Share News

ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:38 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలను సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్టహాసం నిర్వహించారు.

ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలను సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్టహాసం నిర్వహించారు. కేక్‌లు కట్‌చేసి, మిఠాయిలు పంచారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబునాయుడు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు వర్ధిల్లాలని వేడుకున్నారు. పలుచోట్ల పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. అనకాపల్లి రింగురోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, బత్తుల తాతయ్యబాబు, జిల్లా ప్రధానకార్యదర్శి లాలం కాశీనాయుడు, తదితరులు కేక్‌ కట్‌చేశారు. ఎలమంచిలిలోని అన్న క్యాంటీన్‌లో కూటమి నేతలు కేక్‌ కట్‌ చేసి, అనంతరం భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే విజయకుమార్‌, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. చోడవరంలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కేక్‌ కట్‌చేశారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీజీ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


సీఎం చంద్రబాబు 23న రాక

రెన్యూ ఫొటో వోల్టాయిక్స్‌ సోలార్‌ పరిశ్రమ శంకుస్థాపన

అనకాపల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీన జిల్లాకు రానున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఉండవల్లిలో నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు రాంబిల్లి మండలం జడ్‌.చింతువ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రెన్యూ ఫొటో వోల్టాయిక్స్‌ సోలార్‌ పరిశ్రమ ఏర్పాటుచేసే ప్రదేశానికి వెళతారు. శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. 12.55 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకొంటారు. 1.05 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు.


సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర

రాంబిల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) పరిధిలోని గజిరెడ్డిపాలెం వద్ద రెన్యూ ఫొటో వోల్టాయిక్స్‌ సోలార్‌ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీన భూమి పూజ చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. సోమవారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌తోపాటు టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్య, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, ఎస్సీ తుహిన్‌ సిన్హా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, పలువురు నాయకులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోలార్‌ పరిశ్రమ ఏర్పాటు ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

అనంతరం జిల్లా, నియోజకవర్గం, మండలస్థాయి అధికారులు, కూటమి నేతలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లుపై శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. సుమారు 20 వేల మంది హాజరవుతారని, వీరి కోసం బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాల పార్కింగ్‌, తాగునీరు, మజ్జిగ పంపిణీ, తదితర ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 01:38 AM