సీఎం రాక రేపు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:59 AM
అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారం శంకుస్థాపన, నగరంలో ఇనార్బిట్ మాల్ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 11 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు నగరానికి రానున్నారు.
నక్కపల్లి మండలంలో మిట్టల్ స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ
అనకాపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23న ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్‌ప్లాంటు భూమి పూజకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి ఆయన హెలీకాప్టర్‌లో బయలుదేరి 3.30 గంటలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.40 గంటలకు పాటిమీద గ్రామంలో స్టీల్‌ప్లాంటుకు భూమి పూజ జరిగే స్థలానికి చేరుకుంటారు. 3.55 గంటల వరకు ప్లాంట్ ఏర్పాటు స్థలాన్ని, బ్లూప్రింట్‌లను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. సాయంత్రం 5.28 గంటలకు స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి చందనాడ చేరుకుంటారు. 5.40 గంటలకు హెలీకాప్ట్టర్‌లో బయలుదేరి 7.10 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
నేడు 11 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాక
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో మిట్టల్ స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన రేపు
నగరంలో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారం శంకుస్థాపన, నగరంలో ఇనార్బిట్ మాల్ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 11 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు నగరానికి రానున్నారు. రెండూ సోమవారం జరగనున్నాయి. కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకుంటారు. రాత్రికి ఉక్కు కర్మాగార అతిథి గృహంలో బస చేస్తారు. ఈనెల 23వ తేదీ ఉదయం ఉక్కు కర్మాగారంలో పర్యటించి అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎయిర్‌పోర్టుకు వచ్చి, హెలికాప్టర్‌లో నక్కపల్లి వెళతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి మిట్టల్ స్టీల్‌ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ఆదివారం నగరానికి చేరుకుని, సోమవారం సాలిగ్రామపురంలో ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంతి కింజరాపు రామ్మోహననాయుడు, ఉక్కు సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు ఆదివారం నగరానికి చేరుకుంటారు. సోమవారం నక్కపల్లి వెళ్లి మిట్టల్ స్టీల్‌ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రికి నగరానికి చేరుకుని టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. ఈనెల 23వ తేదీన సాలిగ్రామపురంలో ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని, అనంతరం నక్కపల్లి వెళతారు. మిట్టల్ ఉక్కు కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంకా మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, కింజరాపు అచ్చెన్నాయుడు, టీజీ భరత్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణిలు మిట్టల్ ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు హాజరవుతారు.