Share News

అనకాపల్లి జిల్లాకు సీఎం రాక రేపు

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:18 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు.

అనకాపల్లి జిల్లాకు సీఎం రాక రేపు

‘పేట వద్ద పోలవరం ఎడమ కాలువకు జలహారతి

అనకాపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం పీఎల్‌ పురంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సీఎంఓ నుంచి సోమవారం సాయంత్రం అధికారింకగా షెడ్యూల్‌ విడుదలైంది. దీనిప్రకారం సీఎం రెండో తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.20 గంటలకు పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి 2.45 గంటలకు తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ వెనుక వైపు పోలవరం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటింగ్‌ గేట్ల వద్దకు చేరుకుంటారు. ఇక్కడ 3.15 గంటల వరకు పూజలు నిర్వహించి, జలహారతి ఇస్తారు. శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 3.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు పీఎల్‌ పురం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5.25 గంటల వరకు ప్రసంగిస్తారు. తరువాత హెలిప్యాడ్‌కు చేరుకొని 5.35 గంటలకు ఉండవల్లి బయలుదేరి వెళతారు.


78 పంచాయతీల్లో 792 పోలింగ్‌ కేంద్రాలు

వార్డుకొకటి చొప్పున ఏర్పాటు

జాబితాను విడుదల చేసిన అధికారులు

మొత్తం ఓటర్లు 1,60,051 మంది

విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు గజిట్‌లో ప్రచురించారు. నాలుగు గ్రామీణ మండలాల్లోని 79 గ్రామ పంచాయతీల పరిధిలో 802 వార్డులు ఉండగా ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. అయితే భీమునిపట్నం మండలం రేఖవానిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరు వరకు ఉంది. అందువల్ల 78 పంచాయతీల్లో 792 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మండలాల వారీగా పరిశీలిస్తే ఆనందపురం మండలంలోని 26 పంచాయతీలల్లో 260 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. భీమునిపట్నం మండలంలోని 16 గ్రామ పంచాయతీలకుగాను 15 పంచాయతీల పరిధిలో 156, పద్మనాభం మండలంలో 22 పంచాయతీల్లో 226, పెందుర్తి మండలంలోని 15 పంచాయతీల్ల్లో 150 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నాలుగు మండలాల్లో మొత్తం ఓటర్లు 1,60,051 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 78,494 మంది, మహిళా ఓటర్లు 81,557 మంది ఉన్నారు. కాగా పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ముసాయిదా జాబితా ఇప్పటికే విడుదల చేశారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబరు ఏడో తేదీన ప్రకటించనున్నారు.

8 కంపెనీలకు రూ.9.8 కోట్ల జరిమానా

కాలుష్యానికి కారణమవుతున్నందుకు పర్యావరణ పరిహారం

ఆ నిధులతో నగరంలో కాలుష్య నివారణ చర్యలు

కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్‌

విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రెండు ప్రధాన పోర్టులు, వాటి పరిధిలో కాలుష్యానికి కారణమైన ఆరు కంపెనీలు...మొత్తం ఎనిమిది సంస్థలకు రూ.9.8 కోట్ల పర్యావరణ పరిహారం విధించామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్‌ వెల్లడించారు. సోమవారం కాలుష్య నియంత్రణమండలి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబరు 21 నుంచి ఈ ఏడాది జనవరి రెండో తేదీ వరకు అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలు సంస్థలు పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించారన్నారు. ఈ నేపథ్యంలో అదానీ గంగవరం పోర్టుకు రూ.1.82 కోట్లు, కోరమాండల్‌ ఎరువుల కర్మాగారానికి రూ.3.27 కోట్లు, రెయిన్‌ ఇండస్ర్టీస్‌కు రూ.1.22 కోట్లు, ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ లిమిటెడ్‌కు రూ.1.3 కోట్లు, ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ హ్యాండ్లింగ్‌ కంపెనీకి రూ.27.75 లక్షలు, వైజాగ్‌ సీపోర్టు లిమిటెడ్‌కు రూ.5.25 లక్షలు, వైజాగ్‌ గ్రాన్‌ కార్గోబెర్తుకు రూ.5.25 లక్షలు, విశాఖ పోర్టుకు రూ. 1.79 కోట్లు పరిహారం కింద చెల్లించాలని నోటీసులు జారీచేశామన్నారు. ఈ నిధులు వచ్చిన వెంటనే నగరంలో కాలుష్య నివారణకు అవసరమైన పనులు చేపడతామన్నారు. గత ఏడాది శీతాకాలంలో నగరంలో పెరిగిన కాలుష్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని రానున్న డిసెంబరు, జనవరి నెలల్లో నగరంలో గాలి నాణ్యత క్షీణించకుండా కార్యాచరణ రూపొందించామన్నారు. దీనిలో భాగంగా పోర్టు ఏరియాలో ధూళికారకమైన బొగ్గు, ముడి ఇనుము, ఇతర ఖనిజాల గుట్టలపై టార్పాలిన్లు ఏర్పాటు, నిర్వహణలో స్ర్పింక్లర్లు వినియోగంపై నిరంతరం పర్యవేక్షణకు డ్రోన్‌ల సహకారంతో తనిఖీలు చేపడతామన్నారు. విశాఖ పోర్టు ఏరియాలో ప్రస్తుతం ఉన్న మూడు ఆన్‌లైన్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మిషన్లకు అదనంగా మరో మూడు త్వరలో ఏర్పాటుకానున్నాయని తెలిపారు. నగరంలో పీసీబీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ ఒకటి ఉందని, మరో రూ.రెండు కోట్లతో మరో రెండు మిషన్లు వచ్చే ఏడాదిలోగా ఏర్పాటుచేస్తామన్నారు.

పరవాడ ఫార్మాసిటీ పరిసరాల్లో కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను గుర్తించి రూ.మూడు కోట్లవరకు పర్యావరణ పరిహారం విధించామన్నారు. ప్రతి పరిశ్రమలో 33 శాతం విస్తీర్ణంలో పచ్చదనం పెంచాలన్న నిబంధనను అమలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు నగరంలో కాలుష్య ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఖర్చు చేసేలా జీవీఎంసీకి ప్రతిపాదనలు పంపుతామని సందీప్‌ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో పీసీబీ జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ శంకర్‌ నాయక్‌, ఎస్‌ఈ రామారావునాయుడు, ఈఈలు పీవీ ముకుందరావు, పి.శ్రీనివాసరావు, వీరేంద్ర, కేవీ రావు, కరుణరేఖ పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 01:18 AM