ఏయూలో సిటీ సెంట్రల్ లైబ్రరీ
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:58 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో సిటీ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు సమాచారం. ఇప్పటి కే వివిధ దశల్లో అధికారులు నిర్వహించిన సమావేశాల్లో లైబ్రరీ నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రూ.50 కోట్ల వ్యయంతో సుమారు 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాన్ని నిర్మించేలా ప్రణాళికలు రూపొం దించారని తెలిసింది.
రూ.50 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు
స్థలాన్ని సమకూర్చాలని కోరిన ప్రభుత్వం
రెండు, మూడు చోట్ల పరిశీలించిన అధికారులు
80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
గ్రంథాలయ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌ఆర్ నిధుల వినియోగం
భూమి కేటాయింపుపై వర్సిటీ వర్గాల అభ్యంతరం
విశాఖపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో సిటీ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు సమాచారం. ఇప్పటి కే వివిధ దశల్లో అధికారులు నిర్వహించిన సమావేశాల్లో లైబ్రరీ నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రూ.50 కోట్ల వ్యయంతో సుమారు 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాన్ని నిర్మించేలా ప్రణాళికలు రూపొం దించారని తెలిసింది.
లైబ్రరీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం కేటాయించ నుంది. ఇప్పటికే రెండు, మూడు చోట్ల స్థలాన్ని గ్రంథాలయ సంస్థ అధికారులు పరిశీలించారు. సుమారు రెండు ఎకరాల స్థలంలో ఐకానిక్ భవనాన్ని నిర్మించి, రాష్ట్రానికి గర్వంగా నిలిచేలా లైబ్రరీని తీర్చిదిద్దాలని మంత్రి లోకేశ్ సూచించడంతో చెన్నైతో పాటు వివిధ ప్రాంతాల్లోని గ్రంథాలయాలను పరిశీలించి డిజైన్‌ను ఆమోదించినట్టు చెబుతున్నారు. ఐకానిక్ బిల్డింగ్‌లో ఒకేఎంట్రీలో రెండువైపులా లైబ్రరీలుంటాయి. ఇందులో ఒకటి ఏయూకు, మరొకటి జిల్లా గ్రంథాలయ సంస్థకు కేటాయిస్తారు. ఏయూకు కేటాయించే లైబ్రరీలో వర్సిటీలో నిర్వహించే కోర్సులు, ఇతర పరీక్షలకు సంబంధించిన పుస్తకాలుంటాయి.విద్యార్థులు ప్రత్యేకపాస్ తీసుకుని గ్రంథాలయంలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు కేటాయించే లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులంతా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో సుమారు నాలుగు లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతారని చెబుతున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో..
వర్సిటీలోని నార్త్ క్యాంపస్, బీచ్ రోడ్డులోని ఏయూ స్థలంతోపాటు ప్రధాన క్యాంపస్‌లో పలు చోట్ల స్థలాలను అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో లైబ్రరీ నిర్మించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధునాత హంగులతో ప్రత్యేక మోడల్‌గా నిలిచేలా భవన నిర్మాణాన్ని చేపట్టాల ని మంత్రి లోకేశ్ సూచించడంతో అధికారులు డిజైన్లపై ఫోకస్ చేశారు. ఇందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ, రాష్ట్రప్రభుత్వం, సీఎస్‌ఆర్ నిధులు వినియోగించను న్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి రూ.50 కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేశారు. ఇది మరింత పెరిగి సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని సమాచారం.
వర్సిటీ వర్గాల అభ్యంతరం
ఏయూకు చెందిన అత్యంత విలువైన సుమారు రెండు ఎకరాల భూమిని సిటీ సెంట్రల్ లైబ్రరీకి కేటాయిస్తుండడంపై వర్సిటీవర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టడంపై విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిని ఇతర అవసరాలకు వినియోగిస్తే భవిష్యత్తులో వర్సిటీ అవసరాలకు లేకుండా పోతుందని, గతంలో కేటాయించిన భూములతో వర్సిటీకి కలిగిన లబ్ధి, రావాల్సిన పరిహారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. దీనిపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో ల్రైబరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, వర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడేలా నిర్మిస్తామని తెలిపారు.