వస్త్ర దుకాణాలు వెలవెల
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:02 AM
సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా.. కానరాని సందడి ఫుట్‌వ్యాపారులదీ అదే పరిస్థితి కనీసస్థాయిలో బేరాలు లేకపోవడంతో డీలా ఉచిత బస్సుతోపాటు ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రభావమంటున్న వ్యాపారులు చోడవరం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా.. కానరాని సందడి
ఫుట్‌వ్యాపారులదీ అదే పరిస్థితి
కనీసస్థాయిలో బేరాలు లేకపోవడంతో డీలా
ఉచిత బస్సుతోపాటు ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రభావమంటున్న వ్యాపారులు
చోడవరం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
వస్త్ర దుకాణాల్లో ఏటా సంక్రాంతి పండుగకు ముందు కొనుగోలుదారులతో జోరుగా కనిపించే సందడి.. ఈసారి పండగ సమీపించినప్పటికీ పెద్దగా కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచే కళకళలాడే బట్టలు షాపులు, ఈ ఏడాది ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక కళతప్పాయి. ఇటువంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాపారులు దిగాలుగా చెబుతున్నారు.
వాస్తవానికి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం తరువాత చోడవరంలోనే వస్త్రవ్యాపారం అధికంగా జరుగుతుంటుంది. మోస్తరు షోరూములతో పాటు, చిన్నపాటి దుకాణాలు సైతం సంక్రాంతి పండుగకు వారం, పది రోజుల ముందునుంచే రద్దీగా వుంటాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు చోడవరం వచ్చి పండుగకు అవసరమైన రెడీమేడ్ దుస్తులు, చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చోడవరంలో ఒకటి, రెండు దుకాణాలు మినహాయిస్తే, మిగిలిన షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.
ఫుట్‌పాత్ వ్యాపారాలదీ అదే పరిస్థితి
సంక్రాంతి పండుగ సమయంలో దుకాణదారులు ఎంత వ్యాపారం చేస్తారో.. ఇంచుమించు అంతే స్థాయిలో రోడ్డు పక్క (ఫుట్‌పాత్) వ్యాపారులు కూడా వ్యాపారం సాగిస్తుంటారు. పేదలు, దిగువ మధ్య తరగతి వారు అధికంగా ఫుట్‌పాత్ షాపుల్లో కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో పెద్ద షాపుల మాదిరిగానే ఫుట్‌పాత్ దుకాణాలు కూడా కొనుగోలుదారులతో రద్దీగా వుంటాయి. కానీ ఈసారి రోడ్డు పక్క దుకాణాల్లో వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే వుంది. ఆన్‌లైన్ వ్యాపారంతోపాటు గ్రామాల్లో సైతం వస్త్ర దుకాణాలు ఏర్పాటు కావడంతో చోడవరం వంటి పట్టణ ప్రాంతంలో వ్యాపారం తగ్గిపోయిందని పట్టణానికి చెందిన ఒక వస్త్రవ్యాపారి విశ్లేషించారు. సంక్రాంతి సీజన్‌లో రోజుకి లక్ష రూపాయలకుపైగా వ్యాపారం జరిగే దుకాణంలో ప్రస్తుతం రూ.25 వేలు కూడా వుండడంలేదని అంటున్నారు.
ఉచిత బస్సు ప్రభావం
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు గ్రామీణ ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారం బాగా తగ్గిపోవడానికి మహిళ ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల నుంచి విశాఖ, అనకాపల్లి వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లి రావాలంటే ఒక్కొక్కరికి చార్జీల రూపంలో రెండు వందల రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి వచ్చేది. భోజనం, టిఫిన్ ఖర్చులు దీనికి అదనం. దీంతో అత్యధికులు చోడవరం, మాడుగుల, వడ్డాది, కొత్తకోట, రావికమతం, దేవరాపల్లిల్లో కొత్త దుస్తులు కొనుగోలు చేసేవారు. అయితే గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ‘స్ర్తీ శక్తి’ పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలోనే కాదు..రాష్ట్రంలో ఎక్కడికైనా ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు వుండడంతో గ్రామీణ మహిళల్లో అత్యధికులు సంక్రాంతి షాపింగ్ కోసం విశాఖపట్నం, అనకాపల్లి వెళుతున్నారు. ఇరుగుపొరుగు వారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు... ఇలా ఐదు నుంచి పది మంది కలిసి ఉదయాన్నే బస్సుల్లో బయలుదేరుతున్నారు. కుటుంబం అంతటికీ షాపింగ్ చేసుకొని సాయంత్రానికి ఇళ్లకు చేరుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో తమ వ్యాపారం 30-40 శాతం తగ్గినట్టు వ్యాపారులు చెపుతున్నారు. గత ఏడాది దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగల సమయంలోనే ఈ విషయాన్ని గ్రహించినట్టు తెలిపారు.
వ్యాపారం బాగా తగ్గింది
అత్తిలి రాము, వస్త్రవ్యాపారి, చోడవరం
ఏటా భోగి పండగకు వారం ముందు నుంచే వ్యాపారం జోరుగా సాగేది. రోజుకి తక్కువలో తక్కువ రూ.30 వేల వ్యాపారం అయ్యేది. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వస్త్ర దుకాణాలు, రెడీమేడ్ షాపులు రావడం, ఫుట్‌పాత్ వ్యాపారాలు పెరగడం, యువతీయువకులు ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో మా వ్యాపారాలు తగ్గిపోయాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కూడా మా వ్యాపారాలపై ప్రభావం చూపింది.
ఉచిత బస్సు ప్రభావం
పసుమర్తి సంతోశ్ గుప్తా, క్లాత్‌మర్చంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, చోడవరం
ఈసారి సంక్రాంతి పండగ వ్యాపారం సందడి కొన్ని దుకాణాల్లోనే కనిపిస్తున్నది. ఎక్కువ శాతం దుకాణాల వ్యాపారానికి ఉచిత బస్సు ప్రభావం పడింది. గ్రామాలే కాకుండా చోడవరం, మాడుగుల వంటి పట్టణాల నుంచి కూడా పలువురు మహిళలు విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లి పండుగ బట్టలు కొంటున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో 30 నుంచి 40 శాతం వరకు వ్యాపారం తగ్గే అవకాశం వుంది.