Share News

పౌర సరఫరాల శాఖ దాడులు

ABN , Publish Date - May 16 , 2026 | 12:46 AM

నగరంలో రేషన్‌ డీలర్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించారు.

పౌర సరఫరాల శాఖ దాడులు

స్టాకు తక్కువగా ఉన్న రెండు డిపోలపై కేసులు

సరుకులు పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని డీలర్లకు జిల్లా అధికారి హెచ్చరిక

విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రేషన్‌ డీలర్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించారు. రెండు, మూడు బృందాలుగా ఏర్పడి పలు డిపోలను తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో ఉన్న వివరాలతో డిపోలో గల స్టాకును పోల్చి చూశారు. కలెక్టరేట్‌ సమీపాన రెల్లివీధిలో గల డిపో (నంబర్‌ 260)లో 4,200 కిలోల బియ్యం, 176 పంచదార ప్యాకెట్లు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కరోనా సమయంలో అప్పటి అధికారులు ఈ డిపో నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా రెల్లి వీధి ప్రాంతానికి చెందిన డ్వాక్రా సంఘానికి అప్పగించారు. సంఘం తరపున వారి కుటుంబ సభ్యులే ఈ డిపోను నిర్వహిస్తున్నారు. స్టాకు వివరాలు తక్కువగా ఉండడంతో డిపోపై కేసు నమోదుచేశారు. తాత్కాలికంగా ఆ డిపోను రెల్లి వీధి, ఏవీఎన్‌ కళాశాల పరిసరాల్లో ఉన్న డిపోలకు కాకుండా దూరంగా ఉన్న కురుపాం మార్కెట్‌ ప్రాంతంలో గల డిపో (నంబరు 245) డీలర్‌కు అప్పగించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అప్పుఘర్‌ ప్రాంతంలో గల మరో డిపో (నంబరు 191)లో 2,875 కిలోల బియ్యం, 200 గోధుమపిండి ప్యాకెట్లు, 160 పంచదార ప్యాకెట్లు తక్కువగా ఉన్నట్టు గుర్తించి కేసు నమోదుచేశారు. నిబంధనల మేరకు డిపోలు నిర్వహించకుండా సరుకులు పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కరరావు హెచ్చరించారు. నగరంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా ముమ్మరం చేయాలని పౌరసరఫరాల శాఖ యోచిస్తోంది. అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు, విజిలెన్స్‌ సహాయంతో బృందాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

Updated Date - May 16 , 2026 | 12:46 AM