Share News

మన్యంలో కాఫీ పండ్ల సేకరణ షురూ!

ABN , Publish Date - Oct 04 , 2026 | 10:59 PM

మన్యంలో కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమైంది. ఈ ఏడాది ముందుగానే కాఫీ పండ్ల దిగుబడి వచ్చింది. దీంతో ఏపీఎఫ్‌డీసీ అధికారులు, గిరిజన రైతులు నెల రోజుల ముందే పండ్ల సేకరణ పనులు ప్రారంభించారు.

మన్యంలో కాఫీ పండ్ల సేకరణ షురూ!
ఏబులం ఎస్టేట్‌ తోటల వద్ద కాఫీ పండ్లు సేకరిస్తున్న గిరిజన మహిళ

నెల రోజుల ముందే పనులు ప్రారంభించిన ఏపీఎఫ్‌డీసీ

గూడెంకొత్తవీధి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమైంది. ఈ ఏడాది ముందుగానే కాఫీ పండ్ల దిగుబడి వచ్చింది. దీంతో ఏపీఎఫ్‌డీసీ అధికారులు, గిరిజన రైతులు నెల రోజుల ముందే పండ్ల సేకరణ పనులు ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు, ఏఎఫ్‌డీసీ అధికారులు 1974 నుంచి కాఫీని సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ప్రస్తుతం 2.45 లక్షల ఆదివాసీ కుటుంబాలు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్నారు. ఎకరానికి గిరిజన రైతులు 400- 500 కిలోల పండ్ల దిగుబడి సాధిస్తున్నారు. గిరిజన ప్రాతంలో 15 వేల మెట్రిక్‌ టన్నులు క్లీన్‌ కాఫీ ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి ఏడాది గిరిజన ప్రాంతంలో నవంబరు మొదటి వారంలో కాఫీ పండ్ల దిగుబడులు వస్తాయి. రెండో పక్షం నుంచి గిరిజన రైతులు, ఏపీఎఫ్‌డీసీ అధికారులు పండ్ల సేకరణ ప్రారంభిస్తారు. డిసెంబరు, జనవరిలో గిరిజన రైతులు, ఏపీఎఫ్‌డీసీ అధికారులు ముమ్మరంగా కాఫీ పండ్ల సేకరణ పనులు నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో వర్షాలు కాఫీ పంటకు అనుకూలంగా పడ్డాయి. జూలై, ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. వాతావరణంలో కలిగిన మార్పుల వల్ల ఈ ఏడాది తొలిసారిగా కాఫీ పండ్ల దిగుబడులు నెల రోజుల ముందుగానే వచ్చాయి. జీకేవీధి మండలంలోని పలు గ్రామాల్లో కాఫీ పండిపోయింది. దీంతో పండ్లు నేలరాలిపోకుండా ఉండేందుకు గిరిజన రైతులు, ఏపీఎఫ్‌డీసీ అధికారులు ముందుగానే పండ్ల సేకరణను ప్రారంభించారు. ఆదివారం ఏబులం ఎస్టేట్‌ కాఫీ తోటల్లో కాఫీ పండ్ల సేకరణ పనులు ప్రారంభించారు. అలాగే లంకపాకలు ప్రాంతంలో రైతులు సైతం పండ్ల సేకరణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో కాఫీ వ్యాపారం ముందుగానే ప్రారంభం కానున్నది.

Updated Date - Oct 04 , 2026 | 10:59 PM