Share News

స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకోవాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:35 PM

అందరూ స్వచ్ఛతను తమ జీవన విధానంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు.

స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, సబ్‌కలెక్టర్‌ సాహిత్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, గంగులయ్య, తదితరులు

జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపు

16 విభాగాల్లో 47 స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం

పాడేరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): అందరూ స్వచ్ఛతను తమ జీవన విధానంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక మోదకొండమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. స్వచ్ఛత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరికీ బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, వివిధ ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, ప్రజలు భాగస్వామ్యులైన విజయవంతంగా చేపట్టాలన్నారు. స్వచ్చాంధ్ర అవార్డుల ప్రదానమంటే కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, పారిశుధ్య రంగంలో సేవలను గుర్తించి, ప్రోత్సహించడమన్నారు.

47 స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం

జిల్లాలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలందించిన 16 విభాగాలకు చెందిన 47 మందికి స్వచ్ఛాంధ్ర అవార్డులను గాంధీ జయంతి సందర్భంగా అధికారులు ప్రదానం చేశారు. స్వచ్ఛ గ్రామ పంచాయతీ విభాగంలో జీకేవీధి మండలం సీలేరు, అనంతగిరి, ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట, పాడేరు మండలం తుంపాడ, పెదబయలు పంచాయతీలు, స్వచ్ఛ గ్రామైక్య సంఘాలు విభాగంలో చింతపల్లి మండలం వీజీ.కొత్తూరు, జీకేవీధి మండలం ఏబులం, కొయ్యూరు మండలం కంఠారం, ముంచంగిపుట్టు మండలం బాబూసాల, పాడేరు మండల డోకులూరు, స్వచ్ఛ పాఠశాల విభాగంలో పాడేరు గురుకులం, పెదబయలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హుకుంపేట మండలం రంగశీల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పాడేరు మండలంలో మినుములూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, స్వచ్ఛ అంగన్‌వాడీల విభాగంలో అనంతగిరి మండలం చిలకలగెడ్డ, అరకులోయ మండలం కంఠభౌంసుగూడ, డుంబ్రిగుడ మండలం సాగర, జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లి, పాడేరు మండలం గుత్తులపుట్టు, స్వచ్ఛ ఆస్పత్రుల విభాగంలో చింతపల్లి, అరకులోయ, ముంచంగిపుట్టు, తాజంగి సీలేరు, యూ.చీడిపాలెం, గన్నెల, జీకేవీధి ఆస్పత్రులు, అరకు సబ్‌సెంటర్‌, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు పాడేరు ఐటీడీఏ, గన్నెల పీహెచ్‌సీ, పాడేరులో డీడీవో కార్యాలయం, స్వచ్ఛ బస్‌స్టేషన్‌ విభాగంలో పాడేరు బస్‌ కాంప్లెక్స్‌, స్వచ్ఛ రైతుబజార్‌ విభాగంలో చింతపల్లి ఏఎంసీ కార్యాలయం, స్వచ్ఛ వసతిగృహాలు విభాగంలో చింతపల్లి బీసీ హాస్టల్‌, ముంచంగిపుట్టులో బాలుర హాస్టల్‌, స్వచ్ఛ ఎన్‌జీవో విభాగంలో విశాఖ జిల్లా నవనిర్మాణ సమితి, గ్రీన్‌ అంబాసిడర్‌ విభాగంలో కొర్రా గాసి(పెదలబుడు), డి.మార్కేండేయులు(సీలేరు),వి.బొజ్జన్నదొర(తుంపాడ), ఎన్‌.పోతన్న(బంగారుమెట్ట), స్వచ్ఛ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విభాగంలో అరకులోయ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ, స్వచ్ఛ పర్యాటక ప్రాంతంగా బొర్రా గుహలు, స్వచ్ఛ దేవాలయం సీలేరు ధారాలమ్మ ఆలయం, స్వచ్ఛ రత్నం చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీకి చెందిన కూడ రాణి, స్వచ్ఛ సోషల్‌ మీడియా ఇన్ఫ్యురేన్సర్‌ మై వాయిస్‌- వై వైబ్‌ యూట్యూబ్‌ చానల్‌కు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, సబ్‌ కలెక్టర్‌ కె.చిరంజీవి నాగ వెంకట సాహిత్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమి చైర్మన్‌ వంపూరు గంగులయ్య, టైకార్‌ డైరెక్టర్‌ కె.కృష్ణారావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, డీఎంహెచ్‌వో రియాజ్‌భేగ్‌, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:35 PM