Share News

పంచాయతీల వర్గీకరణకు శ్రీకారం

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:45 PM

జిల్లాలో పంచాయతీల వర్గీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు కేవలం మేజర్‌, మైనర్‌ పంచాయతీలుగా మాత్రమే ఉన్న వాటిని జనాభా, ఆదాయం ఆధారంగా వర్గీకరిస్తూ సోమవారం జీవో:19ను జారీ చేసింది.

పంచాయతీల వర్గీకరణకు శ్రీకారం
అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ కార్యాలయం

జనాభా, ఆదాయాన్ని బట్టి విభజించిన రాష్ట్ర ప్రభుత్వం

జీవో 19 జారీ

జిల్లాలో మొత్తం 244 పంచాయతీల్లో రూర్బన్‌గా 16, గ్రేడ్‌- 1లో 61, గ్రేడ్‌- 2లో 112, గ్రేడ్‌- 3లో 55

గ్రేడ్‌ల ఆధారంగా ఆయా పంచాయతీలకు ప్రాధాన్యం, నిధుల విడుదలకు అవకాశం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పంచాయతీల వర్గీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు కేవలం మేజర్‌, మైనర్‌ పంచాయతీలుగా మాత్రమే ఉన్న వాటిని జనాభా, ఆదాయం ఆధారంగా వర్గీకరిస్తూ సోమవారం జీవో:19ను జారీ చేసింది. ముఖ్యంగా ఇందులో మండల కేంద్రాలు, అధిక జనాభా, ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా, మిగిలిన వాటిని జనాభా ప్రాతిపదికన మూడు గ్రేడులుగా విభజించింది.

ప్రధానంగా 10 వేలు పైబడి జనాభా కలిగి, ఏడాదికి రూ.కోటి ఆదాయం పొందే పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా వర్గీకరించింది. అలాగే 3 వేలు పైబడి 10 వేలలోపు జనాభా కలిగి ఏడాదికి రూ.30 లక్షలు ఆదాయం పొందే వాటిని గ్రేడు- 1 పంచాయతీలుగా, 3 వేలలోపు జనాభా కలిగిన పంచాయతీలను గ్రేడు- 2గా, 2 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడు- 3గా విభజించింది. దీంతో జిల్లాలోని 11 మండలాల పరిధిలో మొత్తం 244 గ్రామ పంచాయతీలుండగా, వాటిని 16 రూర్బన్‌ పంచాయతీలుగా, గ్రేడు- 1లో 61, గ్రేడు-2లో 112, గ్రేడు- 3లో 55 పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరించింది.

16 పంచాయతీలకు రూర్బన్‌ గుర్తింపు

ఇన్నాళ్లు కేవలం మేజర్‌, మైనర్‌ పంచాయతీలుగా మాత్రమే గుర్తింపు ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తున్నాయి. దీంతో మేజర్‌ పంచాయతీలకు న్యాయం జరుగుతుండగా, మైనర్‌ పంచాయతీలకు నిఽధుల పరంగా అన్యాయం జరుగుతున్నది. ఈ క్రమంలో పంచాయతీల వర్గీకరణలో భాగంగా జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఉన్న 16 పెద్ద పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా గుర్తించారు. అరకులోయ మండలంలో మాడగడ, పద్మాపురం, పెదలబుడు పంచాయతీలు, చింతపల్లి మండలంలో చింతపల్లి, చౌడుపల్లి, కొత్తపాలెం, తాజంగి పంచాయతీలు, డుంబ్రిగుడ మండలంలో పోతంగి పంచాయతీల, జి.మాడుగుల మండలంలో జి.మాడుగుల, గెమ్మెలి, వంజరి పంచాయతీలు, జీకేవీధి మండలంలో దారకొండ, జీకేవీధి, రింతాడ పంచాయతీలు, పాడేరులో మండలం పాడేరు, పెదబయలు మండలం సీతగుంట పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో ఇకపై ఆయా పంచాయతీల్లో అభివృద్ధికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల కానున్నాయని అధికారులు అంటున్నారు. అలాగే పంచాయతీ, వార్డు సభ్యుల గౌరవ వేతనంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి.

జిల్లాలో మొత్తం పంచాయతీల అప్‌గ్రేడ్‌ వివరాలు

వ.సం. మండలం రూర్బన్‌ గ్రేడు- 1 గ్రేడు- 2 గ్రేడు- 3 మొత్తం

1. అనంతగిరి 0 4 18 2 24

2. అరకులోయ 3 7 4 0 14

3. చింతపల్లి 4 13 0 0 17

4. డుంబ్రిగుడ 1 6 11 0 18

5. హుకుంపేట 0 3 13 17 33

6. జి.మాడుగుల 3 6 8 0 17

7. జీకేవీధి 3 9 3 0 16

8. కొయ్యూరు 0 2 16 15 33

9. ముంచంగిపుట్టు 0 3 17 3 23

10. పాడేరు 1 4 8 13 26

11. పెదబయలు 1 4 14 4 23

-----------------------------------------------------------------------------------------------

మొత్తం 16 61 112 55 244

Updated Date - Mar 09 , 2026 | 11:45 PM