Share News

ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:34 AM

ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ కలిగిన డీపట్టా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లాలో డీపట్టాలు కలిగిన రైతులు క్రయ విక్రయాలకు అవకాశం వచ్చినట్టయింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 జూన్‌లో ఫ్రీహోల్డ్‌ భూముల లావాదేవీలపై విధించిన ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. అయితే వివాదాస్పద భూములపై నిషేధం కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌

జిల్లాలో 730 ఎకరాలకు

ఇప్పటికే అనుమతులు

అందులో 132 ఎకరాల రిజిస్ట్రేషన్‌

ఫిర్యాదులపై అధికారుల దృష్టి

విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ కలిగిన డీపట్టా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లాలో డీపట్టాలు కలిగిన రైతులు క్రయ విక్రయాలకు అవకాశం వచ్చినట్టయింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 జూన్‌లో ఫ్రీహోల్డ్‌ భూముల లావాదేవీలపై విధించిన ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. అయితే వివాదాస్పద భూములపై నిషేధం కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలోని నాలుగు (పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం) గ్రామీణ మండలాల పరిధిలో 730 ఎకరాల డీపట్టా భూములను ఫ్రీహోల్డ్‌ చేసిన అధికారులు, వాటిలో 609 ఎకరాలను 22-ఎ జాబితా నుంచి తొలగించారు. అందులో కేవలం 132 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈలోగా ఆరోపణలు రావడంతో 2023 జనవరిలో ఫ్రీహోల్డ్‌ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఫ్రీహోల్డ్‌ చేసిన భూముల విషయంలో జిల్లా యంత్రాంగం ముందుకువెళ్లాలని నిర్ణయించింది. మరోవైపు ఫ్రీహోల్డ్‌ భూముల కొనుగోళ్లపై పలు గ్రామాల నుంచి జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై విచారణ చేయనున్నారు. ఇందుకోసం ఆయా మండలాల నుంచి అన్ని రికార్డులు తెప్పించున్నారని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేసినట్టు తేలితే చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈనెల 19వ తేదీన నగరంలో 25 వేల మందికి సీఎం చేతులమీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఉంది. అది ముగిసిన తరువాత ఫ్రీహోల్డ్‌ భూముల వ్యవహారంపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించనున్నది. జీవీఎంసీ పరిధిలో విశాఖ రూరల్‌, గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం మండలాల్లో డీపట్టాలకు ఫ్రీహోల్డ్‌ చేయాలంటే ప్రత్యేకించి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అలాగే భీమిలి, పెందుర్తిమండలాల్లోని కొన్ని గ్రామాల్లో డీపట్టాలకు ఫ్రీహోల్డ్‌ ఇవ్వలేదు. అందుకు అనుమతి వస్తే తప్ప ముందుకు వెళ్లలేమని ఒక అధికారి తెలిపారు.

Updated Date - Sep 17 , 2026 | 01:34 AM