11 నెలల్లో రూ.750 కోట్లతో నగరాభివృద్ధి
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:12 AM
జీవీఎంసీ మేయర్‌గా పనిచేసిన ఈ 11 నెలల కాలాన్ని తన జీవితంలో మరిచిపోలేనని పీలా శ్రీనివాసరావు అన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చా
నిధుల కేటాయింపులో సమన్యాయం
నగరవాసులు, కార్పొరేటర్లు, అధికారుల సహకారం మరువలేనిది
జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్‌గా పనిచేసిన ఈ 11 నెలల కాలాన్ని తన జీవితంలో మరిచిపోలేనని పీలా శ్రీనివాసరావు అన్నారు. మేయర్‌గా మంగళవారం చివరిరోజు కావడంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో జీవీఎంసీ పరిధిలో సుమారు రూ.750 కోట్లతో అభివృద్ధిపనులు చేపట్టామన్నారు. గుడ్‌మార్నింగ్ పేరుతో వార్డులో క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చానని, పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లకు నిధుల కేటాయింపులో సమన్యాయం పాటించానన్నారు. తన హయాంలో నగరం వేదికగా జరిగిన ఐఎఫ్‌ఆర్ వంటి కార్యక్రమాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపువచ్చేలా ఏర్పాట్లుచేశామన్నారు. బీచ్‌రోడ్డులో రాత్రిపారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, అవకతవకలను సరిదిద్దానన్నారు. రాత్రివేళ బీచ్‌ను సందర్శించే పర్యాటకులకు ఎగసిపడుతున్న అలలు కనిపించేలా అధిక కాంతినిచ్చే హైమాస్ట్ లైట్లను తీరంలో ఏర్పాటుచేశామన్నారు. నగరవాసులతోపాటు కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారుల సహకారంతో దిగ్విజయంగా పాలన సాగించానని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ వల్లనే తనకు మేయర్‌గా పనిచేసే అవకాశం దక్కిందని, పాలకవర్గం పదవీకాలం ముగిసినందున ఇకపై పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతానన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా పార్టీకి సేవ చేస్తానన్నారు. జీవీఎంసీలోని కొన్నివిభాగాల పనితీరు బాగోలేదని, వాటిని సరిదిద్దేందుకు భవిష్యత్తులోనూ తన వంతు ప్రయత్నిస్తానన్నారు.