Share News

ఉపాధ్యాయుడు లేక మూతబడి

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:00 PM

ఉపాధ్యాయుడు లేక మండలంలోని మఠంభీమవరం పంచాయతీ వాలుగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూతబడింది. దీంతో మూడు గ్రామాలకు చెందిన 49 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా తయారైంది.

ఉపాధ్యాయుడు లేక మూతబడి
మూతపడిన వాలుగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

49 మంది విద్యార్థులు చదువుకు దూరం

పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన

కొయ్యూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుడు లేక మండలంలోని మఠంభీమవరం పంచాయతీ వాలుగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూతబడింది. దీంతో మూడు గ్రామాలకు చెందిన 49 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా తయారైంది.

వేసవి సెలవుల అనంతరం 15 రోజులు గడిచాక ఈ పాఠశాలకు మండలంలోని నడింపాలెం పాఠశాల ఉపాధ్యాయుడు అప్పారావును ఏఈవో డిప్యూటేషన్‌పై ఇక్కడికి పంపారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు రెండు రోజుల పాటు ఈ పాఠశాలలో విధులు నిర్వహించి, ఆ తరువాత నుంచి రావడం మానేశారు. దీని వల్ల ఈ పాఠశాల మూతపడింది. వాలుగూడెంతో పాటు మరో రెండు గ్రామాలకు చెందిన 49 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుడిని నియమించాలని ఎంఈవోకు వినతి పత్రం ఇచ్చినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని గ్రామ పెద్ద రాంబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎంఈవో సింహాచలం వివరణ కోరగా, డిప్యూటేషన్‌పై నియమించిన ఉపాధ్యాయుడు విధులకు హాజరుకావడం లేదని తెలిసిందని, ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో ఉపాధ్యాయుల కొరత తీర్చేలా 54 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు కావాలని డీఈవోకు నివేదించామని, వారు వస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 11:00 PM