మన్యంలో ముసురు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:05 AM
మన్యంలో సోమవారం ముసురు వాతావరణం నెలకొంది. సాయంత్రం అరకులోయ, డుంబ్రిగుడలో వడగళ్ల వాన కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది.
అరకులోయ, డుంబ్రిగుడలో వడగళ్ల వాన
పాడేరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం ముసురు వాతావరణం నెలకొంది. సాయంత్రం అరకులోయ, డుంబ్రిగుడలో వడగళ్ల వాన కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. కాగా పాడేరులో ఉదయం వేళ పొగమంచు కురవగా, మధ్యాహ్నం కాస్త ఎండ కాసింది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆకాశం మేఘావృతమైంది. తరువాత నుంచి ముసురు వాతావరణం నెలకొంది. సోమవారం అరకులోయలో 14.9, ముంచంగిపుట్టులో 15.6, పెదబయలులో 16.4, చింతపల్లిలో 17.9, జి.మాడుగులలో 18.8, అనంతగిరిలో 20.0, కొయ్యూరులో 22.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయలో..
అరకులోయ: అరకులోయలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆకాశం మేఘావృతమైంది. కొద్దిసేపు వడగళ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమై కొద్ది సేపు మాత్రమే వడగళ్ల వాన కురిసింది. అనంతరం వాతావరణం పూర్తిగా చల్లబడింది.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో జనజీవనం స్తంభించింది. వర్షానికి గెడ్డలు పొంగి ప్రవహించాయి. ఈ వర్షం రబీ పంటలకు, వేరుశెనగ పంటలు దుక్కిలకు అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.