Share News

ఈఎన్‌టీలో కాక్లియర్‌ రచ్చ!

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:35 AM

‘అమ్మ పెట్టదు...అడుక్కు తిననివ్వదు’ అన్న చందంగా మారింది నగర పరిధిలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సల నిర్వహణ పరిస్థితి. ఈ ఆపరేషన్లు చేసే నిపుణుడు ఒక్కరే ఉండడం, సదరు వైద్యుడు ఇతర వైద్యులకు ఆపరేషన్ల నిర్వహణలో మెలకువలు నేర్పకపోవడం, అందుకోసం ఓ విశ్రాంత వైద్యుడు ఉదారంగా ముందుకువచ్చినా అడ్డుకోవడం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ శస్త్రచికిత్సల నిర్వహణ కష్టమనే వాదన వినిపిస్తోంది.

ఈఎన్‌టీలో కాక్లియర్‌ రచ్చ!

శస్త్రచికిత్సల నిర్వహణకు ఒక్కరే వైద్యుడు

ఇతరులకు మెలకువలు నేర్పని వైనం

వచ్చే ఏడాదిలో సదరు వైద్యుడికి బదిలీ అయ్యే అవకాశం

ఆ ప్రభావం ఆపరేషన్లపై పడుతుందనే భయం

విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

‘అమ్మ పెట్టదు...అడుక్కు తిననివ్వదు’ అన్న చందంగా మారింది నగర పరిధిలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సల నిర్వహణ పరిస్థితి. ఈ ఆపరేషన్లు చేసే నిపుణుడు ఒక్కరే ఉండడం, సదరు వైద్యుడు ఇతర వైద్యులకు ఆపరేషన్ల నిర్వహణలో మెలకువలు నేర్పకపోవడం, అందుకోసం ఓ విశ్రాంత వైద్యుడు ఉదారంగా ముందుకువచ్చినా అడ్డుకోవడం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ శస్త్రచికిత్సల నిర్వహణ కష్టమనే వాదన వినిపిస్తోంది.

పెదవాల్తేరులోని ప్రాంతీయ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిలో కొన్నాళ్లుగా అత్యంత ఖరీదైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో దీనికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఈ ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ నిపుణులైన వైద్యులు ఉండడంతో శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతాయన్న భావన ఉంది.

వైద్యుడి తీరుతో ఇబ్బందులు

అయితే ఆస్పత్రిలోని ఓ వైద్యుడి తీరుతో భవిష్యత్తులో శస్త్రచికిత్సల నిర్వహణ కష్టంగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కాక్లియర్‌ శస్త్రచికిత్సలు నిర్వహించే వైద్యుడు తాను ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో ఆస్పత్రిలోని ఇతర వైద్యులను భాగస్వాములను చేసి వారికి మెలకువలు నేర్పాలి. కానీ ప్రస్తుతం మూడేళ్లుగా ఒకే వైద్యుడు ఈ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ఆపరేషన్‌ సమయంలో మిగిలిన వైద్యులకు ఈ ప్రక్రియను నేర్పించడం లేదని సమాచారం. దీంతో ఇప్పటివరకూ మరొకరు శస్త్రచికిత్సలను నేర్చుకునే పరిస్థితి కనిపించలేదని చెబుతున్నారు. ఇదిలావుండగా వచ్చే ఏడాది ఆ వైద్యుడికి పదోన్నతి వచ్చే అవకాశం ఉందని, బదిలీపై మరో ఆస్పత్రికి వెళతారని చెబుతున్నారు. అప్పుడు ఇక్కడ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. దీనివల్ల స్టేట్‌ రిఫరల్‌ ఆస్పత్రిగా ఉన్న ఈఎన్‌టీ ఆస్పత్రి ప్రతిష్ఠ దిగజారే ప్రమాదముందని సీనియర్‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆది నుంచీ అదే తీరు..

కాక్లియర్‌ శస్త్రచికిత్సల నిర్వహణలోనే కాకుండా అనేక విషయాల్లో ఈ వైద్యుడి తీరు వివాదాస్పదంగానే ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. నోటి దురుసు, ఇతరులపట్ల అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన ముందు మాట్లాడేందుకు వైద్యులు, సీనియర్‌ సిబ్బంది భయపడుతుంటారని చెబుతున్నారు. ఈ ప్రవర్తనపై సదరు వైద్యుడ్ని ఉన్నతాధికారులు హెచ్చరించినా ఫలితం కనిపించలేదని చెబుతున్నారు.

దృష్టి సారించరా.?

ఈఎన్‌టీలో కాక్లియర్‌ శస్త్రచికిత్సలు నిలిచిపోయే పరిస్థితి ఎదురుకానున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆస్పత్రిలో పరిస్థితిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా కొందరు డీఎంఈ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. ఆస్పత్రిలో పనిచేసే వైద్యులకు కాక్లియర్‌ శస్త్రచికిత్సల నిర్వహణకు సంబంధించిన శిక్షణ అందించేందుకు ఇక్కడే పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక సీనియర్‌ వైద్యుడు ఆసక్తి చూపించారు. అయితే, ఎవరూ రావాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యుడు తేల్చి చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ‘ఈయన చెప్పరు, చెప్పేందుకు వచ్చే వారిని రానీయరు’ అంటూ ఆస్పత్రిలోని వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 02 , 2026 | 01:35 AM