29న సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:15 AM
మండలంలోని గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న రానున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి వెల్లడి
కలెక్టర్, ఎస్పీతో కలిసి ఏర్పాట్ల పరిశీలన
అరకులోయ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న రానున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ అమిత్‌బర్దార్‌తో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. గన్నెల పీహెచ్‌సీకి సమీపంలో హెలీప్యాడ్ స్థలం, ఆ పక్కనే సభ నిర్వహించే మైదానం, పార్టీ నేతలతో సీఎం సమావేశమయ్యే స్థలాలను కూడా పరిశీలించారు. అనంతరం గన్నెల పీహెచ్‌సీని సందర్శించి సంజీవని ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ గంగులయ్య, తదితరులు ఉన్నారు.