Share News

ఖరీఫ్‌పై నీలినీడలు

ABN , Publish Date - Aug 02 , 2026 | 01:14 AM

జిల్లాలో ఖరీఫ్‌ పంటల సాగుకు కీలకమైన జూన్‌, జూలై నెలల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతంలో సగం కూడా కురవలేదు. మరోవైపు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అనకాపల్లి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొనడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. జూలైలో కురిసిన వర్షాలతో అత్యధిక శాతం రైతులు ఆగస్టులో వరినాట్లు వేస్తుంటారు. కానీ ఈ ఏడాది వర్షాధార ప్రాంతాల్లో ఒకింత ఆలస్యంగా కూడా వరినాట్లు వేసే పరిస్థితులు కానరావడంలేదు.

ఖరీఫ్‌పై నీలినీడలు
మాకవరపాలెంలో ఎండిపోయిన వరినారు

జూన్‌, జూలై నెలల్లో 52 శాతం లోటు వర్షపాతం

కురవాల్సింది 300.9 మి.మీ., కురిసింది 145.7 మి.మీ.

ఆగస్టు, సెప్టెంబరులో కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడి

వర్షాధార భూముల్లో పంటల సాగు ప్రశ్నార్థకం

తీవ్ర ఆందోళనలో అన్నదాతలు

మడుల్లో ఎండిపోతున్న వరినారు

వరిసాగు లక్ష్యం 56,329 హెక్టార్లు

ఇంతవరకు నాట్లు వేసింది 298 హెక్టార్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఖరీఫ్‌ పంటల సాగుకు కీలకమైన జూన్‌, జూలై నెలల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతంలో సగం కూడా కురవలేదు. మరోవైపు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అనకాపల్లి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొనడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. జూలైలో కురిసిన వర్షాలతో అత్యధిక శాతం రైతులు ఆగస్టులో వరినాట్లు వేస్తుంటారు. కానీ ఈ ఏడాది వర్షాధార ప్రాంతాల్లో ఒకింత ఆలస్యంగా కూడా వరినాట్లు వేసే పరిస్థితులు కానరావడంలేదు.

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో జూన్‌, జూలై నెలల్లో 300.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి వుండగా, ఈ ఏడాది 145.7 (52 శాతం) మాత్రమే కురిసింది. కోటవురట్ల, మునగపాక, బుచ్చెయ్యపేట, చీడికాడ, చోడవరం, గొలుగొండ, నక్కపల్లి మండలాల్లో 60 శాతానికి మించి లోటు వర్షంపాతం నమోదైంది. గత రెండు నెలల్లో అడపాదడపా జల్లులు, మోస్తరు వర్షం తప్ప ఒక్క రోజు కూడా పొలాల గట్లు పొర్లేటంత భారీ వర్షం కురవలేదు. ఆగస్టు మొదటి వారానికి ఏపుగా పెరిగే పైర్లతో పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు.. ఈ ఏడాది బీడు భూములను తలపిస్తున్నాయి. చెరువుల్లో చుక్క నీరు లేదు. నదుల నుంచి చెక్‌ డ్యామ్‌లు/ ఆనకట్టల ద్వారా కాలువలకు నీటి ప్రవాహం లేకుండాపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దేరు, రైవాడ, తాండవ మినహా మిగిలిన జలాశయాల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా తయారైంది. రానున్న పక్షం రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరితే తప్ప ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేమని కల్యాణపులోవ, కోనాం, రావణాపల్లి జలాశయాల అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా జూలై చివరి వారం నుంచి నుంచి వరినాట్లు ముమ్మరంగా సాగుతుంటాయి. కానీ ఈ ఏడాది వర్షాభావ ప్రభావం కారణంగా వరినాట్లు వేయడం అటుంచి.. మడుల్లో కనీసం వరినారు కూడా పెరగలేదు. పలుచోట్ల తగినంత వర్షం పడకపోవడం, నీరు అందుబాటులో లేకపోవడంతో వరినారు ఎండిపోవడడం లేదా ఎదుగుదల లేక గిడసబారిపోవడం కనిపిస్తున్నాయి. విద్యుత్‌ మోటార్ల ఆధారంగా బోర్లు కింద వరి సాగు చేసే రైతులు సైతం సమయానికి వరినాట్లు వేయడం లేదు. కనీసం స్థాయిలో కూడా వర్షం పడకపోవడం, బోర్లు నుంచి తక్కువ నీరు వస్తుండడంతో దమ్ము పట్టడానికి వీలుకాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం.. జిల్లాలో ఈ ఏడాది 56,329 హెక్టార్లలో వరి సాగుచేయాలన్నది లక్ష్యం కాగా, జూలై 31వ తేదీనాటికి 432 హెక్టార్లలో (00.77 శాతం) మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. ఇందులో 298 హెక్టార్లలో పొలాను దమ్ము చేసి నాట్లు వేయగా, 134 హెక్టార్లలో నేరుగా విత్తనాలు వేశారు. దేవరాపల్లి మండలంలో అత్యధికంగా 70 హెక్టార్లు, నాతవరంలో 24 హెక్టార్లు, వి.మాడుగులలో 19, కె.కోటపాడులో 16 హెక్టార్లలో మాత్రమే నాట్లు ప్తూయ్యాయి.

52 శాతం లోటు వర్షపాతం

కోటవుటర్ల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో తీవ్రవర్షాభావం కారణంగా 52 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రెండు నెలలకు కలిపి 300.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి వుండగా, 145.7 (52 శాతం) మాత్రమే కురిసింది. కోటవురట్ల, మునగపాక, బుచ్చెయ్యపేట, చీడికాడ, చోడవరం, గొలుగొండ, నక్కపల్లి మండలాల్లో 60 శాతానికిమించి లోటు వర్షంపాతంతో పరిస్థితి అత్యంత దారుణంగా వుంది. 32 శాతం లోటు వర్షపాతంతో నాతవరం మండలం ఒకింత మెరుగ్గా వుంది.

మండలాల వారీగా జూన్‌, జూలై నెలల్లో ఈ ఏడాది కురిసిన వర్షపాతం, సాధారణ వర్షపాతం (మిల్లీమీటర్లలో), లోటు వర్షంపాతం (శాతం) వివరాలిలా వున్నాయి. నాతవరం 229- 334.8- 32, రావికమతం 195- 299.3- 35, పాయకరావుపేట 217.8- 344.1- 37, దేవరాపల్లి 186.2- 294.3- 37, రాంబిల్లి 159.6- 255.1- 37, నర్సీపట్నం 186.5- 310.8- 40, కశింకోట 155.3- 281- 45, మాడుగుల 205.7- 379- 46, ఎలమంచిలి 148.8- 276.1- 46, అచ్యుతాపురం 135.5- 260.5- 48, కె.కోటపాడు 150.2- 295.2- 49, ఎస్‌.రాయవరం- 130.2- 277.2- 53, పరవాడ 115.4- 273.3- 55, మాకవరపాలెం 144.4- 328.4- 56, సబ్బవరం 115.9- 273.3- 58, రోలుగుంట 142.1- 335.1- 58, అనకాపల్లి 120.2- 292.6- 59, నక్కపల్లి 140.1- 353.5- 60, గొలుగొండ 133.4- 345.8- 61, చోడవరం 103.8- 283.8- 63, చీడికాడ 102.6- 282.2- 64, బుచ్చెయ్యపేట 96- 292.9- 67, మునగపాక 87.5- 272.5- 68, కోటవురట్ల 94.9- 300- 68.

Updated Date - Aug 02 , 2026 | 01:14 AM