కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:16 PM
ఆర్‌వీనగర్ కేంద్ర ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ ఎన్‌జే దినేశ్, సీఈవో ఎం.కూర్మారావు ఆహ్వానించారు.
చింతపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆర్‌వీనగర్ కేంద్ర ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ ఎన్‌జే దినేశ్, సీఈవో ఎం.కూర్మారావు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి సత్కరించి ఆహ్వానం పలికారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా కాఫీని సాగు చేసేందుకు ఆర్‌వీనగర్ కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం విశిష్ట కృషి చేసింది. పరిశోధన స్థానం శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితంగా ఆదివాసీల ప్రధాన ఆదాయ పంట స్థానాన్ని కాఫీ సొంతం చేసుకుంది. ఈ పరిశోధన స్థానం ఏర్పాటు చేసి యాభై ఏళ్లు పూర్తికావడంతో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు నవంబరులో స్వర్ణోత్సవాల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. అరకు కాఫీని ప్రోత్సహిస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం చంద్రబాబు వ్యవహరించడంతో పాటు కాఫీ సాగు విస్తరణకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాల కాఫీ ప్రియులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే దిశగా అత్యంత వైభవంగా స్వర్ణోత్సవాలను నిర్వహించనున్నారు. అందుకే ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. సీఎంను కలిసిన వారిలో ఆర్‌వీనగర్ కేంద్ర కాఫీ బోర్డు అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త సునీల్‌బాబు, మినుములూరు ఎస్‌ఎల్‌వో ఎస్.రమేశ్ ఉన్నారు.