నగరం ముస్తాబు
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:13 AM
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫ్లీట్‌రివ్యూ, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కోసం నగరం సర్వాంగసుందరంగా ముస్తాబయింది.
ఐఎఫ్‌ఆర్, మిలాన్‌కు భారీ ఏర్పాట్లు
అభివృద్ధి పనులు చేపట్టిన జీవీఎంసీ
కొత్తకళను సంతరించుకున్న తెలుగుతల్లి ఫ్లైవోవర్
విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫ్లీట్‌రివ్యూ, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కోసం నగరం సర్వాంగసుందరంగా ముస్తాబయింది. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం చంద్రబాబునాయుడు, దేశవిదేశాలకు చెందిన నౌకాదళ అధికారులు భారీగా హాజరుకానున్నారు. దీంతో నౌకాదళ విన్యాసాలు జరిగే బీచ్‌రోడ్డుతోపాటు అతిఽథులు బసచేసే హోటళ్లు, ప్రయాణించే మార్గాల్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో రూ.18.5 కోట్లతో అభివృది, పెయింటింగ్ వంటి సుందరీకరణ పనులు పూర్తిచేశారు. బీచ్‌రోడ్డులోని విశాఖ మ్యూజియం భవనానికి మరమ్మతులు చేశారు. దీంతో మ్యూజియం కొత్తకళను సంతరించుకుంది. బీచ్‌రోడ్డులోని జంతువుల విగ్రహాలకు కొత్తగా రంగులు అద్దడంతో ఆకట్టుకుంటున్నాయి. తెలుగుతల్లిఫ్లైఓవర్‌పై పూలకుండీల్లో కొత్తమొక్కలను నాటి, కుండీలకు వేర్వేరు రంగులు వేశారు. ఫ్లైఓవర్ పొడవునా వివిధదేశాల నేవీకి చెందిన పతాకాలను ఏర్పాటుచేయడంతో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.