Share News

వరి సాగుపై నీలినీడలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:56 AM

ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అనకాపల్లి మండలంలో ఖరీఫ్‌ వరిసాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. శారదా నది గ్రోయిన్లు, ఆనకట్టలు, ఇతర నీటి వనరుల కింద దాదాపు ఏడు వేల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యంకాగా, ఇంతవరకు కనీసం వంద ఎకరాల్లో కూడా వరినాట్లు పడలేదు. నదిలో కనీస్థాయిలో కూడా నీటి ప్రవాహం లేకపోవడంతో ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు పారడంలేదు. మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో మడుల్లో వరినారు ఎండిపోతున్నది.

వరి సాగుపై నీలినీడలు
బొజ్జన్నకొండ సమీపంలో ఎండిపోయిన వరినారు, ఖాళీగా ఉన్న పొలాలు

అనకాపల్లి మండలంలో తీవ్రవర్షాభావ పరిస్థితులు

సగటు వర్షపాతంలో 60 శాతానికిపైగా లోటు

వరి సాగు విస్తీర్ణం ఏడు వేల ఎకరాలు

ఇంతవరకు 70 ఎకరాల్లోనే నాట్లు

వర్షాలు లేక ఎండిపోతున్న వరినారు

తుమ్మపాల (అనకాపల్లి), ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అనకాపల్లి మండలంలో ఖరీఫ్‌ వరిసాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. శారదా నది గ్రోయిన్లు, ఆనకట్టలు, ఇతర నీటి వనరుల కింద దాదాపు ఏడు వేల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యంకాగా, ఇంతవరకు కనీసం వంద ఎకరాల్లో కూడా వరినాట్లు పడలేదు. నదిలో కనీస్థాయిలో కూడా నీటి ప్రవాహం లేకపోవడంతో ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు పారడంలేదు. మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో మడుల్లో వరినారు ఎండిపోతున్నది.

అనకాపల్లి మండల వ్యవసాయానికి శారదా నది జీవనాడి. దీనిపై ముద్దుర్తి, తగరంపూడి, సీతానగరం, తమ్మపాల వద్ద నిర్మించిన గ్రోయిన్ల కింద దాదాపు ఏడు వేల ఎకరాల ఆయకట్టు వుంది. ఏటా జూలై మధ్య నుంచి శారదా నదిలో వరద ప్రవాహం అధికంగా వుంటుంది. దీంతో కాలువల ద్వారా పొలాలకు నీరు సరఫరా అవుతుంది. ఇదే సమయంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుంటాయి. రైతులు ఆగస్టులో పొలాలను దమ్ముపట్టి వరినాట్లు వేస్తుంటారు. కానీ ఈ ఏడాది తీవ్ర ఎల్‌నినో ప్రభావంతో కనీసస్థాయిలో కూడా వర్షాలు పడడంలేదు. ఈ ఏడాది జూన్‌ నుంచి అప్పటి వరకు అనకాపల్లి మండలంలో సాధారణం కంటే 60 శాతం తక్కువ వర్షంపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం అవుతున్నది. పరిస్థితి ఇంత సీరియస్‌గా వుంటుందని ఊహించని రైతులు.. యథావిధిగా గత నెలలో వరి నారుమడులు పోశారు. కానీ సరైన వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల నారు ఎండిపోయింది. కొంతమంది రైతులు దూరంగా వున్న వ్యవసాయ విద్యుత్‌ బోర్లు నుంచి ట్యూబులతో నీటిని రప్పించుకొని వరినారును కాపాడుకున్నారు. కానీ నారు చేతికి వచ్చిన తరువాత పొలాలను దమ్ము చేయడానికి నీరు లేకపోవడం, వర్షాలు పడకపోవడంతో వరినారును మడుల్లోనే వదిలేశారు. బావులు పూర్తిగా అడుగంటాయి. ఇక బోర్లు వున్న రైతులు ఇంతవరకు సుమారు 70 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. ఒక బోరు ఆధారంగా సుమారు మూడు ఎకరాల్లో వరిసాగు చేయవచ్చు. కానీ వర్షాలు పడకపోవడం, భూగర్భ జలాలు చాలాదిగువకు పడిపోవడంతో బోర్లు నుంచి అరకొరగా నీరు వస్తున్నది. దీంతో రెండు ఎకరాలకు మించి నీరు చాలని పరిస్థితి నెలకొంది.

వరి సాగుపై ఆశలు వదులుకున్నాను

కొణతాల వెంకటఅప్పారావు, తుమ్మపాల

ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తుంటాను. నెల రోజుల క్రితం మడిని సిద్ధం చేసి వరి విత్తనాలు చల్లాను. తరువాత పొలాన్ని దుక్కి దున్నించాను. వరి విత్తనాలు వేసిన తరువాత జల్లులు మాత్రమే పడడంతో నారు పెద్దగా ఎదగలేదు. తరువాత పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగుపై ఆశలు వదులుకున్నాను.

Updated Date - Aug 21 , 2026 | 12:56 AM