ఆదివాసీలకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:14 PM
కొండకోనల్లో సంప్రదాయ జీవనం సాగించే ఆదివాసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారి అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భరోసా కల్పిస్తున్నది.
రూ.202 కోట్లతో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి శ్రీకారం
రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
జీవో-3 పునరుద్ధరణ, 1/70 చట్ట పరిరక్షణ, బాక్సైట్ మైనింగ్‌పైనా
స్పష్టత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆదివాసీలను గాలికి వదిలేసిన గత వైసీపీ ప్రభుత్వం
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
కొండకోనల్లో సంప్రదాయ జీవనం సాగించే ఆదివాసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారి అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భరోసా కల్పిస్తున్నది. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే వారికి కాఫీ తోటల అభివృద్ధితో ఆదాయాన్ని పెంచేందుకు రూ.202 కోట్లతో లక్ష ఎకరాల్లో కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అలాగే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది. గిరిజన పల్లెలకు రోడ్డు, రవాణా, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నది. దీంతో ఆదివాసీల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. అడవితల్లి బాట కార్యక్రమంలో రూ.200 కోట్లతో 150 గిరిజన పల్లెలకు శాశ్వత తారురోడ్డు సదుపాయం కల్పించడంతోపాటు జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరందించే పనులు జరుగుతున్నాయి. కూటమి రెండున్నర ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు సైతం అధికంగా నిధులు మంజూరు చేయడంతో పల్లెల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యమైన ధింసాను ప్రపంచానికి పరిచయం చేసి, వారి సంస్కృతికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. తాజాగా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేని ప్రధాని నరేంద్రమోదీకి గిరిజన బాలికలు ధింసా నృత్యంతో స్వాగతం పలకడం, ముందు రోజు 13,500 మంది బాలికలు చేసిన ధింసా ప్రదర్శనలకు గిన్నిస్ రికార్డు దక్కడం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు.
ఆదివాసీల హక్కులు, చట్టాలకు భరోసా
రాజ్యాంగపరంగా గిరిజనులకు సంక్రమించిన హక్కులు, చట్టాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. గిరిజన ప్రాంతానికి సంబంధించిన జీవో-3, 1/70 చట్టం, జోన్-1పై గిరిజనులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, న్యాయం చేస్తామని గత నెలలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కచ్చితమైన హామీ ఇచ్చారు. అల్లూరి జిల్లాను జోన్-1నే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే బాక్సైట్ మైనింగ్‌పై ప్రస్తుతం అంతర్జాతీయ కోర్టులో ఉండడం వల్ల తమ ప్రభుత్వం మైనింగ్ జోలికి వెళ్లడం లేదని సీఎం పేర్కొన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి గిరిజన సంఘాల నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను స్వీకరించాలని సీఎం సూచించారు. ఈమేరకు జూలై 28న రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలతోపాటు ఇతర ఉన్నతాధికారులు గిరిజన సంఘాల నే తలతో సమావేశమయ్యారు. జిల్లా స్థాయి అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిపి ఒక ‘ఉన్నత స్థాయి కమిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ సైతం జోరుగా జరుగుతున్నది.
ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు
జిల్లాలో రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేస్తారు. ఇందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో 10వేలు, 2028లో 10వేలు, 2029లో 20వేలు, 2030లో 30వేలు, 20231లో 30 వేల ఎకరాలు చొప్పున కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే గతేడాది 30 వేల ఎకరాల్లో గిరిజన రైతులకు పండ్ల మొక్కలను అందించారు. ఈఏడాది మరో 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలను అందించనున్నారు. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్లలో ఏడాదికి 15 వేల ఎకరాలు చొప్పున మొత్తం 75 వేల ఎకరాల్లో పాత తోటల పునరుద్ధరణకు చర్యలు చేపడతారు. వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది కాఫీ రైతులకు మిరియాల సేకరణ అవసరమైన అల్యూమియమ్ నిచ్చెనలు అందిస్తారు. కొత్త కాఫీ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలో మరో లక్ష గిరిజన రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును నిర్మూలించడంతోపాటు గతేడాది నుంచి ఏడాదికి 30 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలను ఉచితంగా గిరిజనులకు అందిస్తున్నారు. దీంతో వాటి ద్వారా గిరిజనులు భవిష్యత్‌లో ఆదాయం పొందుతారు. అవకాడో, లిచ్చీ వంటి పంటలతోపాటు పసుపు, వలిసెలు, చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తున్నది.
ఆదివాసీలను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆదివాసీ గురించి కనీసం పట్టించుకోలేదు. ఒక్క గ్రామానికి రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. పంచాయతీకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. పల్లెల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. వైసీపీ అధికారంలో ఉండగానే 2020 ఏప్రిల్‌లోనే జీవో-3ని సుప్రీం కోర్డు రద్దు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం దానిపై కనీసం స్పందించలేదు. కాని నేడు జీవో-3పై వైసీపీ శ్రేణులు అనవసర రాద్దాంతం చేస్తుండడం విశేషం. గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం, కార్పొరేట్ విద్యా పథకం, అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాలను పూర్తిగా రద్దు చేశారు. గిరిజనులకు రాయితీపై స్వయం ఉపాధి యూనిట్టు అందించే ట్రైబల్ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. ఎస్‌టీ రిజర్వేషన్ ద్వారా అందించాల్సిన ఎటువంటి పథకాలను అమలు చేయలేదు. ఆఖరుకు జగనన్న కాలనీల పేరిట కనీసం ఒక గిరిజనుడికి కూడా ఇల్లు కట్టించని పరిస్థితి కొనసాగిన విషయాలను గిరిజనులు ఇంకా మర్చిపోలేదు. కాని కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుండడం గమనార్హం.