నేడు ఆర్‌కే నగర్‌కు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:32 PM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం మండలంలోని గన్నెల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్‌కే నగర్‌కు వస్తున్నారు. గన్నెల పంచాయతీలో సంజీవిని ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ అమిత్‌బర్దార్, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా ఉన్నతాధికారులంతా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సంజీవిని ప్రాజెక్టు ప్రారంభం
గ్రామస్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా యంత్రాంగం
ఆర్‌కే నగర్‌లోనే ఐజీ, కలెక్టర్ ఎస్పీ, ఉన్నతాధికారులు మకాం
అరకులోయ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం మండలంలోని గన్నెల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్‌కే నగర్‌కు వస్తున్నారు. గన్నెల పంచాయతీలో సంజీవిని ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ అమిత్‌బర్దార్, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా ఉన్నతాధికారులంతా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆర్‌కే నగర్‌లో సురబోయి దొన్ను అనే గిరిజనుడి ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి సంజీవిని కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు, వైద్య సేవలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలెక్టర్ నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, అధికారులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సీఎంవో కార్యాలయ అధికారులు జిల్లా యంత్రాంగంతో సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి సందర్శించే ఇంటిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదేవిధంగా సీఎం పర్యటనకు సంబంధించి భద్రత ఏర్పాట్లను ఐజీ గోపీనాఽథ్ జెట్టి, జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్, ఉన్నత పోలీసు అదికారులు ఆర్‌కే నగర్ గ్రామం, సభాస్థలి, హెలీప్యాడ్‌లను పరిశీలించారు. పలుగృహాలకు సోలార్ విద్యుదీకరణ పనులు చేశారు. హెలీప్యాడ్‌కు ఎదురుగా ప్రజావేదిక, కార్యకర్తల సమావేశానికి సంబంధించిన టెంట్‌హౌస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజావేదికకు పక్కనే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నాటికి పనులు పూర్తిచేయనున్నారు. హెలీప్యాడ్‌ను ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధం చేశారు. ట్రైల్ రన్‌కు శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్ రావలసి ఉన్నప్పటికీ ఏ కారణంతోనో రాలేదు. సభాస్థలికి రెండు కిలోమీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. అమలగుడ, గన్నెల, ఆర్‌కేనగర్ భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాయి. అదేవిధంగా గన్నెల పీహెచ్‌సీని చక్కగా తీర్చిదిద్దారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే అత్యవసర మందులు చేర్చేందుకు ఉపయోగపడుతున్న డ్రోన్‌ను సీఎం పరిశీలనకు సిద్ధంగా ఉంచారు.