నేడు సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:46 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు.
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సదస్సుకు హాజరు
అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సమీక్ష
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై నోవాటెల్ హోటల్‌లో నిర్వహించే జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్‌సింగ్, జార్జ్ కురియన్, ఎస్‌పీ సింగ్ భగేల్, తదితరులు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు, ప్రస్తుత పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్కెట్లు, మెరైన్ ఫిషరీస్‌లో అవకాశాలు, మత్స్య పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తారు. సముద్రంలో చేపలు ఎక్కడ ఎక్కువగా లభిస్తాయనే అనే సమాచార వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆక్వా కల్చర్‌లో సర్టిఫికేషన్ వంటి విధానాలకు ప్రోత్సాహం వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తారు. ఇదే వేదికపై పీఎంకేఎస్‌ఎస్‌వై, కిసాన్ క్రెడిట్ కార్డు పథకాల లబ్ధిదారులకు ప్రోత్సాహకాలు అందిస్తారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం తరువాత విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)ను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి విజయవాడకు బయలుదేరి వెళతారు.
సీఎం పర్యటనకు పక్కాగా బందోబస్తు ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగర పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీపీ శంఖబ్రతబాగ్చి అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతాపరమైన తనిఖీలను పూర్తిచేయడంతోపాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అనంతరం బీచ్‌రోడ్డులో సీఎం పర్యటించే మార్గాన్ని పరిశీలించారు. ఏయూలోని హెలీప్యాడ్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సీఎం సైకిల్ తొక్కే అవకాశం ఉన్నందున ఆ మార్గంతోపాటు ఎంపిక చేసిన సైకిల్‌ను పరిశీలించారు. ఆయన వెంట డీసీపీలు మేరీప్రశాంతి, మణికంఠచందోలు, లతామాదురితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.