Share News

క్లస్టర్‌ ఈఎంఆర్‌ఎస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:33 PM

అరకులోయ ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాలలో గురువారం 11వ క్లస్టర్‌ ఈఎంఆర్‌ఎస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను రాష్ట్ర అకడమిక్‌ మోనటరింగ్‌ ఆఫీసర్‌, రాష్ట్ర పరిశీలకులు జి.జాన్సన్‌ దేవరాజ్‌ ప్రారంభించారు.

క్లస్టర్‌ ఈఎంఆర్‌ఎస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం
స్పోర్స్ట్‌మీట్‌కు వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న రాష్ట్ర అకడమిక్‌ మోనటరింగ్‌ ఆఫీసర్‌ జి.జాన్సన్‌ దేవరాజ్‌, తదితరులు

రాష్ట్రంలో 9 ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల నుంచి 350 మంది క్రీడాకారులు హాజరు

పోటీలను ప్రారంభించిన రాష్ట్ర అకడమిక్‌ మోనటరింగ్‌ ఆఫీసర్‌ జి.జాన్సన్‌ దేవరాజ్‌

అరకులోయ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాలలో గురువారం 11వ క్లస్టర్‌ ఈఎంఆర్‌ఎస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను రాష్ట్ర అకడమిక్‌ మోనటరింగ్‌ ఆఫీసర్‌, రాష్ట్ర పరిశీలకులు జి.జాన్సన్‌ దేవరాజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి జాన్సన్‌ దేవరాజ్‌ విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదన్నారు. క్రీడల్లో రాణిస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడల్లో రాణించి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన పీవీ సింధూ డిప్యూటీ కలెక్టర్‌గాను, క్రికెటర్‌ సిరాజ్‌ డీఎస్పీ ఉద్యోగాలు పొందారన్నారు. విద్యార్థులంతా స్నేహపూర్వకంగా, ఆరోగ్యకర వాతావరణంలో పోటీల్లో పాల్గొనాలన్నారు. ఈ పోటీల్లో అరకులోయ, అనంతగిరి అడ్డతీగల, చింతపల్లి, జీకేవీధి, హుకుంపేట, పాడేరు, పెదబయలు, రాజవొమ్మంగి ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్‌మీట్‌ 19వ తేదీ ముగిస్తుంది. ఈ పోటీల నిర్వహణకు పలు పాఠశాలల నుంచి పీడీలు, పీఈటీలు హాజరయ్యారు.

ఆకలితో అలమటించిన విద్యార్థులు

వివిధ పాఠశాలల నుంచి స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొన్న విద్యార్థులకు గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భోజనాలు పెట్టకపోవడంతో వారు ఆకలితో అలమటించారు. వాస్తవానికి మూడు రోజులపాటు క్రీడాపోటీలు జరుగుతాయన్న సమాచారం అతిథ్యం ఇచ్చిన అరకు ఈఎంఆఈర్‌ఎస్‌ పాఠశాలకు సమాచారం ఉన్నా.. తగిన విధంగా ఏర్పాట్లు చేయలేదు. ఎటువంటి లోపాలు, జాప్యానికి తావు లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. అయితే వచ్చిన పీడీలు, పీఈటీలకు మాత్రం అర్థగంట ముందే భోజనాలు పెట్టడం గమనార్హం. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వందలాది మంది విద్యార్థులకు వడ్డించినప్పటికీ మూడు గంటలు అయ్యింది. శుక్రవారం నుంచి అయినా విద్యార్థులకు సమయానికి ఆటల పోటీలు, భోజనాలు ఏర్పాటుకు పరిశీలకులుగా వచ్చిన అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆకలితో విద్యార్థులు ఏ విధంగా ఆటల పోటీలలో పాల్గొంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ స్పోర్ట్స్‌ మోనిటర్‌ శ్యాంసుందర్‌, అరకులోయ ఈఎంఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ భాస్కరరావు, పీడీలు రణదేవ్‌, సత్యనారాయణ, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:33 PM