సీఎం రాక రేపు
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:56 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లా పర్యటనకు రానున్నారు.
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిర్వహించే జాతీయ వర్క్‌షాపునకు హాజరు
అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సమీక్ష
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 10.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా 11 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్లి, సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నిర్వహించే జాతీయ వర్క్‌షాపులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం విమానంలో గన్నవారం బయలుదేరి వెళతారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి గురువారం రాత్రి నగరానికి చేరుకుంటారు. ఐదో తేదీన సీఎంతోపాటు సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటారు.
రేపు కేంద్ర మంత్రులు రాక
కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశు సంవర్ధక శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ నెల ఐదో తేదీన విశాఖ రానున్నారు. గురువారం సాయంత్రం 4.15 గంటలకు నగరానికి చేరుకోనున్న ఆయన ఐదో తేదీ ఉదయం 11 గంటలకు నోవాటల్ హోటల్‌లో నిర్వహించనున్న సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సదస్సులో పాల్గొననున్నారు. మరుసటిరోజు ఉదయం 8.20 గంటలకు నుంచి ఢిల్లీ వెళతారు. అలాగే, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నగరానికి రానున్నారు. ఉదయం 11.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నేరుగా నోవాటెల్ హోటల్ వెళ్లి, సదస్సులో పాల్గొంటారు. అదేరోజు రాత్రి 9 గంటలకు ఢిల్లీ తిరిగివెళ్లనున్నారు.
దువ్వాడ మీదుగా తిరుపతి, విజయవాడకు ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
ప్రయాణికుల సౌకర్యార్థం దువ్వాడ మీదుగా గువాహటి-తిరుపతి, రంగపార నార్త్-విజయవాడ మధ్య ఒక వైపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. గువాహటి-తిరుపతి (05630) ఎక్స్‌ప్రెస్ గురువారం ఉదయం 7.20 గంటలకు గువాహటిలో బయలుదేరి, దువ్వాడ మీదుగా ఆరో తేదీ ఉదయం 8.40 గంటలకు తిరుపతి చేరుతుంది. రంగపార నార్త్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ (05862) గురువారం సాయంత్రం 4 గంటలకు రంగపార నార్త్‌లో బయలుదేరి దువ్వాడ మీదుగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుతుంది.
సీఆర్‌జెడ్-2లోకి భీమిలి బీచ్‌రోడ్డు?
ఏపీసీజెడ్‌ఎంఏ ప్రతిపాదన
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మధురవాడ నుంచి భీమిలి వరకు సముద్ర తీరంలో కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) విభజన మార్పునకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) ప్రతిపాదించింది. జిల్లా కలెక్టర్, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీతో పాటు అనేక సంస్థల నుంచి అభ్యర్థనలు వచ్చినందున ఈ ప్రతిపాదన చేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం మధురవాడ నుంచి భీమిలి వరకు తీర ప్రాంతం సీఆర్‌జెడ్-3లో ఉంది. దీనివల్ల తీర ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు రావడం లేదు. విశాఖపట్నం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. భోగాపురం వరకు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇందులో విశాఖ నుంచి భీమిలి వరకూ 26 కి.మీ. పొడవున వ్యూపాయింట్లు, వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్‌లు, అండర్ వెహికల్ మూవ్‌వెంట్ వంటివి ప్లాన్ చేశారు. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో భాగంగా ఆరు పోర్టులు, కొత్తగా రైల్వే ప్రాజెక్టులు, కోస్టల్ టూరిజం వంటివి రానున్నాయి. వైజాగ్ బే సిటీ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులకు అనుమతులు రావాలంటే ఆ ప్రాంతాన్ని సీఆర్‌జెడ్ కేటగిరీ 3 నుంచి సీఆర్‌జెడ్-2కు మార్చాలని చాలామంది లేఖలు రాశారు. వీటిని పరిశీలించిన ఏపీ సీజెడ్‌ఎంఏ సమావేశం నిర్వహించి, దానికి ప్రతిపాదనలు రూపొందించింది. విశాఖ జిల్లా అవసరాలు, తాము పంపిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపి అక్కడి నుంచి కేటగిరీ మార్పునకు అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ మార్పు వల్ల బీచ్ రోడ్డులో తీరానికి ఇవతల వైపు భారీ నిర్మాణాలకు అనుమతి వస్తుంది. తీరంలో మాత్రం నిర్మాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే తిమ్మాపురం, మంగమారిపేట, నేరెళ్లవలస ప్రాంతాల అభివృద్ధికి ఉపకరిస్తుంది.
హోటళ్లు, రెస్టారెంట్లు మంచినీరు ఇవ్వాల్సిందే
వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలని చెప్పడం తగదు
ఎవరైనా అలా వ్యవహరిస్తే ఫిర్యాదు చేయాలంటున్న ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలోని కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ కస్టమర్లకు మంచినీరు ఇవ్వడం లేదు. అడిగినా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదే విషయమై ఒక హోటల్ యాజమాన్యంపై వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు కేసు నమోదుచేశారు. ఈ తరహా ఫిర్యాదులు పది వరకూ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు
ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నోటిఫై చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ (ఎఫ్‌బీవో) తప్పనిసరిగా హోటల్, రెస్టారెంట్‌లో మంచినీటిని అందించాలి. బాటిల్ నీరు కొనుగోలు చేయాలని బలవంతం చేయకూడదు. ప్యాకేజ్డ్ నీరు కొనుగోలు అన్నది వినియోగదారుడి ఎంపికగా మాత్రమే ఉండాలి. వినియోగదారుడు అడిగినప్పుడు తాగునీరు ఇవ్వడంతోపాటు అందుబాటులో ఉందన్న విషయాన్ని స్పష్టంగా ప్రదర్శించాలి. కేవలం బాటిల్ నీరు మాత్రమే ఉందని, ఉచిత నీరు లేదనే బోర్డుల ప్రదర్శన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ ఆదేశాలను పాటించనట్టయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
- ఎస్.కల్యాణ చక్రవర్తి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్
మంచినీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే హోటల్స్, రెస్టారెంట్లపై చర్యలు తప్పవు. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారిపై జేసీ కోర్టులో కేసు నమోదు చేయడంతోపాటు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. వాటర్ బాటిల్ కొనుగోలు చేయాలని ఇబ్బంది పెడితే 08662-410295 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.