Share News

3న అనకాపల్లి జిల్లాకు సీఎం రాక

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:53 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3న అనకాపల్లి జిల్లాకు రానున్నారు.

3న అనకాపల్లి జిల్లాకు సీఎం రాక

అనకాపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3న అనకాపల్లి జిల్లాకు రానున్నారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా జిల్లాకు విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌, అధికారులు మంగళవారం పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది.


ఏయూఐసీలోకి ‘నాస్కామ్‌’ స్టార్టప్‌లు

ఇరు సంస్థల మధ్య ఒప్పందంలో భాగంగా ఐదేళ్ల క్రితం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ఐవోటీ అండ్‌ ఏఐ’ ఏర్పాటు

మార్చితో ముగిసిన కాలపరిమితి

అందులో పరికరాలు వర్సిటీకి అప్పగింత

విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని నాస్కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ఐవోటీ అండ్‌ ఏఐ నిర్వహణ, కార్యకలాపాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సెంటర్‌ను ఏయూ, నాస్కామ్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా 2021లో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో ప్రస్తుతం పది స్టార్టప్‌ కంపెనీలు ఉన్నాయి. వాటికి అవసరమైన సహకారాన్ని నాస్కామ్‌, ఏయూ అందిస్తూ వస్తున్నాయి. అయితే ఏయూతో కుదిరిన ఒప్పందం మేరకు ఐదేళ్ల గడువు ఈ ఏడాది మార్చిలో ముగియడంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పరిపాలనలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు చెందిన పరికరాలను ఏయూకు అప్పగించేలా ప్రాజెక్టు రివ్యూ అండ్‌ స్టీరింగ్‌ గ్రూపు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు పరికరాలను స్వీకరించి ఇప్పటికే వర్సిటీలో ఉన్న ఇంక్యుబేషన్‌, ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వ్యవస్థలో వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాస్కామ్‌ సెంటర్‌లో కొనసాగుతున్న పది స్టార్టప్‌లను ఏయూ ఇంక్యుబేషన్‌ కౌన్సిల్‌ (ఏయూఐసీ) పరిధిలో కొనసాగించాలనుకుంటున్నారు. ఏయూలో ఇంక్యుబేట్‌ కావాలా? లేదా.? అన్న నిర్ణయాన్ని సదరు స్టార్టప్‌ కంపెనీలు నిర్ణయానికి విడిచిపెట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

ఏయూఐసీలో మౌలిక సదుపాయాలు

ఇకపోతే, ఏయూఐసీలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. అందులో భాగంగానే రూ.1.3 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఐవోటీ ల్యాబ్‌ను ఏర్పాటుచేయనున్నారు. ల్యాబ్‌కు సంబంధించిన కొన్ని పరికరాలు ఇప్పటికే వర్సిటీకి చేరుకున్నాయి. అదేవిధంగా సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు స్టూడెంట్‌ ఐడియాలకు స్టార్టప్‌ గ్రాంట్లను అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు అవసరమైన ఇంక్యుబేషన్‌, ఇన్నోవేషన్‌, టెక్నాలజీ సపోర్ట్‌ వ్యవస్థలను కొనసాగించడంతోపాటు మరింత బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.


జూనియర్‌ డాక్టర్ల సమ్మె విరమణ

విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

స్టైపెండ్‌ పెంచాలన్న ప్రధానమైన డిమాండ్‌తో పదిహేను రోజులుగా జూనియర్‌ వైద్యులు చేస్తున్న సమ్మె మంగళవారంతో ముగిసింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌తో రాష్ట్ర కమిటీ నిర్వహించిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమించేందుకు జూనియర్‌ వైద్యులు అంగీకరించినట్టు చెబుతున్నారు. బుధవారం నుంచి యథావిధిగా జూనియర్‌ డాక్టర్లు విధులకు హాజరుకానున్నారు. ఇదిలావుండగా మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేజీహెచ్‌ ఆవరణలో జూనియర్‌ డాక్టర్లు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేశారు. సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన దీక్షా శిబిరం వద్ద కూర్చుని నిరశన చేపట్టారు.


అదుపుతప్పిన బైక్‌... యువతి మృతి

యువకుడి పరిస్థితి విషమం

సాగర్‌నగర్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

సాగర్‌నగర్‌ సమీపంలోని ‘సన్‌’ ఇంటర్‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఎదురుగా కొత్తగా నిర్మించిన రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందగా, యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆరిలోవ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ప్రాంతానికి చెందిన అశోక్‌బారుల్‌ కుమార్తె మిథు బారుల్‌ (22) రాడిసన్‌ బ్లూ హోటల్‌లో పనిచేస్తున్నది. సాగర్‌నగర్‌ సమీపంలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటోంది. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన నరవ అప్పారావు కుమారుడు నరేంద్ర (22) అదే హోటల్‌లో పనిచేస్తున్నాడు. సాగర్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఒకేచోట పనిచేస్తుండడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురూ మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఆర్కే బీచ్‌ దగ్గర గల ఆలయానికి బయలుదేరారు. అయితే వాహనం సన్‌ ఇనిస్టిట్యూట్‌ ఎదురుగా గల రహదారిలో అదుపుతప్పి పక్కనే ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు వాహనంపై ఉన్న ఇద్దరూ ఎగిరి సుమారు 40 అడుగుల దూరంలో ఉన్న ధ్యానమందిరం ప్రాంగణంలో పడ్డారు. మిథు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన నరేంద్రను ఆరిలోవ ట్రాఫిక్‌ పోలీసులు స్థానికుల సహాయంతో రామ్‌నగర్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఇరువురి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.


చిన్నారులకు ఉచిత వైద్యం

రాష్ట్రీయ బాలస్వాస్థ్య ప్రోగ్రామ్‌లో గుండె, చెవి శస్త్ర చికిత్సలు

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వారికి విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రిలో..

డీఈఐసీ సెంటర్ల ద్వారా సదరు ఆస్పత్రికి రిఫర్‌

విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

పుట్టుకతో గుండె, వినికిడి సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సలను ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ రాష్ట్రీయ బాలస్వాస్థ్య ప్రోగ్రామ్‌లో ఇప్పటివరకూ గుండె శస్త్రచికిత్సలను మాత్రమే చేస్తున్నారు. తాజాగా పుట్టుకతో వినికిడి సమస్యతో జన్మించిన చిన్నారులకు నిర్వహించే అత్యంత ఖరీదైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సలను కూడా చేర్చింది. ఈ రెండు శస్త్రచికిత్సలను నిర్వహించే బాధ్యతను విజయవాడలోని మణిపాల్‌ ఆస్పత్రికి ప్రభుత్వం అప్పగించింది. గతంలో గుండె శస్త్రచికిత్సలు నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రి చేసేది. ఈ ఏడాది నుంచి మణిపాల్‌ ఆస్పత్రిలో నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది.

రెండు జిల్లాల చిన్నారులు

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన చిన్నారులకు విజయవాడలోని మణిపాల్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. మిగిలిన జిల్లాలకు చెందిన వారికి శ్రీకాకుళంలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిని ఎంపిక చేశారు. తొలుత ఆయా సమస్యలు ఉన్న చిన్నారులను డిస్ర్టిక్ట్‌ ఎర్లీ ఇంట్రవెన్షన్‌ (డీఈఐసీ) సెంటర్ల ద్వారా గుర్తిస్తారు. వారికి అవసరమైన పరీక్షలను స్థానికంగా నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమైనట్టు భావిస్తే మణిపాల్‌ ఆస్పత్రికి పంపిస్తారు. ఈ శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులకు రూపాయి ఖర్చు లేకుండా నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

రూ.లక్షల్లో ఖర్చు

గుండె జబ్బుతో బాధపడే నవజాత శిశువులు, చిన్నారులకు కార్పొరేట్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించాలంటే రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్స నిర్వహించడానికి రూ.10 లక్షలకుపైగానే పెట్టాల్సిన పరిస్థితి. కాక్లియర్‌ శస్త్ర చికిత్సలను నగర పరిధిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో, పెదవాల్తేరులోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. అయితే, కొన్ని సాంకేతిక ఇబ్బందులు, ఇంప్లాంట్స్‌ కొనుగోలుకు అవసరమైన నిధుల విడుదలలో జాప్యం వల్ల పిల్లలు చాలాకాలం నిరీక్షించాల్సి వస్తోంది.

Updated Date - Aug 26 , 2026 | 12:53 AM