధికారులు అనధికారిక మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

కాఫీ రైతుల గగ్గోలు
అద్దరవీధిలో జీసీసీకి విక్రయించేందుకు గోనె సంచుల్లో భద్రపరిచిన కాఫీ చెర్రీ గింజలు

కొనుగోళ్లను జీసీసీ నిలిపివేయడంతో కష్టాలు

గత నెలలో ఇంటింటికి వచ్చి తామే కొనుగోలు చేస్తామని, వర్తకులకు విక్రయించవద్దని ప్రచారం చేసిన ఉద్యోగులు

ప్రస్తుతం ముఖం చాటేసిన వైనం

జీసీసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతోనే కొనుగోళ్లకు బ్రేక్‌ పడినట్టు సమాచారం

గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కాఫీ గింజల కొనుగోళ్లను గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నిలిపివేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లను నిలిపివేయాలని జీసీసీ ఉన్నతాధికారులు అనధికారిక మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. గత నెలలో ఇంటింటికి వచ్చి రైతులు పండించిన ప్రతి కాఫీ గింజ కొనుగోలు చేస్తామని, వర్తకులకు విక్రయించి నష్టపోవద్దని విస్తృత ప్రచారం చేసిన జీసీసీ ఉద్యోగులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. తమ వద్ద కాఫీ గింజలు ఉన్నాయి, కొనుగోలు చేసేందుకు రావాలని జీసీసీ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నప్పటికీ కనీసం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదివాసీ రైతులు నాణ్యమైన కాఫీ ఉత్పత్తి చేస్తున్నప్పటికి అంతర్జాతీయ ధరలు పొందలేకపోతున్నారని 2016లో ప్రత్యేక సర్వే ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. దీంతో గిరిజన సహకార సంస్థ ద్వారా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాఫీ మార్కెటింగ్‌ కోసం జీసీసీకి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. అదే ఏడాది జీసీసీ ఆదివాసీ రైతుల నుంచి కాఫీ గింజల కొనుగోలును ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ముందు ఏడాది అంతర్జాతీయ ధరలను పరిగణనలోకి తీసుకొని అపెక్స్‌ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ కాఫీ ధరలను నిర్ణయిస్తుంది. జీసీసీ అపెక్స్‌ కమిటీ సిఫారసు చేసిన ధరలకు ఆదివాసీ రైతుల నుంచి కాఫీ పార్చిమెంట్‌, చెర్రీ గింజలను కొనుగోలు చేస్తుంది. అలాగే 2024-25 వార్షిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల ఆధారంగా కాఫీ గింజలను గరిష్ఠ ధరలకు కొనుగోలు చేసింది. కిలో పార్చిమెంట్‌ రూ.400, చెర్రీ రూ.250, ఆర్గానిక్‌ చెర్రీ రూ.330 ధరలకు కొనుగోలు చేసింది. గత ఏడాది అంతర్జాతీయ ధరల ఆధారంగా ఈ ఏడాది అపెక్స్‌ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ కిలో పార్చిమెంట్‌ రూ.450, చెర్రీ రూ.270, రొబస్టా రూ.170 ధరలుగా నిర్ణయించింది. జనవరి నెలాఖరు వరకు జీసీసీ చురుగ్గా కాఫీ గింజలను కొనుగోలు చేసింది. అయితే కాఫీ దిగ్గజాలైన వియత్నం, బ్రెజిల్‌ దేశాల్లో దిగుబడులు పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఫిబ్రవరి నుంచి గిరిజన సహకార సంస్థ కాఫీ గింజల కొనుగోలులో స్పీడు తగ్గించింది. ఉద్యోగులు అడపాదడపా రైతుల నుంచి లక్ష్యాలను పూర్తి చేసేందుకు కాఫీ గింజలను కొనుగోలు చేస్తూ వచ్చారు. పది రోజులుగా కాఫీ గింజల కొనుగోనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు.

లక్ష్యం సాధించకపోయినా కొనుగోలు నిలిపివేత

జీసీసీ నిర్ణయించిన లక్ష్యాలను సాధించకపోయినప్పటికి ఉద్యోగులు కాఫీ గింజల కొనుగోళ్లు నిలిపివేశారు. చింతపల్లి పరిధిలో 490 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యంగా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు చింతపల్లి మండలంలో 165 మెట్రిక్‌ టన్నులకు గాను 126, జీకేవీధి లో 304 గాను 138, కొయ్యూరులో 21 మెట్రిక్‌ టన్నులకు గాను 15 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఉన్నతాధికారులు నిర్ణయించిన లక్ష్యం పూర్తికావాలంటే మరో 211 మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేయాల్సి వుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లోనే కాఫీ చెర్రీ కిలో రూ.250-260 ధర లభిస్తుంది. జీసీసీ చెర్రీకి రూ.270 ధరను నిర్ణయించింది. ఈ అధిక ధరకు కొనుగోలు చేస్తే సంస్థకు భారీ నష్టం వస్తుందని ఉన్నతాధికారులు కొనుగోళ్లను నిలిపివేయాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. గత ఏడాది జీసీసీ అత్యుత్సాహంతో ఆర్గానిక్‌ కాఫీ గింజలను రూ.330 ధరకు కొనుగోలు చేసింది. ఏడాదిపాటు గోదాముల్లో ఈ గింజలను భద్రపరిచి కిలో రూ.238 ధరకు మార్కెట్‌లో విక్రయించింది. దీంతో సంస్థకు సుమారు రూ.2.79 కోట్ల నష్టం వచ్చింది. ఇదే విషయంపై పత్రికల్లో కథనాలు రావడంతో లాభాపేక్ష లేకుండా దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు మాత్రమే ఆర్గానిక్‌ చెర్రీ కిలో రూ.330 ధరకు కొనుగోలు చేశామని, జీసీసీ ధరల సవరణ రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకునే తప్ప, లాభార్జన కోసం కాదని జనరల్‌ మేనేజర్‌(కాఫీ) ఎంవీవీఎస్‌ ఉమాదేవి ప్రకటించారు. తాజా పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయని, కాఫీ గింజలు కొనుగోలు నిలిపివేయడం వెనుక జీసీసీ చిత్తశుద్ధి ఏముందని గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:13 PM