గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేయాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:55 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు ఐక్యతగా పనిచేయాలని టీడీపీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు.
టీడీపీ పరిశీలకుడు రాజశేఖరం
పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తే క్రమశిక్షణ చర్యలు
చింతపల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు ఐక్యతగా పనిచేయాలని టీడీపీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. శనివారం చింతపల్లి, జీకేవీధి మండలాల కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖరం కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారితో ఫోన్లో మాట్లాడారు. పొత్తులతో ఆశించిన వ్యక్తులందరికీ సీట్లు కేటాయించలేకపోయామని, కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్లు ఉపసంహరించుకోకుండా పోటీలో ఉన్న కూటమికి చెందిన స్వతంత్ర అభ్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ తరుఫున పోటీలో ఉన్న అభ్యర్థుల విజయానికి పనిచేయాలన్నారు. ఒక్క సెగ్మెంట్లోనూ రెబల్స్ ఉండడానికి అవకాశం లేదన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన సమయంలో అధిష్ఠానం సుముచిత స్థానం కల్పిస్తుందన్నారు. గిరిజన ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా శతశాతం నెరవేర్చిన ఘనత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కి దక్కుతుందన్నారు. గిరిజన ప్రాంతంలోనూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం వల్ల కూటమి బలం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, జనసేన ఇన్చార్జి వంపూరి గంగులయ్య, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు, టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి సాగిన అన్నపూర్ణదేవి, టీడీపీ మండలాధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ హశ్వంత్, డైరెక్టర్లు పెదిరెడ్ల బేతాళుడు, చెన్నకేశవ, ఈశ్వరమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.