‘రెవెన్యూ’తో కూటమి నేత కుమ్మక్కు
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:00 AM
గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పరిస్థితి మారలేదు. కొంతమంది కూటమి నేతలు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై డి.పట్టాదారులకు అన్యాయం చేస్తున్నారు. కశింకోట మండలం జమాదులపాలెంలో ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళితే..
వివాదాస్పద భూమిలో వరి పంట కోసుకోవడానికి అనుమతి
లబోదిబోమంటున్న డి.పట్టాదారులు
గత వైసీపీ హయాంలో ఆరు ఎకరాలకు వీఆర్వో కుటుంబ సభ్యుల పేర్లతో ఎల్‌పీసీలు జారీ
తహశీల్దారు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సాగుదారులు
ప్రభుత్వం మారినా న్యాయం జరగలేదని ఆవేదన
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పరిస్థితి మారలేదు. కొంతమంది కూటమి నేతలు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై డి.పట్టాదారులకు అన్యాయం చేస్తున్నారు. కశింకోట మండలం జమాదులపాలెంలో ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళితే..
కశింకోట మండలం ఉగ్గినపాలెం పంచాయతీ జమ్మాదులపాలెం సర్వే నంబరు 16లో సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూములను గతంలో ఇదే గ్రామానికి చెందిన కొంతమంది పేదలు సాగు చేసుకునేవారు. అనంతరం కాలంలో డి.పట్టాల కోసం వీరి వారసులు కరక అప్పారావు, పాచిలి శివసత్యనారాయణ, బొట్టా నాగరాజు దరఖాస్తులు చేయగా, రెవెన్యూ అధికారులు ఈ సర్వే నంబరులోని భూమిని నాలుగు సబ్‌డివిజన్లుగా చేసి, పట్టాలు అందజేశారు. ఈ భూములు జాతీయ రహదారికి సమీపంలో వుండడంతో కొన్నేళ్ల నుంచి విలువ బాగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీసర్వే సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు, ఒక వీఆర్‌ఓతో కుమ్మక్కయ్యారు. సర్వే నంబరు 16/1, 16/2లలో వున్న సుమారు ఆరు ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డులను మార్చేశారు. వీఆర్‌ఓ కుటుంబ సభ్యుల పేర్లతో రికార్డుల్లో నమోదు చేయించారు. అంతేకాక భూమి ఆధీన ధ్రువీకరణ పత్రాలు (ఎల్‌పీసీలు) పొందారు. ఈ విషయం తెలుసుకున్న డి.పట్టాదారులు 2024లో వైసీపీ అధికారంలో వున్నప్పుడే తహశీల్దారుకు, కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తరువాత కూటమి అధికారంలోకి వచ్చింది. డి.పట్టాదారులు మరోసారి తహశీల్దారుకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పేద రైతులకు న్యాయం జరగలేదు. కూటమిలో ఒక పార్టీకి చెందిన కశింకోట నేత ఒకరు, అక్రమార్కులకు అండగా వుండడంతో అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిసింది. పైగా పొలంలో వున్న వరి పంటను కోసుకునేందుకు అక్రమంగా ఎల్‌పీసీలు పొందిన సదరు వీఆర్‌ఓ కుటుంబ సభ్యులకు రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా ఆ నేత చక్రం తిప్పినట్టు తెలిసింది. తమకు జరిగిన అన్యాయంపై మరోసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే, కలెక్టరేట్ ఎదుట ధర్నాచేస్తామని బాధిత రైతులు కరక అప్పారావు, నాగరాజు, శివ సత్యనారాయణ స్పష్టం చేశారు.