సీఎం చంద్రబాబు పర్యటన రేపు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:30 AM
మండలంలోని జడ్.చింతువ పంచాయతీ పరిధిలో గజిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేయనున్న రెన్యూ ఫొటో వోల్టాయిక్స్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ చెప్పారు. ఆమె మంగళవారం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్,రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇక్కడ సమీక్ష నిర్వహించారు.
రాంబిల్లి మండలంలో రెన్యూ ఫొటో వోల్టాయిక్స్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన
కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడి
సీఎం పర్యటనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
రేంజ్ ఐజీ, ఎస్పీతో కలిసి ఏర్పాట్ల పరిశీలన
రాంబిల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జడ్.చింతువ పంచాయతీ పరిధిలో గజిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేయనున్న రెన్యూ ఫొటో వోల్టాయిక్స్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ చెప్పారు. ఆమె మంగళవారం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్,రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు అప్పగించిన పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం పర్యటన సందర్భంగా ఎక్కడా లోటుపాట్లు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శంకుస్థాపన అనంతరం నిర్వహించే సభకుపెద్దఎత్తున ప్రజలు హాజరవుతారన్నారు. వాహనాల పార్కింగ్, తాగునీరు, ఇతర సదుపాయాల విషయంలో లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, చిత్తూరు ఎస్పీ బి.హేమంత్, తదితర ఉన్నతాధికారులు పరిశీలించారు. భూమిపూజ చేయనున్న ప్రదేశం, హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ప్రజలకోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ స్థలాలను తిలకించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఐజీ, ఎస్పీలు మాట్లాడుతూ, ప్రొటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సభకు హాజరయ్యే ప్రజలు వాహనాల్లో తరలివస్తారని, ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వాహనాలను నిలుపుదల చేయాలని చెప్పారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా వుంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీవీ రమణ, ఎస్‌బీ డీఎస్పీ జిఆర్‌ఆర్ మోహన్, పరవాడ ఇన్‌చార్జి డీఎస్పీ బి.మోహన్‌రావు, రాంబిల్లి సీఐ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.
శరవేగంగా సీఎం పర్యటన ఏర్పాట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన తేదీ దగ్గర పడడంతో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సభకు సుమారు 20 వేల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వేసవి కావడం, అందునా సీఎం పర్యటన మధ్యాహ్నం వుండడంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు ఎండబారిన పడకుండా వుండేందుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, తాగునీరు అందుబాటులో వుంచుతున్నారు. భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సభా వేదిక, గ్యాలరీల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.