కేజీహెచ్‌లో కాక్ సెంటర్
ABN , Publish Date - May 18 , 2026 | 12:44 AM
సికిల్‌సెల్ ఎనీమియాను మరింత పక్కాగా నిర్ధారించే అత్యాధునిక సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ (కాక్) కేంద్రం సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
పక్కాగా సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణకు వీలు
రూ.3 కోట్లతో అత్యాధునిక పరికరాల ఏర్పాటు
నేడు ప్రారంభించనున్న గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):
సికిల్‌సెల్ ఎనీమియాను మరింత పక్కాగా నిర్ధారించే అత్యాధునిక సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ (కాక్) కేంద్రం సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ సికిల్‌సెల్ ఎనీమియా నిర్మూ లన మిషన్-2027లో భాగంగా కేజీహెచ్‌కు ఈ అడ్వాన్స్‌డ్ టెస్టింగ్ సెంటర్‌ను మంజూరు చేసింది. ఆరోగ్యశాఖ సహకారంతో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లోని బ్లడ్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ హిమోగ్లోబినోపతీస్ (కాక్) కేంద్రాన్ని సోమవారం గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించనున్నారు.
ఇక్కడ పరీక్షలు నిర్వహించేందుకు రూ.3 కోట్ల విలువచేసే అత్యాధునిక పరికరాలను గిరిజన సంక్షేమశాఖ సమకూర్చింది. ఇప్పటివరకు పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల్లో సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణకు హిమోగ్లామ్ వంటి పరీక్షను నిర్వహిస్తున్నారు. మరింత పక్కాగా వ్యాధిని నిర్ధారించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి. వీటిలో రక్త పరీక్ష నివేదిక (హిమోగ్రామ్), సిక్లింగ్ పరీక్ష, హెచ్‌పీఎల్‌సీ (డీ10) ద్వారా హిమోగ్లోబిన్ వేరియంట్ విశ్లేషణ, క్యాపిల్లరీ ఎలక్ర్టోఫోరెసిస్ ద్వారా హిమోగ్లోబిన్ వేరియంట్‌ను విశ్లేషించడం, వేరియంట్ ఎన్‌బీఎస్ ద్వారా నవజాత శిశువుకు సికిల్‌సెల్ ఎనీమియా స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నవజాత శిశువులకు పరీక్ష నిర్వహించడంలో పరిష్కారం లభించనుంది. శాంగర్ సీక్వెన్సింగ్ ద్వారా డీఎన్‌ఏ మ్యూటేషన్ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. వ్యాధి తీవ్రత పెరగముందే గుర్తించి నివారణకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
శిక్షణ పొందిన వైద్యులు
కాక్ సెంటర్‌కు మంజూరైన పరికరాల వినియోగం, పరీక్షలు నిర్వహించేందుకు పెథాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఢిల్లీ, భోపాల్, హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. టెక్నీషియన్, మరో సైంటిస్ట్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఈ కేంద్రానికి మంజూరైన ఒక్కో పరికరం ద్వారా ఒకేసారి 50 మంది రక్త నమూనాలను పరీక్షించేందుకు అవకాశం ఉంది.