Share News

నగరం సుందరీకరణ

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:31 AM

విశాఖపట్నం ప్రజలకు శుభవార్త. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు మంజూరుచేసింది. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఆగమేఘాలపై రూ.400 కోట్ల పనులు దేనికి అంటే...నవంబరులో సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరగనుంది. దానికి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, అధికారులు రానున్నారు. అతిథులకు అందంగా కనిపించేలా నగరాన్ని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన.

నగరం సుందరీకరణ

రూ.400 కోట్లు విడుదల

పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో

నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం

రహదారులు, డివైడర్ల మరమ్మతు, పచ్చదనం పెంపు

జంక్షన్ల ఆధునికీకరణ, విద్యుద్దీపాల అలంకరణ...

ఇప్పటికే పనులు ప్రారంభించిన అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం ప్రజలకు శుభవార్త. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు మంజూరుచేసింది. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఆగమేఘాలపై రూ.400 కోట్ల పనులు దేనికి అంటే...నవంబరులో సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరగనుంది. దానికి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, అధికారులు రానున్నారు. అతిథులకు అందంగా కనిపించేలా నగరాన్ని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది నవంబరులో పెట్టుబడిదారుల సదస్సు భారీగా నిర్వహించారు. పెట్టుబడులు కూడా అదేస్థాయిలో వచ్చాయి. ఈసారి అంత కంటే భారీగా సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన సదస్సుకు ముందే వివిధ ప్రాంతాల్లో రీజనల్‌ పెట్టుబడిదారుల సదస్సులు కూడా నిర్వహిస్తోంది. విశాఖలో అక్టోబరు ఏడో తేదీన ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగరంలో సుందరీకరణ పనులకు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. అన్ని జంక్షన్లను రకరకాల థీమ్‌లు, బొమ్మలతో తీర్చిదిద్దారు. ఇప్పుడు మళ్లీ ఆయా జంక్షన్ల ఆధునికీకరణ, మొక్కల పెంపకం, విద్యుద్దీపాల అలంకరణకు తాజాగా మంజూరుచేసిన నిధులను ఖర్చు చేయనున్నారు.

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో నవంబరు 12, 13 తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు జరగనున్నది. ఈ నేపథ్యంలో సిరిపురం దత్‌ ఐలాండ్‌ నుంచి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ దాటి పోలమాంబ ఆలయం వరకు గల మార్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని పనులు చేపట్టారు. ఆ మార్గం మధ్యలో మీడియన్‌, దానిపై మొక్కలు, అక్కడి జంక్షన్‌ అభివృద్ధిని ప్రణాళికలో పొందుపరిచారు. అలాగే నగరంలో ప్రధాన రహదారులు, డివైడర్ల మరమ్మతులు, గ్రీనరీ పెంపు వంటివి చేపడతారు. నగరం అంతటా ఆధునిక విద్యుద్దీపాలు అమరుస్తారు. ఇవన్నీ అక్టోబరు నెలాఖరుకే పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పనులన్నీ నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీకి అప్పగించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జీ-20 సదస్సు పేరుతో ఇలాగే వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. అప్పట్లో నిర్మించినవి ఏవీ ఇప్పుడు మనుగడలో లేవు. ఈ పనులైనా కనీసం ఐదేళ్లు ఉండేలా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏసీ లాంజ్‌ల నిర్మాణం చేస్తే బాగు

పనిలో పనిగా భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఏసీ లాంజ్‌ల నిర్మాణం చేపట్టాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం కోరుతోంది. ఒక్కో లాంజ్‌కు రూ.5 లక్షలు చొప్పున ఎనిమిది లాంజ్‌లకు రూ.40 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఆ నిధులు తమ వద్ద లేదని ఇప్పటికే జీఎంఆర్‌ యాజమాన్యం చేతులు ఎత్తేసింది. దాంతో ఆర్‌టీసీ బస్‌ బేలు నిర్మిస్తామని చెప్పింది. వాటి జాడ లేదు. కాబట్టి సదస్సు నాటికి ఈ నిధులతోనే ఏసీ లాంజ్‌ల నిర్మాణం కూడా చేపట్టాలని సూచిస్తున్నారు.

Updated Date - Oct 01 , 2026 | 01:31 AM