Share News

2న వీఈఆర్‌పై సీఎం సమీక్ష

ABN , Publish Date - May 30 , 2026 | 12:44 AM

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)పై వచ్చే నెల రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులకు సూచించారు.

2న వీఈఆర్‌పై సీఎం సమీక్ష

ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, రహదారుల అనుసంధానంపై నివేదిక సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)పై వచ్చే నెల రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీఈఆర్‌లో 49 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ప్రణాళిక తయారీలో వీఎంఆర్‌డీఏ నోడల్‌ ఏజెన్సీగా ఉన్నందున జీవీఎంసీ, పర్యాటకం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌భరత్‌కు సూచించారు. ఇందులో భాగమైన బే సిటీ ప్రణాళికను కూడా వేగవంతం చేయాలన్నారు. అవసరమైన భూములను కూడా ఎంపిక చేయాలన్నారు. అడ్వంచర్‌ థీమ్‌ పార్క్‌, ఐటీ, డేటా సెంటర్లు, రహదారుల అనుసంధానం, మౌలిక వసతులు, లేఅవుట్లలో సదుపాయాలు, విమానాశ్రయం కనెక్టివిటీ వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, ఆర్డీఓ సంగీత్‌ మాధుర్‌, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, పర్యాటకం, పరిశ్రమల శాఖాధికారులు పాల్గొన్నారు.


వార్డుల పునర్విభజనపై స్టే

వేసవి సెలవులు ముగిసేంత వరకూ ఆపాలని హైకోర్టు ఆదేశం

ప్రస్తుత జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 150కు పెంచాలని ఇప్పటికే ఎమ్మెల్యేల డిమాండ్‌

140 అయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనపై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. కోర్టు సెలవులు ముగిసేంత వరకు ఆ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని పెంచాలని ప్రభుత్వం ఏప్రిల్‌ 29న షెడ్యూల్‌ జారీచేసింది. నగర జనాభా 15 లక్షల కంటే ఎక్కువ ఉంటే వార్డుల సంఖ్యను 120కి పెంచాలని స్పష్టం చేయడంతో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ప్రస్తుతం ఉన్న 98 వార్డులను ఆ మేరకు పునర్విభజన చేస్తూ ప్రక్రియను పూర్తిచేశారు. ఒక్కో వార్డులో సగటున 18,540 మంది ఉండేలా విభజించారు. వార్డుల సరిహద్దులతో కూడిన ముసాయిదాను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్‌ ఈనెల 18న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వార్డుల పునర్విభజనపై ప్రజల నుంచి దాదాపు 2,240 అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 1,900 వార్డుల సంఖ్యను 150కి పెంచాలని కోరుతూ వచ్చినవే కాగా...అందులో 1,843 ఒక్క తూర్పు జోన్‌ పరిధిలో నుంచే అందడం విశేషం. ఉత్తర నియోజకవర్గం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే వార్డుల సంఖ్యను 150కి పెంచాలని అధికారులను కోరారు. ప్రజల నుంచి అందిన అభ్యంతరాల్లో పరిశీలించదగిన వాటికి అనుగుణంగా వార్డుల పునర్విభజన ముసాయిదాలో జీవీఎంసీ అధికారులు మార్పులుచేర్పులు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్యను మరింత పెంచాలని కోరుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం కోర్టులో విచారణ జరగడంతో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత వేసవి సెలవులు ముగిసేంత వరకు వార్డుల పనర్విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని స్టే విధించింది.

ఇదిలావుండగా జీవీఎంసీతోపాటు పలు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఎమ్మెల్యేలంతా 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రస్తుతం ఉన్న జనాభాకు అనుగుణంగా వార్డులను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై తమ అనుచరులతో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపడం ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలో 15 లక్షల జనాభా పైబడిన కార్పొరేషన్లలో 120 వార్డులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే రాష్ట్రంలో ఒక్క జీవీఎంసీ పరిధిలో మాత్రమే 23 లక్షలు జనాభా ఉన్నందున వార్డుల సంఖ్యను ఆ మేరకు పెంచాల్సిన అవసరం ఉందని నగర పరిధిలోని ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్‌తోపాటు ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను ప్రభుత్వం 150 కాకపోయినా 140కి పెంచే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

నాందేడ్‌ రైల్వే ఉద్యోగుల రిలీవ్‌కు అడ్డంకులు!

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా జూన్‌ ఒకటో తేదీ నుంచి ఆపరేషన్లు ప్రారంభించనున్న దక్షిణ కోస్తా జోన్‌కు ఇంకా పూర్తిస్థాయిలో ఉద్యోగులు రాలేదు. పలు జోన్లలో ఉద్యోగులను అక్కడి అధికారులు రిలీవ్‌ చేయడానికి ఇష్టపడడం లేదు. మహారాష్ట్రంలోని నాందేడ్‌లో 30 మంది ఉద్యోగులకు ఎన్‌ఓసీ ఇచ్చి మూడు నెలలైంది. అందులో మహిళలు కూడా ఉన్నారు. వారంతా రిలీవ్‌ చేయాలని, విశాఖ వెళ్లి విధుల్లో చేరతామని కోరుతుంటే అక్కడి అధికారులు అకారణంగా ఇబ్బంది పెడుతున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


నేటితో ముగియనున్న గృహగణన

జిల్లాలో సుమారు 10,15,067 ఇళ్లు

జనాభా 26.18 లక్షలు మంది ఉంటారని అంచనా

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

జనగణనలో కీలకమైన గృహగణన చివరి దశకు వచ్చింది. ఈనెల ఒకటో తేదీన జిల్లాలో గృహ గణన మొదలైంది. శనివారంతో ముగియనున్నది. నగరం, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 10,15,067 ఇళ్లలో 26.18 లక్షల మంది ఉంటారని తొలుత అధికారులు అంచనా వేశారు. జీవీఎంసీ పరిధిలో 9,33,710 ఇళ్లలో 24,70,527 మంది జనాభా ఉంటారని అంచనా వేయగా, శుక్రవారం నాటికి 9,24,699 ఇళ్ల గణన పూర్తిచేశారు. ఆయా ఇళ్లలో 24,06,114 మంది ఉన్నట్టు లెక్కించారు. గ్రామీణ ప్రాంతంలోని నాలుగు మండలాల్లో 81,130 ఇళ్లు, 2,07,699 మంది జనాభా ఉంటారని అంచనా వేశారు. అయితే 81,357 (అంచనా కంటే ఎక్కువ) ఇళ్లు, 2,12,233 మంది జనాభా ఉన్నట్టు సిబ్బంది గణనలో తేలింది. నగరంలో పలుచోట్ల ముఖ్యంగా అపార్టుమెంట్లులో ఉన్న కుటుంబాలు పూర్తి వివరాలు ఇవ్వడానికి ముందుకురావడం లేదు. దీంతో వారి వద్దకు ఒకటికి, రెండుసార్లు సిబ్బంది వెళ్లాల్సి వస్తోంది. గృహగణన శనివారంతో ముగించాల్సి ఉంది. అందువల్ల నగరంలో శతశాతం ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాలని ఎన్యుమటరేటర్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది.

Updated Date - May 30 , 2026 | 12:44 AM