Share News

మద్యం షాపులకు స్వచ్ఛ రథాలు

ABN , Publish Date - May 14 , 2026 | 12:59 AM

జిల్లాలో మద్యం దుకాణాల వైపు స్వచ్ఛ రథాలు కదులుతున్నాయి. మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బార్లలోని ఘన వ్యర్థాలను స్వచ్ఛ రథాలకు అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో పాటు వీటి పర్యవేక్షణ బాధ్యతలను ఎక్సైజ్‌ అధికారులు, ఎంపీడీవోలకు అప్పగించారు.

మద్యం షాపులకు స్వచ్ఛ రథాలు
బుచ్చెయ్యపేట మండలం టైపురం గ్రామంలో స్వచ్ఛ రథంతో ఘన వ్యర్థాలు సేకరిస్తున్న దృశ్యం

ప్లాస్టిక్‌ గ్లాసులు, బాటిళ్లు స్వచ్ఛ రథాలకు అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశం

ఎక్సైజ్‌ అధికారులు, ఎంపీడీవోలకు పర్యవేక్షణ బాధ్యతలు

త్వరలో ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్ల ఏర్పాటు

నర్సీపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం దుకాణాల వైపు స్వచ్ఛ రథాలు కదులుతున్నాయి. మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బార్లలోని ఘన వ్యర్థాలను స్వచ్ఛ రథాలకు అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో పాటు వీటి పర్యవేక్షణ బాధ్యతలను ఎక్సైజ్‌ అధికారులు, ఎంపీడీవోలకు అప్పగించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ రథాల ద్వారా ఘన వ్యర్థాలు సేకరిస్తూ ప్రత్యామ్నాయంగా నిత్యావసర సరుకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైన్‌ షాపులు, బార్లలోని ఘన వ్యర్థాలు సేకరించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 స్వచ్ఛ రథాలు వాటి పరిధిలోని మద్య షాపులు, బార్ల వద్దకు వెళ్లి ఘన వ్యర్థాలు సేకరించాలి. మద్యం షాపుల వద్ద ప్లాస్టిక్‌ గ్లాసులు, వాటర్‌ బాటిళ్లు, వాటర్‌ ప్యాకెట్లు రోడ్లు మీద, ఖాళీ స్థలాలు, డ్రైనేజీల్లో పడేస్తున్నారు. దీని వలన పారిశుధ్య సమస్య తలెత్తడంతో పాటు దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇకపై అటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవల్సిన బాధ్యత వైన్‌ షాపు లైసెన్స్‌దారుడిపై పెట్టారు. మద్యం దుకాణంలో రోజువారీ పోగైన ప్లాస్టిక్‌ ఖాళీ వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్లు, గ్లాసులు ఒక గోనె సంచెలో మూట కట్టి స్వచ్ఛ రథం వచ్చిన తరువాత అందజేయాలి. ఒకవేళ స్వచ్ఛ రథం రావడం ఆలస్యమైతే పంచాయతీ గ్రీన్‌ అంబాసిడర్‌ (పారిశుధ్య కార్మికుడు)కి అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద వ్యర్థాలు పడేయకూడదని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లాలో 155 వైన్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లు, 13 బార్లు ఉన్నాయి. ఘన వ్యర్థాలు స్వచ్ఛ రథాలకు అప్పగించేలా చూడాలని ఎక్సైజ్‌ అధికారులు, ఎంపీడీవోలకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లు

జిల్లాలో 11 ప్రాంతాల్లో ప్రభుత్వం ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు ఏర్పాటు చేయబోతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను బెయిలింగ్‌ చేసే యంత్రాలను మంజూరు చేసింది. పది బస్తాల్లోని ప్లాస్టిక్‌ బాటిల్స్‌ బెయిలింగ్‌ మెషీన్‌లో వేస్తే చిన్న మూటగా మారిపోతుంది. దీని వలన వ్యర్థాలు తరలించడానికి కూడా సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాలు, వైన్‌ షాపులు, బార్ల వద్ద సేకరించిన ఘన వ్యర్థాలు ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కి తరలిస్తారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌ను వివరణ కోరగా వైన్‌ షాపులు, బార్లు, పర్మిట్‌ రూమ్‌ల వద్ద ఘన వ్యర్థాలు నిర్వహణ బాధ్యత లైసెన్స్‌ దారుడదని అన్నారు. స్వచ్ఛ రథం వచ్చినప్పుడు ఘన వ్యర్థాలు అప్పగించాలని, రోడ్లు మీద, ఖాళీ స్థలాల్లో వేయకూడదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 14 , 2026 | 12:59 AM