Share News

గూడుపుఠాణి

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:14 AM

జిల్లాలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన మెటీరియల్‌ పక్కదారి పట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘రాక్‌ట్రీ’ ఇన్‌ఫ్రా సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్టు వెలుగుచూడడంతో హౌసింగ్‌ ఇంజనీర్లపై చర్యకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

గూడుపుఠాణి

పేదల ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు

హౌసింగ్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసిన నిర్మాణ సామగ్రి పక్కదారి

కింది నుంచి పై వరకూ అందరికీ వాటాలు

‘రాక్‌ట్రీ’ నుంచి రూ.22 కోట్ల రికవరీకి విజిలెన్స్‌ సిఫారసు

మిగిలిన నిర్మాణ సంస్థలపై దృష్టిసారించని వైనం

విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన మెటీరియల్‌ పక్కదారి పట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘రాక్‌ట్రీ’ ఇన్‌ఫ్రా సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్టు వెలుగుచూడడంతో హౌసింగ్‌ ఇంజనీర్లపై చర్యకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రతి లేఅవుట్‌లో ఇసుక, ఇనుము, సిమెంట్‌ దుర్వినియోగమైనట్టు చెబుతున్నారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసిన మెటీరియల్‌లో 20 నుంచి 30 శాతం దారిమళ్లినట్టు తెలిసింది. లేఅవుట్‌లో మెటీరియల్‌ను రిసీవ్‌ చేసుకునే క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు అందరి పాత్ర ఈ వ్యవహారంలో ఉందని అంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో మొత్తం 65 లేఅవుట్‌లలో సుమారు 80 వేల ఇళ్లు పనులు ప్రారంభించిన అధికారులు అప్పట్లో కార్పొరేషన్‌ నుంచి మెటీరియల్‌ సరఫరాకు ఇండెంట్‌ పెట్టేవారు. రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా సంస్థ పైడివాడ అగ్రహారం, గంగవరం, నడుపూరు, గొల్లలపాలెంలో 14,021 ఇళ్ల పనులు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇనుము, రాయలసీమలోని భారతి సిమెంట్స్‌ నుంచి సిమెంట్‌, శ్రీకాకుళం, రాజమండ్రి నుంచి ఇసుక సరఫరా చేసేవారు. అయితే చేసిన పనుల కంటే ఎక్కువగా జరిగినట్టు కిందిస్థాయి ఇంజనీర్లు నిర్ధారిస్తే డీఈ, ఆ తరువాత ఈఈ స్థాయి అధికారులు బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. మొత్తం 14,021 ఇళ్లలో 4,929 ఇళ్లకు సంబంధించి చేసిన పనుల విలువ కంటే అదనంగా మంజూరుచేశారు. దీనికి సంబంధించి రూ.5.88 కోట్లు రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా నుంచి రికవరీ చేయాలని గత ఏడాది డిసెంబరులో విజిలెన్స్‌ అధికారులు సిఫారసు చేశారు.

అలాగే ఇళ్ల నిర్మాణాలకు కార్పొరేషన్‌ సరఫరా చేసిన మెటీరియల్‌ను తక్కువగా రికార్డుచేశారు. మిగిలిన మెటీరియల్‌ను పక్కదారి పట్టించారు. అంతేగాకుండా మెటీరియల్‌ సొమ్మును లేబర్‌ కాంపొనెంట్‌గా రికార్డు చేసి కార్పొరేషన్‌ నుంచి నిర్మాణ సంస్థకు బిల్లులు మంజూరుచేయించారు. దీనివల్ల కార్పొరేషన్‌కు రూ.11.87 కోట్లు నష్టం వచ్చినట్టు విజిలెన్స్‌ అప్పట్లో గుర్తించింది. ఇంకా పునాదులు తీసే సమయంలో నిర్ణీత లోతు కంటే తక్కువ తీశారు. కానీ నిర్ణీత లోతులోనే పైల్స్‌ వేశారని బిల్లులు డ్రా చేయడం ద్వారా కార్పొరేషన్‌కు రూ.5.01 కోట్లు నష్టం వాటిల్లినట్టు విజిలెన్స్‌ గుర్తించింది. మొత్తం రాక్‌ట్రీ నుంచి రూ.22 కోట్లు రికవరీ చేయాలని సిఫారసు చేసిన విజిలెన్స్‌, అందుకు ఇంజనీర్లను బాధ్యులను చేసింది. ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు సంబంధిత నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ సంస్థలో కొందరితో సిబ్బంది, అధికారులు మిలాఖత్‌ అయి మెటీరియల్‌ను తక్కువ ఉపయోగించి మిగిలినదాన్ని అమ్ముకున్నారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది భారీగా సొమ్ములు వెనకేసుకున్నారు. వారితో డీఈ, ఈఈలు అవగాహనకు వచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయి. రాక్‌ట్రీ ఒక్కటే కాకుండా మిగిలిన నిర్మాణ సంస్థలకు కార్పొరేషన్‌ సరఫరా చేసిన మెటీరియల్‌లో కొంత పక్కదారి పట్టినట్టు చెబుతున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న అధికారుల్లో ఇద్దరు, ముగ్గురు నగరం, కొత్తవలస ప్రాంతంలో ఆస్తులు కూడబెట్టుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నిర్మాణ సంస్థలు చేపట్టిన ఇళ్ల నాణ్యతను తనిఖీ చేస్తే అందరి బాగోతాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 01:14 AM